21, డిసెంబర్ 2022, బుధవారం

మొలకల పున్నమి - వేంపల్లి గంగాధర్

➦ రాయలసీమ బతుకు దర్పణం - మొలకల పున్నమి




బతుకు నిండా కన్నీళ్ళు ఉన్నాయి అని చెప్పడం కంటే ఆ కన్నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో, ఎలా జీవితాలని నడిపిస్తున్నాయో, కుదిపేస్తున్నాయో, ఎవరిచేత ఆ కన్నీళ్ళు రాలుతున్నాయో, ఎవరు బాధింపబడుతున్నారో,ఆ కన్నీళ్ల వాసన,రంగు,రాలిన విధానం… ఇవన్నీ చూపుడువేలితో  రచైత చూపించాలి. పీడిత వర్గాల వైపు నిలబడి,తమ ప్రాంత జీవన విధానాన్ని,భాషా పలుకుబడిని,ఈ రాజ్యంలో స్థితి ఇదేనన్న ముద్రను తుడిచిపెట్టి ఎవరూ చూడని కొత్త కోణంలోంచి కథలు రాస్తే అదే మంచి సాహిత్యం అని నా ఫీలింగ్.
రాయలసీమ ప్రాంతం నుంచి చాలానే సాహిత్యం వచ్చింది. అక్కడ జీవనశైలి, వర్షాలు లేని దుస్థితి, మనుషులు, వాతావరణం ఇవే ఎక్కువగా రాయబడ్డాయి.
కరువు కాటకాలు మధ్య కుక్కబడ్డ జీవితాలుగా, ఫ్యాక్షనిజం ప్రవహించే ప్రాంతంగా పరిగణించే రాయలసీమ ప్రాంతంలోంచి ఎవరికి తెలియని కోణాల్లో చూడగలిగిన కథలు వేంపల్లి గంగాధర్ రాసిన 'మొలకల పున్నమి'. 2011కు గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. మొత్తం 13 కథలు. ఒక్క కథలో protagonist చెప్పే ముచ్చట్లు అలివిగానివి. ప్రతీ కథలో చిత్రించే వాతావరణం, కథా శైలి, సంఘటనలు, ఎత్తుకు పై ఎత్తులు, narration కళ్ళు మూయనివ్వవు.
రచైత రచనా పద్ధతి ఎంత సౌందర్యాన్ని పరిమళింపజేస్తుంది. Poetical line లు వాడుతూ, రాయలసీమ ప్రాంతంలో మాట్లాడే డైలక్ట్ ని పాత్రల్లోకి ఒంపి కథను వర్ణించే తీరు ఒక elixir ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాగ కథ రాయడంలో నాకు సమ్మెట ఉమాదేవి గారు,గోపిని కరుణాకర్ బాగా ఇష్టం. కథని కవితాత్మకంగా నడపడం గొప్ప టెక్నిక్.
*
'యామయ్య సామి గుర్రం' వేసుకుని ఏ ఊరికి వెళ్ళి అక్కడ ప్రదర్శన చేస్తే అక్కడ మోడాలు (మేఘాలు) కరిగి వర్షం కురుస్తుందన్న ప్రజల విశ్వాసాన్ని చిత్రించాడు. ఆ విన్యాసాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
Love stories లో 
నాకు ఫేవరెట్ గా మారిన కథల్లో 'శిలబండి', 'మొలకల పున్నమి' కతలు. శిలబండి కథ చదువుతూ ఉంటే నాకు గోపిని కరుణాకర్ రాసిన 'బారతం బొమ్మలు' కథల సంపుటిలోని 'కానుగపూల వాన' గుర్తొచ్చింది. గుండెల్ని తడిగా మార్చిన కథ. ఊహకు అందకుండా నడిచే ఇంకో ప్రేమ కథ 'మొలకల పున్నమి'.
రైతుల అవస్థ గురించి కథల్లో ఏదోక సందర్భంలో, సంఘటనలో మాట్లాడతాడు. అందులో ఆధునికతకు దగ్గరగా అనిపించిన కథ 'మూడు పదున్ల వాన'. రైతు కన్నీళ్ల రుచి చూపించింది.
డేగల రాజ్యం కథలో రాజకీయాలు రాయలసీమలో తెచ్చిన వ్యధలు,వధలు పూసుగుచ్చినట్టు చెప్తాడు. ఎవరు ఏనుగులు మీదకెక్కడానికి ఎన్ని చిన్నెలు వేస్తారో,బలయ్యే వర్గాలు ఏమిటో బలంగా చూపెట్టాడు. అలాగే దొరల దారుణమైన పెత్తనాలని చూపించే కథ 'ఏడులాంతర్ల సెంటరు'.
మనుషులెంత ఆశా జీవులో చెప్పే కథ 'దింపుడు కల్లం ఆశ'. ఊరిని కంటికి రెప్పలా చూసుకున్న మనీషి ధర్మారెడ్డి చనిపోతే అక్కడ చుట్టూ ఊర్ల దుఃఖం, దింపుడు కల్లం దగ్గర బతుకుతాడేమోనన్న ఆశ కన్నీళ్ల పర్యంతం చేస్తుంది.
'మైనం బొమ్మలు' లంబాడీ జీవితాల్లో కొత్త కోణాన్ని చూపించింది. సమ్మెట ఉమాదేవి రేలపూలు,జమ్మిపూలు కథలు చదివినంత భావన కలిగింది.
మనుషులని స్మరణ చేసుకుని ఆ ఆప్యాయతని,జీవన విధానాన్ని, కన్నీళ్ల లోయలని,కన్న బిడ్డను బాగా చూసుకోవాలని జానకమ్మ లాంటి ఎందరో  పూల మనుషుల కష్టాన్ని,పూల మాల కట్టినంత అందంగా రాశాడు. ముగింపు టర్నింగ్ పాయింట్.
అభివృద్ధి పేరుతో ఊర్లని ఎలా నాశనం చేస్తారో,అధికారుల లోభితనం,ధన కక్కూర్తిని, ఏం సదుపాయం లేక రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న 'దొమ్మరపాళెం' గ్రామం ద్వారా చూపిస్తాడు. ఇందులో సహృదయుడైన వీరయ్య తాత పాత్ర విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భాలు గురించి పల్లిపట్టు నాగరాజు యాలై పూడ్సింది అనే కవితలో
'దేశం లోపల దొరల సంగతేందీ..?
.
తెలుపు గురించి మాట్లాడే ముందు
నలుపు గురించి కూడా మాట్లాడాలి
వ్యధను గురించి మాట్లాడే ముందు
వధను గురించి కూడా మాట్లాడాలి '
అన్న కవితా పంక్తులు వీరయ్య తాత లేఖలో గమనించొచ్చు.
చిట్టచివరిగా 'మంత్రసాని వైద్యం' కన్నీళ్ళతో మొదలై కొత్త పొద్దుతో ముగుస్తుంది. 
కథల్ని చాలా వరకు summarize కావాలనే చేయలేదు. ఎందుకంటే ఫలానా కథలో సారాంశం ఇంతే అని చెప్పడానికి రచయిత విధానం అంతా ఇంతా కాదు. అది శోచనీయమైన అభివ్యక్తి, శైలి.

