⟾ పేద జీవితాలకు అద్దంపట్టే "ఎంకటి కతలు"(పుస్తక సమీక్ష)
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం , మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్..
ఫోన్:- 9640033378
★
బాల సాహిత్యం అంటే మనకు తెలిసింది నీతులు విరబూసే చందమామ కథలు , లయాత్మకంగా పాడుకునే గేయాలు , చిన్నారులు లేదా పిల్లల కోసం పెద్దలు రాసిన చిట్టి కవితలు . కానీ బాలసాహిత్యంలో కథలకు కొంచెం ప్రాధాన్యత ఎక్కువ. కథలు పిల్లల మనసులో నాటిన మొక్కలుగా జీవితంలో వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సరికొత్త క్యారెక్టర్లు, ఎత్తుకు పై ఎత్తులతో, నడవడికతో , నీతులతో కథలు మనస్సులను దోచుకుంటున్నాయి. కానీ ఈ మధ్య బాలసాహిత్యంలో కథల ట్రెండ్ మారుతోంది. కొందరు పిల్లలు, పెద్దలు(వర్ధమాన రచయితలు, చేయి తిరిగిన రచయితలు); తాము చూసిన జీవితాలను, వాస్తవ సంఘటనలను, కథా వస్తువులుగా తీసుకుని చదువరుల కళ్ళను మేఘాలుగా మలుస్తున్నారు..
జీవితాన్ని బాల సాహిత్యం కోసమే అంకితం చేసుకుంటున్న ప్రముఖ రచయిత, బాల సాహితీ వేత్త, అక్షర తపస్వి గరిపెల్లి అశోక్ గారి పరిచయం రెండు తెలుగు రాష్ట్రాల పాఠక జనులకు సుపరిచితమే.. ఇంటర్మీడియట్ దశలోనే "నాంది" కవితా సంపుటి వెలువరించి, తరువాత బాలసాహిత్యం అంబరాన్ని కాదు, పిల్లల మనసుల్లోకి చేరాలనే ఉత్తమ ఆశయంతో, నిత్యం కలలుకంటూ, ఇప్పటివరకు బాలసాహిత్యంలో నిర్వహించిన ప్రతి సాహిత్య కార్యశాలలో ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు, పాల్గొంటున్నారు. వర్ధమాన సాహితీవేత్తలకు మెలుకువలు నేర్పిస్తూ, ఉత్తమ సూచనలు అందిస్తూ, అందరిని ప్రోత్సహిస్తున్నారు అశోక్. ప్రోత్సహించడమే కానీ విమర్శించడం తెలియని వ్యక్తి..
దశాబ్దాల కాలం తరువాత; వారి జీవిత అనుభవాల నుంచి పుట్టినవి, పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా రచయిత చూసిన జీవితాలను వాస్తవ సంఘటనలను కథా వస్తువులుగా తీసుకుని, బాల సాహిత్యంలో చిరస్థాయిగా, చిరకాలం నిలిచిపోయే "ఎంకటి కతలు" రచించారు అని నా అభిప్రాయం. అలాగే "మా బడి కతలు" పాఠశాల జీవితాన్ని క్షుణ్ణంగా చూపించిన కథలుగా ఉన్నాయి.. ఇవి నిన్నటి తరం, నేటి తరం కూడా..
"ఎంకటి కతలు" రచయిత అన్నట్లు ఇవి నిజంగా కథలు కావు, పేద జీవితాల ఎతలు(వ్యథలు). వీటిని అశోక్ గారు ఎక్కడి నుంచో తీసుకురాలేదు.. మన ఇంటి పక్కనో,మన వీధిలోనో, మన ఊరిలోనో, బడులలోనో నిత్యం మన కళ్లకు కనబడి, కనబడని పేద విద్యార్థుల జీవితాలనే కథలుగా లిఖించారు. . ఆ పేద జీవితాలతో మనకు కూడా ఉన్న మానవీయ సంబంధాలను, ఎంకటి లాంటి ప్రేమానురాగాలు చూపించే నిజమైన మనుషులు కోకొల్లలుగా ఉన్నారు అని ఈ పుస్తకం చదువుతుంటే మనకు అర్థమవుతుంది.
ఈ జీవిత పుస్తకాన్ని చదివాక,
విభిన్న కోణాలలో పుస్తకం గురించి "పుస్తకం" అనే శీర్షికతో నేను రాసుకున్న ఒక కవిత గుర్తొచ్చింది.
అందులోని ఒక స్టాంజా ఈ పుస్తకానికి నూరు శాతం సరిపోతుంది..
"పుస్తకం,
దయనీయంగా సాగే బ్రతుకులను,
కంటికి కనబడని సమాజ నడకను
క్షుణ్నంగా చూపించే
ఓ మైక్రోస్కోప్..." ఈ పుస్తకం నిజంగా ఒక మైక్రోస్కోపే..
జీవితాన్ని కథలుగా మలిచిన ఈ పుస్తకాన్ని, జీవిత గ్రంథం అంటే సరిపోతుంది అని అనిపించింది.
13 కథలతో నిర్మించబడిన ఈ పుస్తకం మొత్తం పేద విద్యార్థుల జీవితాలను చూపించే డాక్యుమెంటరీ చిత్రం లాంటిది..
రచయిత కథా శీర్షిక ఎంచుకోవడంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కథలోని నీతిని కాకుండా, ఎంకటికి ఆ కథలో సంబంధం ఉన్న ముఖ్య పాత్రను, వస్తువుల పేరును శీర్షికగా అమర్చారు. అలా ఒకసారి పుస్తకం మొత్తం చదివి, ఇంకోసారి చదవాలని తిరగేస్తున్నప్పుడు, శీర్షిక చూడగానే ఆ కథ మన మనసులో అలలాగా ఎగిసే పడటం జరుగుతుంది.ఇలాంటి మెళుకువలు వర్ధమాన రచయితలకు అవసరమైన సూచన.
కథలు మన ముందు జరుగుతున్నట్లు, కథలో మనం (పాఠకులం) ఉన్నట్లు రాశారు రచయిత. వాడుక భాషలో, కథలోని పాత్రలతో మాట్లాడిస్తూ కథను చక్కని తోవలో నడిపించారు. ఇది వర్ధమాన రచయితలు తీసుకోవాల్సిన సూచనగా నా భావన.
ఇక జీవితకథలు విషయంలోకి వెళితే, ప్రతి పాఠకుడు హృదయం చలించిపోతుంది. ప్రేమను, ఆప్యాయతను కురిపించే వ్యక్తి(పిల్లవాడి) పై నిందలు పడితే, అతడు ప్రేమగా నిలబడి ఆ సమస్యతో వ్యవహరించే తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఎంకటి-తేలు కతలో..
ఎంకటి,తన పక్క మిత్రుడు ఎగ్జామ్లో తాను అడిగితే చూపించలేదని, ఆన్సర్ అడిగితే రమేష్ కొట్టాడనే ఆలోచన, కుబుధ్ధి మనసులో లేకుండా మిత్రునికి తేలు ద్వారా కలగనున్న అపాయం నుండి, అతన్ని కాపాడడం అనేది మనం చెప్పుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన మానవత్వ విషయం.
ఎంకటి-సైకిలు కథలో..
పెద్దోళ్ళైనా,చిన్నోళ్లైనా అందరూ సక్రమంగా సూక్తులను,మన కోసం ఏర్పాటు చేసిన నియమాలను పాటిస్తూ ఉండాలని కోరుకోవడం ఎంకటిలోని మనిషి మనకు కనబడతాడు.తప్పును తప్పని చక్కగా చెబుతాడు ఎంకటి.
ఎంకటి-మార్కుల గ్రేడ్లు కథలో...