*

“If literature truly possesses a mysterious power, I think perhaps it is precisely this: that one can read a book by a writer of a different time, a different country, a different race, a different language, and a different culture and there encounter a sensation that is one's very own.”
―  అంటాడు చైనా రచయిత Hua You.
అతనన్నట్టుగా పై వాక్యాలు ఈ పుస్తకానికి సరిపోతాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో ఓ చారిత్రక నేపథ్యం ఉంది,కాలం వుంది, రాయలసీమ జీవుల వ్యధలు, కన్నీళ్ళున్నాయి, అక్కడ మాట్లాడే మాండలికముంది, సంస్కృతి ఉంది. సామాజిక, రాజకీయ,ప్రాంత పరిస్థితులను బాగా పరిశీలించి మనముందు కుప్పపోసిన కథలు. 
You'll definitely cuddle this book
😍
~
లిఖిత్ కుమార్ గోదా 


20, డిసెంబర్ 2022, మంగళవారం

మైరావణ - ప్రసాద్ సూరి (సూరాడ)

➤ జానపద కథానాయకుడు అను 'మైరావణ'

@ ప్రసాద్ సూరి -(A short note)

~

'సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. మారితే రెండు ప్రమాదాలు.

ఒకటి కాదనలేవు

రెండు నిరూపించలేవు.'



ఇవి ప్రసాద్ సూరి రాసిన 'మైరావణ' నవల Opening line లు. మనం పెద్దగా opening lines గురించి చర్చించం. కానీ చాలా మటుకు అదే ఆ రచనకు పునాది. చాలా వరకు ఇంగ్లీష్ రచనల్లో ఈ ప్రధానమైన విషయం మనకు తెలుస్తుంది. ఈ నవల మొత్తాన్ని కూడా పైన quote చేయబడిన వాక్యాలతో ముందుకు నడిపిస్తాడు. ఆ వాక్యాలని నిరూపిస్తాడు కూడా. 



అచ్చంగా కె.జి.ఎఫ్ తరహాలో సినిమా చూసినంత ఫీలింగ్. A youngster writing about a gangster. కాకపోతే ఇది అస్థిత్వాన్ని చూపించే నవల. చేపలు పట్టడం,పాటు (చేపల వేట),వాడోళ్ళకు మాత్రమే పరిమితమైన పదాలు. వీటన్నింటినీ కేవలం డాక్యుమెంట్ మాత్రమే చేయలేదు. ప్రతీ సంఘటనలో మనల్ని పుట్టులో కూర్చోబెట్టి కథను చూపిస్తాడు.


కాలాన్ని డాక్యుమెంట్ చేయగలగడం సాహిత్యంలో గొప్ప విషయం. ఆ పని సూరి చేశాడు. తన కాలాన్ని,తన ముందు బతికిన తాతల కాలాన్ని,సముద్ర ఆధారిత జీవుల పోరాటాన్ని,మనుగడని, అస్థిత్వాన్ని,దుస్థితి, నేపథ్యాన్ని ఇంకా చాలా చాలా.


నవల ఒక వైపు మైరావణుడు గురించి సాగుతుంది. సీన్ కట్టై మళ్ళీ ఎక్కడో జైల్లో ఉన్న ఎనబై ఏళ్ల KKR దగ్గర, అక్కడ కట్టై పోలీస్ అశోక్ దగ్గర, అక్కడినుంచి రిపోర్టర్ మాహి త్యాగి దగ్గర కథను కొన్ని సినిమా సీన్లు చూపించినట్లు చూపిస్తుంటాడు. దేశంలో ప్రస్తుతం రాజకీయాల విష వలయాల గురించి, ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా దుర్మార్గమైన ప్రభుత్వాల మోచేతి నీళ్లు తాగుతూ భజనలు, Fake news లు spread చేస్తున్న దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు చూపించాడు.లెఫ్టిస్టుల మీద ఎన్ని కుట్రలు పన్ని వాళ్ళు కోరుకునే ప్రశాంతతని, స్వేచ్ఛని వాళ్ళకే లేకుండా జైళ్ళల్లో ఎలా హింసిస్తారో కూడా రాశాడు. 


 ఇందులో ముఖ్యంగా నన్ను ఆకర్షించిన పాత్రలు మైరావణుడి తల్లి గైరమ్మ కథ. తాత నూకన్న కథ. కాలంలో మూడు తరాల కథల్ని పట్టి చూపించాడు. 


1924లో ఒక సంఘటన -

తన తండ్రిని కొడుతున్నాడన్న నెపంతో బ్రిటిష్ సోల్జర్ ని చంపి, అమ్మమ్మ దగ్గరికి పారిపోతే ఆమె నూకన్నని రంగూన్ పంపిస్తుంది. పదిహేనేళ్ల పిల్లోడి దగ్గర నుండి మంచి కుర్రకారు వయసుకు వచ్చే దాకా అక్కడే తన రైతు కుర్రోళ్ళతో బతకడం, ద్రౌపది వస్త్రాపహరణం నాటకంలో భీముడి వేషం వేసినప్పుడు తననే తదేకంగా చూసిన రంగూన్ పిల్ల 'తార' నచ్చడం. ఇద్దరూ కలవడం. రెండవ ప్రపంచ యుద్దం మొదలవుతుందని వాళ్ళు నమ్మే దేవుడు ద్వారా తెలీడంతో తార నూకన్నకి ఒక బరిణె ఇచ్చి పంపించడం,వేల కిలోమీటర్లు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని నడవడం, దారిలో నరకం ఎలా ఉంటుందో చూడడం (మనకీ చూపిస్తాడు),తార ఇచ్చిన బరిణె పోగొట్టుకోవడం, తిరిగి సొంత దేశం వచ్చి బ్రతకడం,గైరమ్మ పుట్టాక ఒక అవమానం వల్ల ఇళ్ళు వదిలిపోవడం ఇదీ నూకన్న కథ. చివరికెప్పుడో కనిపిస్తాడు.


*


గైరమ్మ కష్టాలు, కుటుంబ పోషణ, కన్నీళ్ళు చూపిస్తాడు. గాబ్రియేల్ గార్షియా మార్క్వేజ్ - One Hundred years of Solitude నవలలో బువాందియాల ఒక్క కుటుంబంతో మెకాండో ఊరు ఏర్పడినట్లు, గైరమ్మ వాళ్ళ ఊరు ఎలా ఏర్పడిందో చెప్తాడు. 


*


అనేక జానపద కథలు, పురాణ మహిరావణుడి కథ - అదే మైరావణుడి కథ, ఊర్లలో ఓట్రించుకుంటూ ఎదుగుతున్న మనుషులమీద ఊరోళ్ళు ఎన్ని పుకార్లు కహానీలు నిందలు పుట్టిస్తారో ఆ మనస్థత్వాలని దగ్గరగా చూపిస్తాడు. ఉల్లిపొరల్లా సాగే ఈ నెరేషన్ విసుగను రానివ్వదు. 