క్రితం సారి కిషోర్, మార్కుల రిజిస్టర్లో తన క్రికెట్ టీం మిత్రులకు ఎక్కువ గ్రేడ్లు వేయిస్తే, ఆ విషయాన్ని ఎంకటి హనుమంతు సార్ కి ఫిర్యాదు చేయగా, హనుమంతు సార్ కొట్టడం, అప్పటినుండి కిషోర్ ఎంకటిపై మనసులో కోపం పెంచుకుని,ఎంకటిపై హనుమంతు సార్ కి చెడు భావం కలిగేలా మాటలు చెప్పినా, ఎంకటి మాత్రం మనసులో ఎటువంటి కల్మషం లేకుండా కిషోర్ గొప్పతనం గురించి చెప్పడం పాఠకుల మనసులను మానవత్వంతో తడిపేస్తుంది..
అలాగే ఎంకటి తనకోసం తన తల్లి కోసం ఎక్కడెక్కడ పని చేస్తాడో కూడా అర్థమవుతుంది మనకు.
ఎంకటి-పెన్నులు కథలో..
తరగతి గదిలో పెన్నులు పోతున్నాయని నలుగురు విద్యార్థులు పెద్ద సార్ కి ఫిర్యాదు చేయడం, ఎవరిపైనైనా అనుమానం ఉందా అంటే ఎంకటి తీస్తున్నాడని చెప్పడంతో, హెచ్ఎం సారు అటెండర్ని పిలిచి ఎంకటిని బ్యాగ్ తో సహా రప్పించి, పెన్నులు బయటకు తీయించడం, రీఫుల్లు లేని పెన్నులు ఉండడం చూసి ఎందుకు ఇవన్నీ అని పెద్ద సార్ అడిగితే, చిన్న బడిలో పిల్లల కోసమని ఎంకటి బదులు ఇవ్వడం, చివరాకరికి గోపాల్ సార్ ద్వారా పెన్నులు సైన్స్ ల్యాబ్ లో ఉన్నాయని చెప్పడం, వెంకటి పెన్నులను దొంగతనం చేయలేదని తెలుస్తుంది. ఎంకటి దొంగ తనపు బుద్ధి ఏమి లేకుండా; పారేసిన పెన్నులను మళ్లీ ఉపయోగంలోకి తేవడమే కాదు, కేవలం తన గురించి కాకుండా తనలాంటి పిల్లల కోసం ఆలోచించడం రచయిత సూక్ష్మ, సునిశిత బుద్ధికి నాంది పలుకుతాయి.. అలాగే ఎంకటి సహృదయతను చూపిస్తాయి.
"ఎంకటి- సకినాలు" కథలో..
రాము సకినాలు తెచ్చుకొని తింటూ ఉండి, ప్రశాంతంగా ఉన్న తరగతి వాతావరణాన్ని భంగం కలిగేలా చేస్తాడు. అప్పుడు టీచర్, రాముతో పాటు,
ఏ తప్పూ చేయని ఎంకటిని కొడుతుంది. అయినా ఎంకటి టీచర్ కు ఎదురు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. తరువాత మాధవ్ సార్ బోధన అనుభవంతో రాము సకినాలు తెచ్చుకొని, ఎంకటి డెస్క్లో పెట్టి వెంకటిని కూడా పనిష్మెంట్ తీసుకొనెలా చేశాడని మేడమ్ కి అర్థం అయ్యేలా చెప్తారు.అందుకు అనుభవం కూడా కావాలి అని సూచిస్తారు. ఈ కథ విద్యార్థుల అల్లరి చేష్టాలకి నిలువుటద్దం.
ఈ కథలో పిల్లలే కాదు ,టీచర్లు, పెద్దలు కూడా ఎలా నడుచుకోవాలో వివరించారు.
"మేడం గట్టిగా కొట్టిందా రా అని రమేష్ అడిగితే; వట్టిగా కొట్టలేదు కదరా, తప్పు చేసినని కొట్టిందిరా. కొడితే కొట్టని, మన అమ్మ లాంటిదే గదా మేడం"అంటూ సమాధానం ఇస్తుంటే పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.. అలా అంటుంటే వెంకటి మంచితనం, మానవత్వపు బుద్ధి మన హృదయాలను కదిలిస్తాయి. అలా ప్రతి విద్యార్థి మనసు నిండా మానవత్వంతో, సంస్కారంతో జీవిస్తే రేపు సమాజం, మన దేశం ఎంతో ఉత్తమంగా నడుస్తుందో కదా..