అసలు మైరావుడి కథ చదువుతున్నంత సేపు కొన్ని bgms పుడతాయి. అదీ ప్రేమ విషయంలో కానీ, ఓ గ్యాంగ్ లీడర్ లా తారసపడ్డప్పుడు గాని ఎప్పుడైనా. మైరావుడి ఎంట్రీనే అటు జానపద కథలో చదువుతున్న, లింగాన్ని ఎత్తేటప్పుడు చదువుతున్నా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాడబలిజ ఐన మైరావణుడు అలియాస్ జగన్నాథ రావ్ చేపలు పట్టడం దగ్గర నుంచి దేశంలో పేరుమోసిన గ్యాంగ్ స్టార్ దాకా ఎలా ఎదిగాడు అనేది కథ. తను కల కన్న చెంఘీజ్ ఖాన్ లాగ తను మారాడా లేదా అన్నది కథ. మొత్తానికి ప్రసాద్ సూరి Magical Realismలో కొత్తదైన శైలితో ఒక తోపు నవల రాశాడు.


*


ఈ కాలానికి ఇది అవసరమైనది. కొత్త పాత కలిపి మంచి నవల రూపొందించి కొత్త రచయితలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు. చారిత్రక, సామాజిక, ఆర్థిక విషయాలను ఇందులో చోడించడం గొప్ప flavour అందిస్తుంది. తప్పక చదవాల్సిన పుస్తకం. Love you Prasad Suri Anna 💜💜


మొన్నటి దాకా సూరి చింరంజీవే. కానీ ఇప్పుడు పరకాయ ప్రవేశం చేసి మైరావణుడయ్యాడు. తన writing style లోని పరివర్తనం great. 


ప్రసాద్ సూరి Readability చదవకుండా ఆపలేం. ఒకసారి challenge చేయండి అందరూ 😊


~


19-12-2022

12, సెప్టెంబర్ 2022, సోమవారం

పరివర్తనం - గోపిచంద్

  • Cuddledbooks -4


➡ ఒంటరితనపు సంఘర్షణ - గోపిచంద్ 'పరివర్తనం' 




'సంఘాన్ని ఎదుర్కోవటానికి భయపడి, నీ పిరికితనాన్ని కప్పిపుచ్చుకోటానికి ఒక సిద్ధాంతాన్ని సృష్టిస్తున్నావు'-

'పరివర్తనం' నవలలో అస్తమిస్తున్న సూర్యుడితో, ఉదయించే సూర్యుడు చెప్పే మాట ఇది. మనిషి తాను బాగా ప్రేమించే ఆశయాన్నో,మనిషినో పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో అంతుపోక ఒక్కడిగా మిగిలిపోయి, సమాజంతో సంబంధాలు లేకుండా మిగిలిపోతాడు. అతను సమాజాన్ని పట్టించుకోడు, అతనిని సమాజం పట్టించుకోదు. ఆ క్రమంలో అతను పొందే మానసిక అవస్థ,ఏ ఒక్క జ్ఞాపకానికి సంబంధించిన విషయాలు ఎదురుపడ్డా ఇంకా కృంగిపోయే పరిస్థితి ఎదురౌతుంటుంది. దాన్ని బహుశా ఏదీ నివారించ లేకకపోవచ్చు. జీవితాన్నంతా కోల్పోతున్నట్టే అవగతమవ్వదు. మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి నిరాశనే మిగిలిస్తుంటాం.


Author: Gopichand 


ఈ సమస్యలతో తిరుగాడే వ్యక్తులు మనలో ఎందరో! ఇలాంటి అనేకానేక దృశ్యాలను కళ్ళముందుకు పట్టుకొస్తాడు గోపిచంద్ ఈ నవలలో. ఇది ఒక ఇంటికి,ఒక వ్యక్తికి,ఆ వ్యక్తికి అనుసంధానమైన ఇతర వ్యక్తులకే పరిమితమైన నవల కాదు. ఇందులో సంఘం తాలూకా సంఘజీవి అయిన ప్రతీ ఒక్కరిదీ. 


గోపిచంద్ రాసిన నవలల్లో నేను చదివిన మొదటి నవల ఇది. గోపిచంద్ అంటే 'అసమర్థుని జీవయాత్ర' రచయితగానే పరిచయం కానీ అది చదవలేదు. కానీ ఈ 'పరివర్తనం' ఇచ్చిన అనుభూతి, కొన్ని Universal ethical paths ,వస్తువుని నడిపించే తీరు,వర్ణణనలో చూపించే సూక్ష్మశీలత నన్ను బాగా Attract చేశాయి.

గోపిచంద్ ఇతర రచనలతో పరిచయం ఉంటే ఇంకా ఎక్కువ రాయగలిగేవాడ్నేమో! But, ప్రస్తుతం ఇంతవరకే రాస్తున్న.


Thank you for reading...

~


లిఖిత్ కుమార్ గోదా.

9, ఆగస్టు 2022, మంగళవారం

'ఆ' ఇద్దరు - తిరునగరి వేదాంతసూరి

 ⚫'ఆ' ఇద్ద(రి)రు గురించి తాతయ్య అనేక ముచ్చట్లు 




'Children see magic because they look for it.'

     ఈ బుల్లి నవలను చదివాక నాకు అమెరికన్ రచయిత Christopher Moore అన్నది నిజమే అనిపించింది. పిల్లల ప్రపంచం ఏమై ఉంటుంది. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తారు. ఎక్కడ సంతోషంగా ఉంటారు. ఏ పనిని ఇష్టంగా చేస్తారు. ఇవన్నీ ఈ నవలలో చెప్తాడు రచయిత టి‌.వేదాంత సూరి. ఇలా మనుమల కోసం తాతలు రాసిన పుస్తకాలలో ఇది నేను చదివిన రెండో పుస్తకం. మొదటిది ఖమ్మం కి చెందిన బెల్లంకొండ ప్రసేన్ రాసిన 'క్షమ కావ్యం' అనే 'చిట్టి కవితల పుస్తకం'. 


     ఒక తాతయ్య తన మనవరాలు గురించి, వాళ్లు పెరిగిన ఆక్లాండ్ (న్యూజిలాండ్) అనే ప్రదేశపు పరిస్థితుల గురించి, అక్కడ జీవన విధానం గురించి, అక్కడ పిల్లల పట్ల చూపించే బాధ్యతను గురించి, మన దగ్గర మారాల్సిన వ్యవస్థ తీరుని గురించి ముచ్చట్లాడే  నవల. ఈ నవలని సీరియల్ గా టి వేదాంత సూరి గారే ఆయన నడిపే 'మొలక న్యూస్' అనే వెబ్ మ్యాగజైన్లో రాశారు.రచయిత మనవరాళ్లయిన ఆద్య(4 ఏళ్లు),ఆరియా(2 ఏళ్లు) చుట్టూరా ఈ నవల సాగుతుంది.


     పిల్లల మనస్తత్వాలు, వాటికి చిగురించే నూతన ఆలోచనలు, వాటికి చిన్న వయసు నుంచే ఎలాంటి పద్ధతులు, పరిసరాలు అలవాట్లు చేయాలో చెబుతారు. పిల్లల పరిశీలన ఎంత చురుగ్గా ఉంటుందో ఒక సంఘటనలో చెబుతారు రచయిత. అది చదువుతుంటే భలే ఆశ్చర్యం వేసింది. పెద్దోళ్ళు పాటించాల్సిన జాగ్రత్త అర్థమైంది.


    ఆద్య,ఆరియా చేసిన ప్రయాణాలు గురించి పూసగుచ్చినట్లు ఎలా చెబుతారో ఇందులో చెబుతారు. ప్రకృతిని, జంతువుల్ని చిన్నప్పుడు నుండి పిల్లలకు అలవాటు చేయడం ఎంత అవసరమో వివరిస్తారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని సంఘటనలో వివరిస్తారు. ఆద్య చిన్న వయసులో రకరకాల ప్రశ్నలతో ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాసలను గురించి చూపిస్తాడు. ఆరియా ఆటల్ని, మనుషులకు ప్రేమపూర్వకంగా ఎలా హగ్ ఇవ్వడాన్ని ఇష్టపడుతుందో చెప్తారు. అప్పుడప్పుడే ముద్దు ముద్దుగా నేర్చుకుంటున్న మాటల్ని ఆరియా ఎలా పలుకుతుందో అన్న విషయాలు, చీమతో ఎలా ఫోన్లో మాట్లాడింది అన్న విషయం, పిల్లలకున్న ఆసక్తిని, కొత్త ఊహల్ని మనం నవ్వుకుంటూనే అర్థం చేసుకోగలుగుతాం ఈ పుస్తకం చదివితే. 

     'Every happy memory created for a child is another treasure of a lifetime' 

- Donna Marie.

ఇది నిజంగా ఆ మనమరాళ్లకి లైఫ్ టైం మొత్తం నిధే.


    చాలా వివరంగా మనవరాళ్లకే కాకుండా, పాఠకలోకానికి మంచి బుక్ తో బహుమతిని ఇచ్చారు రచయిత.

~

లిఖిత్ కుమార్ గోదా. 


Today this article has published in Molaka News


మొలక న్యూస్ 


 ⚫

‘ఆ’ ఇద్దరు

బాలల నవల

రచన: టి.వేదాంతసూరి

ప్రచురణ: జనవరి 2022

వెల: రూ. 100

ప్రతులకు: ప్రసన్​ పబ్లికేషన్స్​, 1‌‌–9–319/1/1/జి2, విద్యానగర్​, హైదరాబాద్​ – 500044

ఫోన్​: 9848992841

12, జులై 2022, మంగళవారం

మా తిరుపతి కొండ కథలు - గోపిని కరుణాకర్

 Cuddled Book -3


బాల్యం గార్డెన్ లో పూసిన కథలు

(కరణ్ గోపిని 'మా తిరుపతి కొండ కథలు' గురించి కొన్ని ముచ్చట్లు)




      నిన్న Srinivas Goud సార్ వాళ్లింటికి వెళ్లినప్పుడు డెస్క్ మీద ఈ పుస్తకం చూశాను. ఈ రచైతవి 'బారతం బొమ్మలు కతలు' చదవమని గూండ్ల వెంకట నారాయణ అన్న చెప్పింది గుర్తొచ్చింది. ఏ కథలైతే ఏంటిలే అని చదివా. I'm so excited while reading,no while I'm watching the narration. ఈ పుస్తకం గురించి సమీక్ష కాదు గాని ఓ ఫీలింగ్ రాద్దామని రాస్తున్నాను.


      కవర్ పేజి చూసేసి ఇవి పూర్తిగా భగవంతునికి భక్తునికి అనుసంధానం అయిన కథలనుకోవద్దు. కొంత వరకూ నిజమే అయినా పూర్తిగా ఓ మనిషి జ్ఞాపకాల్లోంచి వైవిధ్యమైన రీతిలో రాసుకున్న కథలు. తిరుపతి కొండ దగ్గరి మనుషుల జీవితాలు. అక్కడి అనేకానేక దృశ్యాలు.


     నిజంగా జరిగిన కొన్ని సంఘటనల్ని కథలుగా ఎలా చెప్పొచ్చు? తను పెరిగిన వాతావరణం గురించి, ప్రదేశం గురించి, మనుషుల మధ్య తిరిగిన సంగతులు గురించి ఎదుటి వ్యక్తికి ఆసక్తిగా ఉండేలా ఎలా చెప్పొచ్చు? Documentary గా ఎలా రాయొచ్చు? ఈ టెక్నిక్ అర్థమైనప్పుడు చాలా వరకు రచైత పాఠకుడిని ఎలాంటి ఢోకా లేకుండా రచన విషయంలో సంతృప్తి పరచగలడు.


     కథని రాయడం ఒకెత్తు. దాన్ని చెప్పడం ఇంకొకెత్తు. కథను చెబుతున్నట్టు రాయడం మిగిలిన రెండిటకన్న గొప్ప ఎత్తు. అది ఈ రచైతకి బాగా అబ్బి ఉంటుందని ఈ కథల్లో నాకు అర్ధం అయ్యింది.


   కథల గురించి కొంచెం చెప్పుకుంటే...


      పూర్వం భక్త కవులు దేవుళ్ళని ఆరాధిస్తూ కథల(పద్యాల కథలనుకోండి) రాసేటోళ్ళు. ఈ రచయిత ఏడుకొండల వాడితో గొడవలు వేసుకుంటాడు 'గుగ్గిలవ్వ అంటే దేవుడిక్కూడా భయమే' కతలో. ఎండింగ్ తనకొచ్చిన కలతో ముగిస్తాడు. కలలు కూడా కొన్ని సార్లు రియల్ గా జరగొచ్చేమో అన్నంతగా ముగిస్తాడు.


Author - Karan Gopini


     'బాల్యం గార్డెన్ లో పూసిన జ్ఞాపకాలు'  కతలో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటాడు.


      సినిమా నటి జమున గారి పెళ్లి జరిగిన రోజే రచైత తల్లిదండ్రుల పెళ్లి రోజని, తిరుమలలో ఆ సందర్భంగా ఎలాంటి సందడి పుట్టిందో పూసగుచ్చినట్టు చూపిస్తాడు. పెళ్ళి వేడుకలో ఉన్న జనానికి జమున గారి పెళ్లికి వెళ్లాలన్న ఆతృతని చాలా సులభంగా చూపించాడు. ఆ హడావిడిలో తన బంధువు ఒకామెది నెక్లెస్ పోవడం గురించి చెప్పి కథని ముగించాడు.


      'ముత్యాల ముగ్గు' కత చాలా ఆసక్తికరంగా, గమ్మత్తుగా ఉంటుంది. 'గంగ జాతరలో నాది ఆడవేషం! మా మామది రౌడీ వేషం ' ఆ ప్రదేశంలోని స్థలపురాణాన్ని, ఆచారాన్ని చాలా క్షుణ్ణంగా చూపించి నవ్వులు పుట్టిస్తాడు. 'కుమారధార తీర్థంలో సాధువు' కత ఊహించినంత ఆసక్తిగా,నమ్మాలా వద్దా అన్నట్లు మనకే వదిలేస్తాడు చివరికి కతని.


     'తిరునామం పెట్టుకోకపోతే పనిష్మెంట్, దేవుడి లిస్ట్,పనసకాయ దొంగలు, నిత్యకళ్యాణం పచ్చతోరణం, వాటర్ మాన్ శంకర్ రెడ్డి, నేరము- శిక్ష' ఇలా ఏ కతకా కథ ప్రత్యేకంగా దర్శనమిస్తాయి.


"WRITE YOUR STORY AS IT NEEDS TO BE WRITTEN. WRITE IT HONESTLY, AND TELL IT AS BEST YOU CAN. I'M NOT SURE THAT THERE ARE ANY OTHER RULES. NOT ONES THAT MATTER.” అంటాడు ఆంగ్ల రచయిత NEIL GAIMAN. కథ మనదైనప్పుడు, పూర్తి నిజాయితీతో కథను సొంత శైలిలో రాసినప్పుడు వాటికి ఎలాంటి నియమాలు అవసరం లేదంటాడు. ఈ కథలకు ఆ సొంత శైలి, నిజాయితీ ఉంది.


      పాఠకుడిగా ఈ వాక్యం దగ్గర ఇబ్బంది పడి ఆగిపోయానని,ఈ దృశ్యం,సంఘటన అర్థం కాలేదని ఈ కతల గురించి సాకులు చెప్పలేను. ఎంత ఎంజాయ్ చేశానో ఈ కతలు చదివితే మీకే అర్థమవుతుంది. Happy Reading... I know. Every one will cuddle this stories.


Very well written Karan Gopini Sir!

~

లిఖిత్ కుమార్ గోదా. 

12-07-2022

Facebook Post (My Timeline)

28, జూన్ 2022, మంగళవారం

మునికాంతపల్లి కతలు - సోలొమోన్ విజయ్ కుమార్

 Cuddled Book - 1


ఇళ్లబుచ్చోడు జెప్పిన 'మునికాంతపల్లి కతలు'



 

"The secret of the Great Stories is that they have no secrets. The Great Stories are the ones you have heard and want to hear again."

- Arundhati Roy 


    ఇప్పుడు నేను చెబుతున్న 'మునికాంతపల్లి కతలు' అనేటి పేరుతో పుస్తకం రాసిన సోలొమోన్ విజయ్ కుమార్ కతలకి, పైన కోట్ చేసిన అరుంధతీ రాయ్ కొటేషన్ కరెక్టనే అనుకుంటున్న. అవును. ఈ కతలు నన్ను మళ్ళీ మళ్ళీ చదివించాయి. మళ్ళీ వినాలనిపించేలా చదివించాయి.


   ఫేస్బుక్ లో ఈ పుస్తకం మీదొచ్చిన సమీక్షా వ్యాసాలు చదివి ఏంటి పుస్తకం గొప్పతనం అనుకున్న మొదట్లో.

   సారంగలో నేను చదివిన 'ఎంగిలోడు' కత, ఈ పుస్తకంలో లేని 'లింగ' కతలు చద్వి, 'అరె! వాళ్లూరి కతల్ని భలే రాసిండే ఈ మనిషి. అచ్చం నేను మా ఊరి మట్టిలో, మనుషుల్లో తిరుగాడినట్టుందే కొన్ని కతల్లో!' అననుకున్న. అన్న గూండ్ల వెంకటనారాయణ మాట్లాడినప్పుడల్లా ఈ కతల గోలే నా చెవుల్లోకి ఊదేవాడు 'మనిషి కతలు' చదవమని.


Solomon Vijay Kumar , Author 


    చాలా బాధలు దిగమింగుకుంటూ, కొన్ని ప్రేమల్ని గాయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ,అచ్చమైన స్వచ్ఛమైన వాళ్లూరి భాషని, ఆ మునికాంతపల్లి జీవితాన్ని కళ్లముందు ఆరబోశాడు.


   'ఇంటికి ఏంజలొస్తుండాది ' మొదలు ' ఇళ్లబుచ్చోడు ' కతల దాకా ఉన్న 22 కతలల్లో కొన్ని కతల్లో నవ్వుకున్న, కొన్ని కతల్లో కన్నీళ్లు బెట్టుకున్న, కొన్ని కతల్లో ట్విస్ట్లు జూసి,'అబ్బా! జీవితాలు ఇలా గూడా ఉంటాయా!' అని నోరెళ్ళబెట్టా.

   మనం బాగా ఎరిగిన కొన్ని జీవితాల గురించి నామోషీగా ఫీలయ్యి రాయము. కానీ ఈ మనిషి భలే రాశాడు.

   Readability విషయంలో కతలు నెల్లూరు మాండలికంలో ఉన్నప్పటికీ ఎటువంటి అడ్డంకి లేకుండా సాఫీగా చదివిచ్చుకుంటూ పోతాయి.  


    ఫాతిమా,అవ్వ చెప్పిన వాన కత, పురుషోత్తం మావ బాప్తీసం,ఎంగిలోడు నాలో దుఃఖాన్ని నింపిన కతలు.


   'దేవగన్నిక సిత్ర' కతలో కొన్ని డైలాగులు ఒక లెవెల్లో నవ్విస్తే, ఎండింగ్ ఊహకి అందనంత విషాదాన్ని నింపింది.


   అవ్వ చెప్పిన వాన కత,నక్కలోల్ల బిజిలీ,మొండిగుద్దల వొవదూత,దేశదిమ్మరి కాశయ్య వంటి కతలు సాధ్యమైనంత వరకూ ఇతర భాషల్లోకి, ఎక్కువగా విదేశీయులకు అనువాదం కావాల్సిందని నాకు అనిపించింది.


    మనలో చాలా మంది ఇందులో బూతులు రాసాడు కాబట్టి ఇవి పరమ,అసహ్య కతలని వాపోవచ్చు. కానీ నాకైతే ఇవి నచ్చాయి. బూతుల్లేకుండా నేనూ మా ఊర్నెప్పుడూ చూడలేదు. మనం బూతులు అని ఎత్తిచూపుతున్న వాక్యాలు అనాదిగా జానపదుల నోళ్ళలో నానిన భాష. బహుశా అందుకే ఇవి కొత్తవీ,పాతవీ,తిరుగులేని కతలనిపించింది.


   చివరిగా ఈ రచయిత చివరి అట్ట మీద రాసుకున్న Blurb చదివితే,

    "ఇవి కథలు కావు. అనగా కథ అనే ప్రక్రియను గురించి లాక్షణికులు ఏవైతే చెబుతారో ఆ లక్షణాలను అనుసరిస్తూ రాసినవి కావు. ఎందుకంటే జీవితం అనేది ఏ ప్రక్రియను అనుసరిస్తూ నడవదు కనుక ప్రక్రియ ఏదైనా జీవితాన్ని, ఆ జీవితం ఎలా ఉందో అలా ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుసరించాలని నా వ్యక్తిగత స్థిరాభిప్రాయం...' అంటాడు.

    ఓ పద్ధతిని ఫాలో అయ్యి రాసుంటే మాత్రం ఇవి ఇంతగా ఎఫెక్టీవ్గా ఉండేవి కావేమో! ఎలాంటి నియమాలు నిబంధనలు ఫాలో కాకుండా రాయబట్టే కథా లేఖనలో కొన్ని కొత్త దారులు చూపించినట్టు అనిపించింది. బహుశా అదే రచైత Technique కావచ్చు. కతలనిండా మనుషుల్ని ప్రేమించే వ్యక్తి (రచైత) ఇంకా మరెన్నో సజీవ కతలు రాయాలని ఆశిస్తున్నాను.

~

లిఖిత్ కుమార్ గోదా. 

28-06-2022


Social Media

Facebook (My Timeline)

18, జూన్ 2022, శనివారం

మై నేమ్ ఈజ్ చిరంజీవి - ప్రసాద్ సూరి

 Cuddled Book -2 

'జులాయి మేధావి' అను ఒక చిరంజీవి కత


 


   ఈ మధ్య నేను చదివిన మంచి నవల లో ప్రసాద్ సూరి రాసిన 'మై నేమ్ ఇస్ చిరంజీవి' ఒకటి. ఈ పుస్తకం ఛాయా పబ్లికేషన్స్ నుంచి వెలువడింది. 35 ఏళ్ళ వయసున్న యువకుల రచనలు పబ్లిష్ చేస్తున్నారంటే ఏముంటుందో అనుకున్నాను ఫేస్బుక్లో ఈ పుస్తకానికి సంబంధించిన ఒక పోస్టు చూసి. మిత్రుడు Ramesh Karthik Nayak సజెస్ట్ చేసాడని 34వ నేషనల్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకాన్ని కొన్నా. 21 ఏళ్లకే ఎలా రాసి ఉంటాడు ఓ నవల? ఒక పబ్లిషర్ దానిని నమ్మి ఎలా పబ్లిక్ చేసి ఉంటాడు? ఏమ్ ఉండొచ్చు ఇందులో కథ అని ఓ ఎక్స్పెక్టేషన్ తో చదవడం మొదలెట్టాను. ఎందుకంటే కొత్తగా పుట్టుకొచ్చిన యువకుల నవలల్లో నేను చదివినా రెండో నవల ఇది. మొదటిది గూండ్ల వెంకట నారాయణ రాసిన #భూమి_పతనం.

నా ఈడు వయసు ఉన్న వాళ్లు ఏం రాస్తున్నారు అనేదే ఆత్రుత.


Author - Prasad Suri


   నవలని రచయిత 2030 లో నడిపిస్తాడు. తన ఇష్టం వచ్చినట్లు సంతోషంగా, ఫ్రీడంతో బతుకుతున్న చిరంజీవి అనే ఓ కథానాయకుడికి(బహుశా ఇది రచయిత స్వీయ జీవితం అయ్యుండొచ్చు) Whatsapp లో వాళ్ళ టెన్త్ క్లాస్ బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ Group క్రియేట్ చేసి Get together ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకోవడం, చిరంజీవి ఓ ప్రయాణంలో ఉండడం, అలా తన జీవితాన్ని పుట్టుక దగ్గర నుండి, ఫ్యామిలీ, వూరు మనుషులు దగ్గర నుండి ఇంటర్మీడియట్ వరకు, కాలేజ్ లో, హాస్టల్లో తను గడిపిన Life (పక్కా Mass Attitude)ని రాసాడు. ఇందులో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, Teenage అబ్బాయికి అమ్మాయిలపై అట్రాక్షన్ కలిగే సందర్భాలు, లవ్ స్టోరీ లు, హాస్టల్ లో కొన్ని పొలిటికల్ గొడవలు, మామూలు గొడవలు ఇలా సాగుతుంది నవల అంతా. భాష పరంగా 'చదువుకున్న ఒక మాస్ యాటిట్యూడ్ ఫెలో' ఎలా మాట్లాడతాడో అలా మొదటి నుంచి చివరి దాకా కథను మనతో చెబుతాడు. 


        చదువుతున్నంత సేపు ఎలాంటి బోరింగ్ లేకుండా, కళ్ళు మనసు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో దూసుకెళ్ళాయి. High readability ఉన్న నవల.ఈ నవలలో కొన్ని సందర్భాలలో నాకు నేను కనిపించాను. 


    ఇందులో విజయశాంతి, సలోమి, సువార్త, సత్యవతి లవర్స్ గా, తన Love proposal rejected persons గా మనకు కనిపిస్తారు. అమ్మాయిలకు సైట్ కొట్టడం,అవసరమైన సందర్భాలలో Attitude చూపించడం, కాలేజ్ నంత తన నాలెడ్జితో తన వైపు తిప్పుకోవడం, రకరకాల ఫ్రెండ్ షిప్ లు, అన్నీ మనం ఇందులో చూస్తాం.

   అంతా చదవడం పూర్తయ్యాక చిరంజీవి 'జులాయి మేధావి' అని అర్థమవుతుంది మనకి.


   నిజంగా యూత్ నుండి ఇలాంటి మరెన్నో నవలలు రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి టీనేజ్ అబ్బాయి చేసే పనులు, చేస్తున్న పనులే ఇవన్నీ. ఇలాంటి లైఫ్ చాలామంది గడిపే ఉంటారు. కానీ రాసి ఉండకపోవచ్చు. ఆ పని ప్రసాద్ సూరి చేశాడు.


 I enjoyed a lot when I am reading this novel.

Lots of love to Prasad Suri Anna..


(Note:- పుస్తకాన్ని చదివిన తర్వాత రాసుకున్న వాక్యాలు యథాతథంగా. దాదాపు 6 నెలలు అవుతోంది ఇది రాసుకుని )

Click here 

Facebook Post (My Timeline) 

26, ఏప్రిల్ 2022, మంగళవారం

ఎంకటి కతలు - గరిపెల్లి అశోక్

 ⟾ పేద జీవితాలకు అద్దంపట్టే "ఎంకటి కతలు"(పుస్తక సమీక్ష)

పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం , మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్..

ఫోన్:- 9640033378

బాల సాహిత్యం అంటే మనకు తెలిసింది నీతులు విరబూసే చందమామ కథలు , లయాత్మకంగా పాడుకునే గేయాలు , చిన్నారులు లేదా పిల్లల కోసం పెద్దలు రాసిన చిట్టి కవితలు . కానీ బాలసాహిత్యంలో కథలకు కొంచెం ప్రాధాన్యత ఎక్కువ. కథలు పిల్లల మనసులో నాటిన మొక్కలుగా జీవితంలో వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సరికొత్త క్యారెక్టర్లు, ఎత్తుకు పై ఎత్తులతో, నడవడికతో , నీతులతో కథలు మనస్సులను దోచుకుంటున్నాయి. కానీ ఈ మధ్య బాలసాహిత్యంలో కథల ట్రెండ్ మారుతోంది. కొందరు పిల్లలు, పెద్దలు(వర్ధమాన రచయితలు, చేయి తిరిగిన రచయితలు); తాము చూసిన జీవితాలను, వాస్తవ సంఘటనలను, కథా వస్తువులుగా తీసుకుని చదువరుల కళ్ళను మేఘాలుగా మలుస్తున్నారు..


జీవితాన్ని బాల సాహిత్యం కోసమే అంకితం చేసుకుంటున్న ప్రముఖ రచయిత, బాల సాహితీ వేత్త, అక్షర తపస్వి గరిపెల్లి అశోక్ గారి పరిచయం రెండు తెలుగు రాష్ట్రాల పాఠక జనులకు సుపరిచితమే.. ఇంటర్మీడియట్ దశలోనే "నాంది" కవితా సంపుటి వెలువరించి, తరువాత బాలసాహిత్యం అంబరాన్ని కాదు, పిల్లల మనసుల్లోకి చేరాలనే ఉత్తమ ఆశయంతో, నిత్యం కలలుకంటూ, ఇప్పటివరకు బాలసాహిత్యంలో నిర్వహించిన ప్రతి సాహిత్య కార్యశాలలో ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు, పాల్గొంటున్నారు. వర్ధమాన సాహితీవేత్తలకు మెలుకువలు నేర్పిస్తూ, ఉత్తమ సూచనలు అందిస్తూ, అందరిని ప్రోత్సహిస్తున్నారు అశోక్. ప్రోత్సహించడమే కానీ విమర్శించడం తెలియని వ్యక్తి.. 


దశాబ్దాల కాలం తరువాత; వారి జీవిత అనుభవాల నుంచి పుట్టినవి, పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా రచయిత చూసిన జీవితాలను వాస్తవ సంఘటనలను కథా వస్తువులుగా తీసుకుని, బాల సాహిత్యంలో చిరస్థాయిగా, చిరకాలం నిలిచిపోయే "ఎంకటి కతలు" రచించారు అని నా అభిప్రాయం. అలాగే "మా బడి కతలు" పాఠశాల జీవితాన్ని క్షుణ్ణంగా చూపించిన కథలుగా ఉన్నాయి.. ఇవి నిన్నటి తరం, నేటి తరం కూడా.. 


"ఎంకటి కతలు" రచయిత అన్నట్లు ఇవి నిజంగా కథలు కావు, పేద జీవితాల ఎతలు(వ్యథలు). వీటిని అశోక్ గారు ఎక్కడి నుంచో తీసుకురాలేదు.. మన ఇంటి పక్కనో,మన వీధిలోనో, మన ఊరిలోనో, బడులలోనో నిత్యం మన కళ్లకు కనబడి, కనబడని పేద విద్యార్థుల జీవితాలనే కథలుగా లిఖించారు. . ఆ పేద జీవితాలతో మనకు కూడా ఉన్న మానవీయ సంబంధాలను, ఎంకటి లాంటి ప్రేమానురాగాలు చూపించే నిజమైన మనుషులు కోకొల్లలుగా ఉన్నారు అని ఈ పుస్తకం చదువుతుంటే మనకు అర్థమవుతుంది.


ఈ జీవిత పుస్తకాన్ని చదివాక,

విభిన్న కోణాలలో పుస్తకం గురించి "పుస్తకం" అనే శీర్షికతో నేను రాసుకున్న ఒక కవిత గుర్తొచ్చింది.

అందులోని ఒక స్టాంజా ఈ పుస్తకానికి నూరు శాతం సరిపోతుంది..

"పుస్తకం,

దయనీయంగా సాగే బ్రతుకులను,

కంటికి కనబడని సమాజ నడకను

క్షుణ్నంగా చూపించే 

ఓ మైక్రోస్కోప్..." ఈ పుస్తకం నిజంగా ఒక మైక్రోస్కోపే..


జీవితాన్ని కథలుగా మలిచిన ఈ పుస్తకాన్ని, జీవిత గ్రంథం అంటే సరిపోతుంది అని అనిపించింది.

  13 కథలతో నిర్మించబడిన ఈ పుస్తకం మొత్తం పేద విద్యార్థుల జీవితాలను చూపించే డాక్యుమెంటరీ చిత్రం లాంటిది..

రచయిత కథా శీర్షిక ఎంచుకోవడంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కథలోని నీతిని కాకుండా, ఎంకటికి ఆ కథలో సంబంధం ఉన్న ముఖ్య పాత్రను, వస్తువుల పేరును శీర్షికగా అమర్చారు. అలా ఒకసారి పుస్తకం మొత్తం చదివి, ఇంకోసారి చదవాలని తిరగేస్తున్నప్పుడు, శీర్షిక చూడగానే ఆ కథ మన మనసులో అలలాగా ఎగిసే పడటం జరుగుతుంది.ఇలాంటి మెళుకువలు వర్ధమాన రచయితలకు అవసరమైన సూచన.


కథలు మన ముందు జరుగుతున్నట్లు, కథలో మనం (పాఠకులం) ఉన్నట్లు రాశారు రచయిత. వాడుక భాషలో, కథలోని పాత్రలతో మాట్లాడిస్తూ కథను చక్కని తోవలో నడిపించారు. ఇది వర్ధమాన రచయితలు తీసుకోవాల్సిన సూచనగా నా భావన.


ఇక జీవితకథలు విషయంలోకి వెళితే, ప్రతి పాఠకుడు హృదయం చలించిపోతుంది. ప్రేమను, ఆప్యాయతను కురిపించే వ్యక్తి(పిల్లవాడి) పై నిందలు పడితే, అతడు ప్రేమగా నిలబడి ఆ సమస్యతో వ్యవహరించే తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.



ఎంకటి-తేలు కతలో..

ఎంకటి,తన పక్క మిత్రుడు ఎగ్జామ్లో తాను అడిగితే చూపించలేదని, ఆన్సర్ అడిగితే రమేష్ కొట్టాడనే ఆలోచన, కుబుధ్ధి మనసులో లేకుండా మిత్రునికి తేలు ద్వారా కలగనున్న అపాయం నుండి, అతన్ని కాపాడడం అనేది మనం చెప్పుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన మానవత్వ విషయం.


ఎంకటి-సైకిలు కథలో..

పెద్దోళ్ళైనా,చిన్నోళ్లైనా అందరూ సక్రమంగా సూక్తులను,మన కోసం ఏర్పాటు చేసిన నియమాలను పాటిస్తూ ఉండాలని కోరుకోవడం ఎంకటిలోని మనిషి మనకు కనబడతాడు.తప్పును తప్పని చక్కగా చెబుతాడు ఎంకటి.


ఎంకటి-మార్కుల గ్రేడ్లు కథలో...

క్రితం సారి కిషోర్, మార్కుల రిజిస్టర్లో తన క్రికెట్ టీం మిత్రులకు ఎక్కువ గ్రేడ్లు వేయిస్తే, ఆ విషయాన్ని ఎంకటి హనుమంతు సార్ కి ఫిర్యాదు చేయగా, హనుమంతు సార్ కొట్టడం, అప్పటినుండి కిషోర్ ఎంకటిపై మనసులో కోపం పెంచుకుని,ఎంకటిపై హనుమంతు సార్ కి చెడు భావం కలిగేలా మాటలు చెప్పినా, ఎంకటి మాత్రం మనసులో ఎటువంటి కల్మషం లేకుండా కిషోర్ గొప్పతనం గురించి చెప్పడం పాఠకుల మనసులను మానవత్వంతో తడిపేస్తుంది..

అలాగే ఎంకటి తనకోసం తన తల్లి కోసం ఎక్కడెక్కడ పని చేస్తాడో కూడా అర్థమవుతుంది మనకు.


ఎంకటి-పెన్నులు కథలో..

తరగతి గదిలో పెన్నులు పోతున్నాయని నలుగురు విద్యార్థులు పెద్ద సార్ కి ఫిర్యాదు చేయడం, ఎవరిపైనైనా అనుమానం ఉందా అంటే ఎంకటి తీస్తున్నాడని చెప్పడంతో, హెచ్ఎం సారు అటెండర్ని పిలిచి ఎంకటిని బ్యాగ్ తో సహా రప్పించి, పెన్నులు బయటకు తీయించడం, రీఫుల్లు లేని పెన్నులు ఉండడం చూసి ఎందుకు ఇవన్నీ అని పెద్ద సార్ అడిగితే, చిన్న బడిలో పిల్లల కోసమని ఎంకటి బదులు ఇవ్వడం, చివరాకరికి గోపాల్ సార్ ద్వారా పెన్నులు సైన్స్ ల్యాబ్ లో ఉన్నాయని చెప్పడం, వెంకటి పెన్నులను దొంగతనం చేయలేదని తెలుస్తుంది. ఎంకటి దొంగ తనపు బుద్ధి ఏమి లేకుండా; పారేసిన పెన్నులను మళ్లీ ఉపయోగంలోకి తేవడమే కాదు, కేవలం తన గురించి కాకుండా తనలాంటి పిల్లల కోసం ఆలోచించడం రచయిత సూక్ష్మ, సునిశిత బుద్ధికి నాంది పలుకుతాయి.. అలాగే ఎంకటి సహృదయతను చూపిస్తాయి.


"ఎంకటి- సకినాలు" కథలో..

రాము సకినాలు తెచ్చుకొని తింటూ ఉండి, ప్రశాంతంగా ఉన్న తరగతి వాతావరణాన్ని భంగం కలిగేలా చేస్తాడు. అప్పుడు టీచర్, రాముతో పాటు,

ఏ తప్పూ చేయని ఎంకటిని కొడుతుంది. అయినా ఎంకటి టీచర్ కు ఎదురు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. తరువాత మాధవ్ సార్ బోధన అనుభవంతో రాము సకినాలు తెచ్చుకొని, ఎంకటి డెస్క్లో పెట్టి వెంకటిని కూడా పనిష్మెంట్ తీసుకొనెలా చేశాడని మేడమ్ కి అర్థం అయ్యేలా చెప్తారు.అందుకు అనుభవం కూడా కావాలి అని సూచిస్తారు. ఈ కథ విద్యార్థుల అల్లరి చేష్టాలకి నిలువుటద్దం.

ఈ కథలో పిల్లలే కాదు ,టీచర్లు, పెద్దలు కూడా ఎలా నడుచుకోవాలో వివరించారు.


"మేడం గట్టిగా కొట్టిందా రా అని రమేష్ అడిగితే; వట్టిగా కొట్టలేదు కదరా, తప్పు చేసినని కొట్టిందిరా. కొడితే కొట్టని, మన అమ్మ లాంటిదే గదా మేడం"అంటూ సమాధానం ఇస్తుంటే పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.. అలా అంటుంటే వెంకటి మంచితనం, మానవత్వపు బుద్ధి మన హృదయాలను కదిలిస్తాయి. అలా ప్రతి విద్యార్థి మనసు నిండా మానవత్వంతో, సంస్కారంతో జీవిస్తే రేపు సమాజం, మన దేశం ఎంతో ఉత్తమంగా నడుస్తుందో కదా..


ఎంకటి- రూపాయలు కథలో..

అందరితో పాటే వెంకట్ ని సమాంతర పర్యవేక్షణకు వచ్చిన పెద్ద సార్ లక్ష్మా రెడ్డి గారు "నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు?" అని అడిగితే, అందరిలా డాక్టర్,ఇంజనీర్ అనకుండా , "నేను మనిషిని కావాలనుకుంటున్నాను సార్" అని , తరువాత తాను చెప్పిన ఒక సంఘటనతో నేటి కుటుంబ సమాజం కళ్లకు కనబడుతుంది. నేను మనిషిని కావాలనుకుంటున్నాను అనడంలో వెంకటి మనసు మనకు తేటతెల్లమవుతుంది. ముందు మనం మనిషి అయితే రేపు మనం సాధించలేనిది ఏదీ లేదు అంటూ గొప్ప జీవిత సందేశాన్ని చెప్పిన కథ ఇది.


ఎంకటి-అమ్మ కథలో మన హృదయానికి కళ్ళు మొలచి ఏడుస్తాయి. ఒక కొడుకుగా తన తల్లి పై అమలమైన ప్రేమను, విద్యార్థిగా ఉపాధ్యాయులపై, చదువుపై గౌరవం చూపిస్తాడు ఎంకటి. ఆ సంఘటన గురించి ఎంత చెప్పినా తక్కువే.


తర్వాతి కథల్లో ఎంకటి పరుగు పందాలలో జిల్లాకి మంచి పేరు తీసుకు రావడం, మంత్రిగారు వచ్చినప్పుడు, కరివేపాకు మొక్కలను, వేప మొక్కలను బోకే గా ఎందుకు ఇవ్వకూడదు అనే విషయం మనల్ని ఆలోచించేలా చేయడమే కాకుండా, బాధ్యతాయుతంగా ఆచరించే విధంగా ఉంటుంది.


  మనం మనుషులం, మన సంస్కారమే మనల్ని నిలబెడుతుంది అని సందేశాత్మకంగా చెప్పిన జీవిత కథలు ఇవి. కష్టాలను, అవమానాలను ఎదుర్కొని నవ్వుతూ ఉండే వెంకట్ ను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.వెంకట్ నుంచి సంస్కారం ఎంత నేర్చుకుంటే అంత లభిస్తుంది. మనిషి ప్రవర్తనను మంచిబాటలో నడిపించడానికి ఈ పుస్తకం మన మనసుకు ఎంతో దోహదపడుతుంది. ఈ పుస్తకం పాఠకుల పాలిట"మంచి పుస్తకం". వర్ధమాన రచయితల పాలిట "టీచర్" అని నా అభిప్రాయం.

బాలసాహిత్యంలో ఇటువంటి పుస్తకాలను పిల్లల మనసులోకి చేరవేస్తే, రేపు మనకు ఎటువంటి దిగులు ఉండదు. ఎందుకంటే వాళ్లు నేర్చుకొని పదిమందికి సహాయపడటానికి ఆస్కారం ఉంది కాబట్టి. ఈ పుస్తకం అలా తీర్చిదిద్దుతుంది. మంచి పుస్తకాల లక్షణమే అది. తెలుగు బాల సాహిత్యంలో ఇలాంటి జీవిత గ్రంథాన్ని వెలువరించిన గరిపెల్లి అశోక్ గారికి మనసారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి రచయిత ఇలాంటి జీవిత గ్రంథాల్ని రాసి పిల్లలు మనసులోకి చేరవేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం రాసే అక్షరాలు, మన బాల సాహిత్యం సుసంపన్నంగా ఆకాశంలో సూర్యుడిలా వెలుగుతుంది. 

!! జై బాలసాహిత్యం!!