ఎంకటి- రూపాయలు కథలో..
అందరితో పాటే వెంకట్ ని సమాంతర పర్యవేక్షణకు వచ్చిన పెద్ద సార్ లక్ష్మా రెడ్డి గారు "నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు?" అని అడిగితే, అందరిలా డాక్టర్,ఇంజనీర్ అనకుండా , "నేను మనిషిని కావాలనుకుంటున్నాను సార్" అని , తరువాత తాను చెప్పిన ఒక సంఘటనతో నేటి కుటుంబ సమాజం కళ్లకు కనబడుతుంది. నేను మనిషిని కావాలనుకుంటున్నాను అనడంలో వెంకటి మనసు మనకు తేటతెల్లమవుతుంది. ముందు మనం మనిషి అయితే రేపు మనం సాధించలేనిది ఏదీ లేదు అంటూ గొప్ప జీవిత సందేశాన్ని చెప్పిన కథ ఇది.
ఎంకటి-అమ్మ కథలో మన హృదయానికి కళ్ళు మొలచి ఏడుస్తాయి. ఒక కొడుకుగా తన తల్లి పై అమలమైన ప్రేమను, విద్యార్థిగా ఉపాధ్యాయులపై, చదువుపై గౌరవం చూపిస్తాడు ఎంకటి. ఆ సంఘటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
తర్వాతి కథల్లో ఎంకటి పరుగు పందాలలో జిల్లాకి మంచి పేరు తీసుకు రావడం, మంత్రిగారు వచ్చినప్పుడు, కరివేపాకు మొక్కలను, వేప మొక్కలను బోకే గా ఎందుకు ఇవ్వకూడదు అనే విషయం మనల్ని ఆలోచించేలా చేయడమే కాకుండా, బాధ్యతాయుతంగా ఆచరించే విధంగా ఉంటుంది.
మనం మనుషులం, మన సంస్కారమే మనల్ని నిలబెడుతుంది అని సందేశాత్మకంగా చెప్పిన జీవిత కథలు ఇవి. కష్టాలను, అవమానాలను ఎదుర్కొని నవ్వుతూ ఉండే వెంకట్ ను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.వెంకట్ నుంచి సంస్కారం ఎంత నేర్చుకుంటే అంత లభిస్తుంది. మనిషి ప్రవర్తనను మంచిబాటలో నడిపించడానికి ఈ పుస్తకం మన మనసుకు ఎంతో దోహదపడుతుంది. ఈ పుస్తకం పాఠకుల పాలిట"మంచి పుస్తకం". వర్ధమాన రచయితల పాలిట "టీచర్" అని నా అభిప్రాయం.
బాలసాహిత్యంలో ఇటువంటి పుస్తకాలను పిల్లల మనసులోకి చేరవేస్తే, రేపు మనకు ఎటువంటి దిగులు ఉండదు. ఎందుకంటే వాళ్లు నేర్చుకొని పదిమందికి సహాయపడటానికి ఆస్కారం ఉంది కాబట్టి. ఈ పుస్తకం అలా తీర్చిదిద్దుతుంది. మంచి పుస్తకాల లక్షణమే అది. తెలుగు బాల సాహిత్యంలో ఇలాంటి జీవిత గ్రంథాన్ని వెలువరించిన గరిపెల్లి అశోక్ గారికి మనసారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి రచయిత ఇలాంటి జీవిత గ్రంథాల్ని రాసి పిల్లలు మనసులోకి చేరవేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం రాసే అక్షరాలు, మన బాల సాహిత్యం సుసంపన్నంగా ఆకాశంలో సూర్యుడిలా వెలుగుతుంది.
!! జై బాలసాహిత్యం!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి