29, నవంబర్ 2020, ఆదివారం

అక్షర జలపాతాలు - మామిడి రమేష్


29, నవంబర్ 2020, ఆదివారం

హరివిల్లు నూతన లఘు కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ మామిడి రమేష్ గారి తొలి హరివిల్లు పుస్తకం"అక్షర జలపాతాలు" పుస్తకంలో నేను రాసిన ముందు మాటలు...

⇉ కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు




రి ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొలకలు, మొక్కలు ఉద్భవిస్తూ కవన పరిమళాలను, కిరణాలను వెదజల్లుతున్నాయి.

తెలుగు భాషా ఘనతను సుస్థిరంగా నిలపాలనే ఆశయంతో, కవిత్వాన్ని సాధారణ జనుల రసన వద్దకు తీసుకెళ్లి, కవిత్వంపై మక్కువ కలిగేలా చేసి, పాఠకులు సైతం కవి కావాలనే ఉద్దేశంతో, కవులు తమ సృజనకు పదును పెట్టి నూతన కవితా ప్రక్రియలకు పురుడు పోస్తున్నారు. "అచ్చంగా తెలుగు" ఇంపును, నుడికారాలను, అతి తక్కువ పాదాల్లో, మాత్రాఛందస్సును, అంత్య ప్రాస నియమం పాటించడం, అలంకారాలను కవిత్వంలో చొప్పించి చిక్కగా, తేనె చుక్కగా అందరూ రాయాలనే నూతన కవితా ప్రక్రియలకు శ్రీకారం చుడుతున్నారు రూపకర్తలు.

అలాంటి కొద్దిమంది కవుల్లో హరివిల్లు కవితా రూపకర్త శ్రీ మామిడి రమేష్ గారిని ఒకరని చెప్పుకోవచ్చు.


ఈమధ్యే రూపుదిద్దుకున్న కైతికాలు, మణిపూసలు, చిమ్నీలు, మెరుపులు వంటి నూతన కవితా ప్రక్రియల రుచిని చూసిన రమేష్ గారు తమ వంతు తెలుగు కవిత్వం కోసం, బడిలో చదువుకునే విద్యార్థుల నుండి, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఈ హరివిల్లు ప్రక్రియను రూపొందించారు అని నా అభిమతం. అతి తక్కువ కాలంలోనే వాట్సప్ వేదికగా అన్ని వయసుల వాళ్లు కలిపి దాదాపు రోజుకు రెండు వందల మందికి పైగానే ఈ సమూహంలో హరివిల్లు కవిత్వం కురిపిస్తున్నారు. అతికష్టమైనా, ఎంతో శ్రద్ధతో వాళ్లల్లో విజేతలను ఎన్నుకుంటున్నారు నిర్వాహకులు.


ఈ "అక్షర జలపాతాలు" లోని హరివిల్లు కవనాలు ప్రతి ఒక్క చదువరిని కవిత్వంతో తడిపేస్తాయి. 160 హరివిల్లులతో అలంకరించిన ఈ వయ్యి సంపూర్ణంగా జనాదరణ పొందుతుందని ఆకాంక్షిస్తున్నాను. నాకున్న వీలునుబట్టి ఇందులోనే చిక్కని కవిత్వాన్ని మీ మదికి చేరవేసే యత్నం చేస్తాను.


" సహనశీలి మగువ

  సమరభేరి మగువ

  ఇంటి వెలుగు మగువ

  ఇలన కాంతి మగువ"(16)-

అంటూ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి మగువలు చేసిన పోరును, మగువలకు ఉన్న గొప్ప లక్షణాలను, ఒక్క హరివిల్లు లో పొందుపరిచారు.

" చలికి వణికి నపుడు

  చెద్దరగును అమ్మ

  అలసిపోయినపుడు

  ఊయలగును అమ్మ"(30)

- అంటూ అమ్మ అవ్యాజమైన ప్రేమ గురించి గొప్పగా వివరించారు.44వ హరివిల్లులో అటు కలియుగంలో జరుగుతున్న నిజాన్ని తెలియపరచి, అమ్మ దివ్యమైన గొప్పతనాన్ని చాటి చెప్పారు."

  

  మాట చెలిమినిచ్చు

  మాట కలిమినిచ్చు

  మాట సమత నిచ్చు

  మాట మమత నిచ్చు"(67)

 మాట ఎంత మహత్తరమైన కార్యాలను చేయగలదో, ఎంతటి ప్రేమానురాగాలను కురిపించగలదో వివరించారు.


" మాతృ భాష లోని

  మకరందం వీడకు

  పరుల భాష యొక్క

  పంచన చేరకు!"(84)

అంటూ మాతృభాషలోని ప్రేమానురాగాలను భోధిస్తూనే, పరుల భాష చెంత చేరకు అని, పరభాష నేర్చుకోవడం వరకేనని చదువరులకు చెబుతున్నారు.


నాన్న ఆప్యాయత, గురువు విశిష్టత, చెలిమి, చెట్టు విశిష్టతలు వెల్లడించారు కవి అపురూపంగా.


"నొసటి రాత రాయు

అసలు బ్రహ్మ ఓటు

  బతుకు బాగు చేయు

  బల సూత్రం ఓటు!"(102)

- అంటూ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూనే, రాజకీయవేత్తలు ఎంత జిత్తులమారులో,కుటిల బుద్ధిగలవారో,కుంటి సాకులు వినిపిస్తారో తరువాతి హరివిల్లు కవితల్లో చూపించారు.


దేశానికి అమ్మై అన్నం అందించే రైతన్న గురించి-

" మెతుకులిచ్చు వాడు

  చతికెలపడే నేడు

  అతీగతీ లేక

  చితికి చేరెను చూడు!" (113)

అంటూ తన కవి హృదయ వేదనను కవిత్వకరించారు కవి.


"మనిషి పైన చేసే

 మారణ హేలల దాడి

 మందుగిందు లేని

 కరోనా మాయలేడి"-(119)



ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధంగా మారిన కరోనా మహమ్మారి పై తన క(ల)రవాలాన్ని సంధించారు.


ఆస్వాదించాలే కానీ ఇందులోని నూట అరవై కవితలు ప్రతి పాఠక ప్రియుడిని తేనె టీగలా మార్చి "హరివిల్లుల మకరందాన్ని" రుచి చూపించగలవు.

మానవత్వం,సమాజ హితం, నడకను, ఆలోచనా శక్తిని, విలువల్ని, విచక్షణని, మానవీయ బంధాలు ఇలా మానవ జీవితంలో ఆవశ్యమైన ప్రతి విషయాన్ని తీసుకుని అతి తక్కువ పదాలతో, పాదాలతో చక్కని కవిత్వాన్ని రాసి పాఠక లోకానికి అందించడంలో కవి సఫలీకృతులయ్యారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కవి రమేష్ గారు మున్ముందు నిత్య నూతనమైన హరివిల్లుల కవిత్వాన్ని తెలుగు పాఠకు ప్రియుల అరచేతుల్లోకి తీసుకెళ్లి వారి హృదయ గ్రంథాలయంలో జీవించ గలరని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మనోరంజక పుస్తకాన్ని వెలువరించిన రమేష్ గారికి అభినందనలు.


✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,

మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్.


బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202

22, నవంబర్ 2020, ఆదివారం

పాలబుగ్గలు పసిడి మొగ్గలు: - వేంపల్లి రెడ్డి నాగరాజు

 స్వర్గీయ, ప్రముఖ సాహితీవేత్త రెడ్డి నాగరాజు వేంపల్లి గారు రచించిన "పాల బుగ్గలు పసిడి మొగ్గలు" పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 

నీతి కథల చిట్టడవి... రెడ్డి నాగరాజు"పాలబుగ్గలు పసిడి మొగ్గలు"(పుస్తక సమీక్ష)


10, నవంబర్ 2020, మంగళవారం

నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు - ఉప్పల పద్మ

 నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 బాలల అక్షర సేద్యం... నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు(పుస్తక సమీక్ష)


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.






హాయ్ నేస్తాలూ! ఎలా ఉన్నారు.నేను మీ మోనిస్.."లిఖిత్ కుమార్ గోదా"ని. నవంబర్ 14 న మన పండుగ సందర్భంగా మీకోసం మన నేస్తాలు రాసిన ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. పుస్తకం పేరేమిటో చెప్పనా? "నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు". మరి ఆ పుస్తకం విశేషాలేంటో చూద్దామా!


"అచ్చటికిచ్చటి కనుకోకుండా

 ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే

 ఈలలు వేస్తూ ఎగురుతుపోయే

 పిట్టల్లారా!

పిల్లల్లారా!!..."



 "శైశవగీతి"లో మహాకవి శ్రీశ్రీ కల్లా కపటం ఎరుగని బాలల గురించి చెప్పిన కవిత ఇది. నిజమే పిల్లలు పక్షుల లాంటివారు. ఏ చోటకైనా, ఎక్కడికైనా కేరింతలు పెడుతూ విహరించగలరు. వారు ఉన్నచోటునే పూదోటగా మలచగలరు. ఆనంద లోకాన్ని సృజించగలరు. బాలలు తలచుకుంటే నిండు మనసుతో ఏ పనైనా ఇట్టే ఆకళింపు చేసుకుని, ప్రీతితో చేయగలుగుతారు. అలా వారి అభిలాషకు అక్షరాల రంగులద్ది చక్కని ,చిక్కని కథలు రాశారు నల్లగొండ జిల్లా బడి పిల్లలు. అలా మన తుంటరులు రాసిన కథలను ప్రముఖ పరిశోధకులు, సంపాదకురాలు శ్రీమతి ఉప్పల పద్మ గారు భగీరథ దీక్షతో పుస్తకంగా మనముందుకు తీసుకువచ్చారు.


ఈ పుస్తకంలోని కథల గురించి చెప్పుకునే ముందు ఈ పుస్తకానికి ప్రాణం పోసేలా చేసిన బాల వదాన్యుడు చిరంజీవి శ్రీ రిషి వర్షిల్ నెలకుర్తి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.

పుస్తక పఠనం ఆవశ్యకత తెలిసి, తన వయసులోని ప్రతిభావంతులైన పిల్లల్ని ప్రోత్సహించాలనే సత్సంకల్పం కలిగి, రాబోయే నవతరం ఉత్తములుగా ఎదగాలనే లక్ష్యంతో, తాను సేకరించిన, సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని మన అరచేతిలోకి వచ్చేలా చేశాడు. చిన్నతనంలోనే దానగుణాన్ని ఇముడ్చుకున్న రిషీ వర్షిల్ నేటి తరానికి ఆదర్శప్రాయం. ఈ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని సహాయం చేయదలుచుకున్న వారు ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. భావి తరాన్ని రంగవల్లులతో నింపాలి.


 నలభై ఐదు రత్నాలతో నిండిన ఈ పుస్తకం విజ్ఞాన కోశాగారం వంటిది. ప్రతి కథలో నీతిని, తాము చూసిన జీవితాలకు చక్కని అక్షర రూపాన్నిచ్చారు ఈ చిరంజీవులు. పిల్లలు ఎంత బాగా చేయి తిరిగిన రచయితల్లా కథలు రాశారో, అంతే బాగా చిత్రాలు గీశారు చిత్రకారులు. చిత్రకారుల బొమ్మలతోనే కథలు మనకు అర్థం అవుతూ ఉంటాయి.

ధీరావత్ భూమిక రాసిన" ఆడపిల్ల" కథ "ఆడపిల్లలపై ఇప్పటికీ జరుగుతున్న వివక్ష"పై రాసిన చక్కటి కథ. గంగ వాళ్ళ ఊర్లో ఒక దెయ్యం ఉండడం, ఆ దెయ్యం అందర్నీ భయపెడుతుందని ఊరి వాళ్ళు చెప్పుకుంటే గంగ వినడం, ఆ దెయ్యాన్ని చూడాలని ఒక రాత్రి కుతూహలంతో అడవికి వెళ్లి ఆ దెయ్యాన్ని కలవడం, ఆ దెయ్యం తానొక ఆడపిల్లనని. తన తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో చిన్నదైనా తనను చంపడంతో తాను దెయ్యం అయ్యానని చెప్పడం, ఆడపిల్లని ఎవరూ చంపకూడదనే సదుద్దేశంతో ఆ చుట్టుపక్కలే సంచరిస్తున్నాని చెప్పడం, ఆడపిల్లల్ని ఎవరిని చంపనివ్వకుండా నేను చూస్తాను అని గంగ హామీ ఇవ్వడం, గంగ ఊరి వారిని మార్చే ప్రయత్నం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.


వట్టికోట గాయత్రి తన "అసలైన కొడుకు" కథలో. వర్తమాన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది. కన్నవారినే కాదనుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో , తనకేమీ కానీ రాజవ్వకు కుండపోత వర్షం పడుతున్నప్పుడు రమేష్ ఆశ్రయం ఇవ్వడం, తనను కాదన్న కొడుకులు తనకోసం, తన ఆస్తి కోసం వచ్చినా, రాజవ్వ మాత్రం రమేష్ ని తన నిజమైన కొడుకు గా భావించడం పాఠకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.


"కొడుకైనా కూతురైనా ఒకటే" కథను తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర ఉదయశ్రీ చాలా చక్కగా రచించింది.

"మట్టి గణపతి" కథలో పర్యావరణ హితాన్ని కోరి శ్రీవర్ధన్ మంచి కథను అందించాడు. నిజంగా ఇలాంటి మార్పులు పల్లె నుండి మొదలవడం ఆవశ్యకం.

"మార్పు" కథ భలే తమాషాగా సాగుతుంది. నిజంగా ఒక చెయ్యి తిరిగిన రచయితలా కథను లిఖించింది రమ్య చెల్లి. కథ చదువుతున్నంత సేపు కూడా పిసినారిని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపడం, వైద్యుడు పిసినారిని గ్రహించి తెలివిగా వ్యవహరించడం, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అందరి మనసులను దోచుకుంటోంది.


పాటి భానుజ "స్నేహం గొప్పతనం", శ్రీవిజ"ఐక్యమత్యమే మహాబలం", భవాని "భయం కలిపిన స్నేహం", మరికొన్ని కథలు స్నేహం గొప్పతనాన్ని చాటుతాయి.

"ప్రాయశ్చిత్తం" కథను రాసిన వైష్ణవి సమకాలీన జీవితానికి అద్దం పట్టేలా రచించింది.


శివమణి "తెలివితక్కువ పని" కథను ప్రశంసించకుండా ఉండలేం. అంత చక్కని కథ.


పావని "చిన్నప్పుడే" కథ, సాహితీ "గురుదక్షిణ" కథలు చదువరులను ఆహ్లాదపరుస్తాయి. మంచి నైతికాలను అందిస్తాయి.

"కోటిలింగాలు" కథ రాసిన శ్రీకర్ చాలా చురుకైన ఆలోచనతో అతి జాగ్రత్త ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వివరించాడు.


"నాన్నా తాగకు", "మారిన మనిషి" మద్యపాన వ్యసనమున్న తండ్రులను ఎలా మారుస్తారో వివరించిన కథలు.

ఇలా చెప్పుకోవాలే కానీ, అన్ని బాల రచయితలు తమ స్థాయికి మించి సృజనకు పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొందరు బాల రచయితలకు హృదయాల నిండుగా అమలిన ప్రోత్సాహం అందిస్తే సాహిత్యంలో తిరుగులేకుండా ఎదగగలరని నా అభిప్రాయం.


తెలుగు బాల సాహిత్య పుటల్లో ఇంతటి మహత్తర కరదీపికను ఎంతో దీక్షతో, శ్రమపడి వెలువరించిన సంపాదకురాలు ఉప్పల పద్మ గారికి అభినందనలు. అలాగే నవతరం నూతన రచయితలు చక్కని కథలు రాసినందుకు ఇవే నా శుభాభినందనలు. అలాగే అందరూ ఆదరించదగ్గ నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు వయ్యిని మన హృదయ గ్రంథాలయం లో పొందు పరచుకునేలా చేసిన, పాఠశాల ఉపాధ్యాయులు , సహకరించిన తల్లిదండ్రులు, చిరంజీవి రిషి వర్షిల్ అభినందనీయులు. 


గోరుముద్దలు - వేంపల్లి రెడ్డి నాగరాజు

 

ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి రెడ్డి నాగరాజు రచించిన గోరుముద్దలు కథల సంపుటి పై నేను రాసిన పుస్తక సమీక్ష

లేత మనసులకు నూతన నేస్తాలు... రెడ్డి నాగరాజు "గోరుముద్దలు"


బాలసాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు మొలకెత్తినా పిల్లలకు విలువలు, నీతిని, చైతన్యాన్ని నేర్పేది మటుకు కమ్మని కథలే. వయసురీత్యా పెద్దలైనా, పిల్లల్లో జాగృతి కోరి, భావి తరానికి బలమైన పునాది వేయాలని అంకితభావంతో , పిల్లల వయస్సుకు దిగొచ్చి, వారికి అర్థవంతంగా, వారు మాట్లాడుకునే భాషలోనే, కథను అందరిలా(కొందరు రచయితలు) చెబుతున్నట్లుగా కాకుండా, కథను కళ్లముందు చూపిస్తూ జరుగుతున్నట్లు రాయడం, ఆ కథల్లో చదువరి బాలలే ఉన్నట్లుగా రాయడం, పరిస్థితుల రీత్యా సమకాలీన జీవనానికి అద్దం పట్టేలా కథలు అల్లడం బాల సాహితీవేత్తలకు కత్తి మీద సాము లాంటిది.




కానీ పరిశుభ్రమైన, పరిపూర్ణమైన సమాజం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే సత్సంకల్పం ఉన్న రచయితలకు మాత్రం పైనున్న మాటలు "వెన్నతో పెట్టిన విద్య"ని చెప్పాలి.




రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఉద్యోగి అయినప్పటికీ, సాహిత్యానికి తరగని విజ్ఞాన, నీతుల కోశాన్ని అందించాలనే సులోచనతో కథా,కవిత,ఇతర సాహిత్య ప్రక్రియల్లో తమ ఎనలేని అక్షర సేద్యాన్ని, సంపదను అందిస్తున్నారు.తన కలం నుండి వెలలేని సాహిత్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంకా ఏదో అందించాలనే తాపత్రయం. ముఖ్యంగా పిల్లల జీవితం మలినం లేని సమాజంలో తిరుగాడలనే లక్ష్యంతో బాల సాహిత్యంలో కూడా నూతన ఒరవడి ఆలోచనలతో, ప్రయోగాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.




  గత ముప్పయేళ్ల సాహిత్య అనుభవం ఉండటం చేత ప్రౌఢ సాహిత్యములో రాణిస్తూనే, ఇటు


బాలసాహిత్యంలో ఇప్పటికే చిన్నారి పొన్నారుల కోసం "బామ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గల- పసిడి మొగ్గలు" వంటి బాల సాహిత్య పోషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.రూపాయికే కథలు అంటూ బాలల కథలున్ధ ఫ్లిప్ బుక్ లు దాదాపు లక్షకు పైగా అమ్ముడుపోయాయి.ప్రౌఢ సాహిత్యంలో వీరు రాసిన రచనలపై కొందరు పి.హెచ్ డీ లు చేస్తున్నారు.


      ప్రస్తుతం గోరు ముద్దలు కథల పుస్తకం వెలువరించారు. బాలల మనసులకు నీతుల కిరణాన్ని ప్రసరింపజేయడమే కాకుండా, పాతదనం నుండి కొత్తదనాన్ని ఎలా సృష్టించుకోవచ్చో తెలియపరిచారు.నేటి వర్ధమాన సాహితీవేత్తలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.




బాగా ప్రాచుర్యం ఉన్న పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలనే తీసుకొని కొత్త తరహాలో సమకాలీన జీవితానికి అనుగుణంగా కథలు లిఖించారు.


ఇందులో ఉన్న 11 బాలల కథలు నవతరానికి దొరికిన ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు.




ఈ గోరుముద్ద వయ్యి లోని మొదటి కథ "దేవత అనుగ్రహం" . ఇందులో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజు చెట్టెక్కి పెద్ద కొమ్మలను నరుకుతూ ఉండగా తన చేతిలోని గొడ్డలి జారీ వాగులో పడిపోతుంది. తన తాతల కాలంలో వాగులోని దేవత తన తాత గొడ్డలి ని పైకి తీసుకు వచ్చిన విషయం గుర్తుకు రావడం, ఎంతసేపు వేచి చూసినా దేవత ప్రత్యక్షమవ్వకుండా గొడ్డలిని ఇవ్వకపోవడంతో అసహనం చెంది ఆ వ్యక్తి గట్టిగా అరవడం, అటుగా పోతున్న ఓ కోతి ఆ వ్యక్తి అరుపులు విని, అతనితో"నువ్వు చెట్లు నరకడం వలన దేవత ప్రత్యక్షమవడం లేదు. ఎందుకంటే చెట్లను నరికి, వనాలను నాశనం చేసేవారు అంటే దేవతకు చాలా కోపం. ఇప్పుడు కట్టెలు అవసరం లేకుండా గ్యాస్ పై, సోలార్ కుక్కర్ లల్లో వంట వండుకునే సౌలభ్యం ఉంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా పట్టణానికి వెళ్ళి గోబర్ గ్యాస్, సోలార్ పవర్ ల ఏజెన్సీ ప్రారంభిస్తే దేవత నిన్ను అనుగ్రహిస్తుంది"అని బదులివ్వడం, ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి లో మార్పు రావడంతో చక్కని ముగింపునిచ్చారు రచయిత.




"కాకి-కడవ" కథలో , మండువేసవిలో బాగా దాహంగా ఉన్న ఓ కాకి ఓ కడవలోకి తొంగి చూస్తే నీళ్లు ఉంటాయి. అయినా ఆ కాకి నీళ్ళు త్రాగడానికి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన మరో కాకి మన తాతల కాలంలో మాదిరి కడవ అడుగున కాక నిండుగా నీళ్ళున్నాయి. పైగా గులకరాళ్లు వేసాము కూడా లేకనే నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా! మరి నీళ్లు తాగకుండా నే వెళ్ళిపోతున్నావ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ కడవలో నీళ్లు మలినంగా ఉన్నందున త్రాగడానికి తను ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ త్రాగితే ఎన్నో జబ్బులతో బాధ పడాల్సి వస్తుందని, మొదటి కాకి రెండో కాకికి చెబుతుంది.


తద్వారా రచయిత ఈ కథలో పిల్లలకి త్రాగడానికి ఎప్పుడూ పరిశుభ్రమైన నీటికే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నాడు. ఏదైనా పని చేసే ముందు తొందరపడి చేయకూడదని, కొంచెం ఆలోచించి చేస్తే మంచిదని ప్రయోగించిన చక్కని నీతి కథ.




మనకు తాతల కాలం నుండి తెలిసిన "పిల్లి మెడలో గంట" కథను నవతరానికి కొత్త సువాసన వచ్చేలా లిఖించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతు ఇంట్లో ఎలుకలను, చప్పుడు చేయకుండా రోజుకు ఒక దాన్ని పిల్లి తినేయడం, రోజురోజుకు తమ సంఖ్య దిగిపోవడం, పట్టణంలోని కళాశాలలో చదువుతున్న చిట్టెలుక సెలవులకు ఇంటికి వచ్చి విషయం తెలుసుకోవడం, రైతు కొడుకు పట్టణం నుండి వచ్చిన సెంట్ బాటిల్ ను అటక పై కూర్చొని పిల్లి పై గుమ్మరీయడం వలన ఆ పిల్లి దేహం నుంచి వచ్చే పరిమళం ద్వారా ఎలుకలు ప్రమాదాన్ని ముందే గ్రహించి తప్పించుకోవడంతో కధ ముగుస్తుంది. చదువుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చునని నీతులు ఇమిడ్చి రాసిన కథ.


"మూర్ఖత్వం" కథలో 'మనకు హాని చేయని ఏ ప్రాణికైనా మనం హాని తలపెట్టకూడదని, అలా కాదని అల్లరి చేష్టలతో పర జీవులకు హాని తలపెడితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో' చక్కగా వివరించిన బాలకథ.




ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలన్నీ మానవ జీవితానికి చక్కని సందేశాత్మక రచనా ప్రయోగాలు. కథలన్నింటినీ సృజనాత్మకంగా రచించిన రచయిత రెడ్డి నాగరాజు గారి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. తన మేధాశక్తికి పదునుపెట్టి పిల్లల కోసం చక్కని బాల కథలు రాశారు. వారి ఈ శ్రమ పిల్లల వరకు చేరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. వారికే కాదు ఏ బాల సాహితీవేత్త కైనా.


రేపు మన కళ్ళు శుభ్రంగా ఉండి, దేశాన్ని నవ్యంగా రూపొందించాలంటే ఇటువంటి పొత్తాలను పిల్లలు చదవడం ఆవశ్యం. తల్లిదండ్రులు లేత మనసులకు ఇటువంటి కథలు చేరవేయడానికి ప్రేరేపించాలి. అప్పుడే నవభారతం నిర్మితమవుతుంది. జై బాలసాహిత్యం!!




పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.


బనిగండ్లపాడు గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507202.




ప్రతులకు:- 

వేంపల్లి రెడ్డి నాగరాజు,

ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,

రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269

మొబైల్:- 7989928459,9985612167.

2, నవంబర్ 2020, సోమవారం

బాల కథంబం - గుడిపూడి రాధికా రాణి

 ఈరోజు సూర్య దినపత్రికలో ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీమతి గుడిపూడి రాధికా రాణి గారి బాల కథంబం పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష (5).

అందరూ ఆదరించే పుస్తకం నాకు కూడా పంపి, నాలో సృజనకు పదును పెట్టేలా చేసిన రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారికి మనః పూర్వక కృతజ్ఞతలు.


నైతికాల మకరందంరాధికారాణి బాలకథంబం   (పుస్తక సమీక్ష)

పసిపిల్లలకు ఈ ప్రపంచంలో విలువైనవి, విశిష్టమైనవి, ఇష్టమైన సంపదలు ఏమన్నా ఉన్నాయీ అంటే అవి ఆలోచనా శక్తికి పదునుపెట్టి, మనసులో మంచి చెడుకు వ్యత్యాసం వివరించి, సద్గుణాల సమేతంగా సత్బాట వైపు నడిపించే బాలల కథలే అని కచ్చితంగా చెప్పాలి.


పిల్లల మనసులు ఐస్కాంతల్లాంటివి. వాటికి నైతికాలను నూరిపోసి, మెదడుకు పని చెప్పే కథలు కనిపిస్తే చటుక్కున అతుక్కు పోతాయి. చక్కగా ఇంట్లో అమ్మో, తాతయ్య నానమ్మలో, అమ్మమ్మ తాతయ్యలో, పాఠశాలలో ఉపాధ్యాయులో తేనెలొలుకు కథలు చెబుతూ ఉంటే అల్లరి బుడుగులు సైతం గప్చుప్ న కూర్చొని వారు చెప్పే కథల్లో విహరిస్తారు. కథల ఒడిలో వాలిపోతారు. కథల్లో వారికి వచ్చే సందేహాలను, బయట అంతుపట్టని విషయాలను కూడా త్వరగా నివృత్తి చేసుకోగలుగుతారు. అలా వారి మనసు, ఆలోచనా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మరి ఆ రాకెట్లా దూసుకుపోయేలా చేసే ఇంధనం.. మేలైన బాలల కథలే కదా!.


అలాంటి మానవీయ, స్ఫూర్తి నీయమైన, ఆలోచనాత్మక, సృజనాత్మక కథలకు నిలయమే గుడిపూడి రాధికా రాణి గారి బాల కథంబం బాలల కరదీపిక.

రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారు ప్రముఖ సాహితీవేత్త. బాలల కథలు, పజిల్స్ ,గజల్స్, కవిత్వాలు రాయడంలో, నిత్య నూతనంగా ఆవిర్భవిస్తున్న నూతన కవితా ప్రక్రియల్లో కలం పట్టడంలో వారిది అందెవేసిన చేయి. రాసిన ప్రతి వాక్యం నలుపాకమే అని చెప్పాలి. భాషా క్రీడాకారిణిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులు. మేలైన బాల సాహిత్యం, ప్రౌఢ సాహిత్యం అందించడంలో సిద్ధహస్తులు.


ఈ పుస్తకంలోని కథలు ఒక్కసారి చదివామంటే చాలు. అల్లరి చేసే గడుగ్గాయులు కూడా సద్గుణులు అవుతారు. ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా సమాజంలో వేటికి విలువ ఇచ్చి జీవించాలో, వేటికి ఇవ్వకూడదో కూడా ఇట్టే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.

పెద్దలు సైతం ఈ కథల్ని పాయసంలా స్వీకరించి,వారి ముందు జీవితంలో ఎటువంటి తప్పులు చేయడానికి ఇష్టపడరు. అటువంటి మేలైన మహత్తర సందేశం కలిగిన కథలివి.

పదేపదే విసుగు లేకుండా చదివించే కథలు. వీటికి అవార్డులతో తూకం వేస్తే అది పొరపాటే అని చెప్పాలి.

ఈ కరదీపిక లో మనల్ని తొలకరిగా పలకరించే "జేబులో జోరీగ" కథ నుండి "ఇరుకిల్లు" కథ వరకు, అన్ని మనల్ని పుష్పక విమానం లో కూర్చోబెట్టుకుని చక్కగా విహరింప చేస్తాయి."మనిషి కావాలి మనిషి"అన్నట్టు,"మనిషి లక్ష్యం మనీషి" అన్న సూక్తే లక్ష్యంగా ఇవి మనల్ని తీర్చిదిద్దుతాయి. నవ్విస్తాయి, నేర్పిస్తాయి ఈ కథలు.

 "జేబులో జోరీగా"కథలో రాఘవయ్య అనే పిసినారికి ఐదు రూపాయల నాణెం దొరకడం, అది మాట్లాడుతూ, రాఘవయ్యని ముప్పుతిప్పలు పెట్టడం, ఎంత దూరం విసిరేసిన తిరిగి తన జేబులోకి రావడం, చివరి ప్రయత్నంలో బిచ్చమెత్తుకునే ముసలమ్మకు ఐదు రూపాయల నాణెం దానం చేయగా, ఆ నాణెం ఏం మాట్లాడకపోవటంతో కథ ముగుస్తుంది.

ఈ కథ ముగింపులో,"ఆకలి వేయకపోయినా స్వార్థంతో తను కొనుక్కుందాం అనుకుంటే, వారించి, వాదించి, వేధించిన ఆ డబ్బే, ఆకలి తో బాధపడుతున్న వ్యక్తికి దానం చేయగానే శాంతించింది"అన్న ముగింపుతో గొప్ప అర్థాన్ని ఇచ్చి చాలా సృజనాత్మకంగా రచించారు రచయిత్రి.

"చంద్రుడి కోపం, సూర్యుడి తాపం" కథలు మనకెందుకు నెలరోజుల్లో నాలుగు సెలవులు (4 ఆదివారాలు), చంద్రుడు ఎందుకు ఒక రోజు సెలవు (అమావాస్య) తీసుకుంటాడో చాలా చక్కగా వర్ణించారు.

అలాగే ఒకప్పుడు చేదుగా చెరుకు, తీపిక కాకర ఉండి ఇప్పుడెందుకు చెరుకు తియ్యగా, కాకర చేదుగా ఉందో , ఒకప్పుడు పాముకి కాళ్లు ఉండి, ఇప్పుడు ఎందుకు పాకుతుందో జానపద కథలు లాగా కల్పితాత్మకంగా సృజించారు రచయిత్రి.


"పంచదార పిల్లి" కథలో, మంచితనానికి, దొంగతనానికి సమాజం స్పందించే తీరు"ఎలా ఉంటుందో విశ్లేషణాత్మకంగా వివరించిన కథ అందర్నీ ఆకట్టుకుంటుంది.


"కుదురులేని కుంకుడు గింజ" కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి."కుదురుగా ఉంటే అందరూ ఇష్టపడతారు" అన్న నేపథ్యంతో కుంకుడు గింజకి , చింతగింజకి మధ్య జరిగిన కథ. మన పరిసరాల్లో నుంచే కథా వస్తువులు తీసుకుని కథలుగా లిఖించడం రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారి సృజనాత్మకతకు అద్దం పడుతుంది.


ఇందులో చెప్పుకోవాల్సిన కథ "కుండ కోరిక "కూడా. ఇది వాట్సాప్ లో రెండురాష్ట్రాలు చుట్టివచ్చిన రైలు లాంటిది. గొప్ప నీతి ఉన్న జీవితానికి సంబంధించిన కథ. కష్టాల కడలిని దాటుకుంటే పొందే సుఖాన్ని, భయపడితే పొందే శోకాన్ని చక్కగా వివరించిన కథ.

"పిసినారి బావ, కోడలి దానగుణం, పిండివంటల రహస్యం" కథలు ముందుచూపు నేర్పించే నిండైన బాలల కథలు.

"ఇరుకిల్లు" మధ్య బంధాలు ఎలా కొలువై ఉంటాయో, భవనాల్లో మానవీయ బంధాలు ఎలా దాక్కుంటాయో" వివరించిన వర్తమాన సమాజపు కథ.

ఈ ఇరవై రెండు కథల్లో కథలో భాగంగానే ముగింపులు నీతిని వివరించారు రచయిత్రి.



ఇలా ఎన్నో ఆసక్తికర శీర్షికలతో,నైతికాల కథలతో ముస్తాబైన ఈ బాల కథంబం కరదీపిక పిల్లల పాలిట ఓ గురువు, ఆస్వాదిస్తే మకరందం, పెద్దల పాలిట మార్గ నిర్దేశం, వర్ధమాన రచయితల పాలిట కామధేనువు, దిక్సూచి.ఇలాంటి కథలు మొత్తం పిల్లలు అందరూ చదివి ఆస్వాదించాలని ఆకాంక్షించాలి ప్రతి తల్లిదండ్రులు. రేపటి భావి భారత పౌరులు ఉత్తమంగా తయారు కావాలంటే చిన్నతనం నుండే ఈ "బాల కథంబం" వంటి కథలు చదవాలి. మనిషి నుండి మహర్షిగా జీవించాలి. బాలసాహిత్యంలో ఇటువంటి మనోరంజక కథల పొత్తాన్ని వెలువరించిన రాధికా రాణి గారికి అభినందనలు.


1, ఆగస్టు 2020, శనివారం

ఉయ్యాల జంపాల - గంగదేవు యాదయ్య


  • పసందైన బుజ్జి పాటల హరివిల్లు...ఉయ్యాల జంపాల

(పుస్తక సమీక్ష)

పుస్తక సమీక్షకుడు:-లిఖిత్ కుమార్ గోదా.,

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ,గురుకుల కళాశాల బోనకల్ ,ఖమ్మం-507204

____________________


బుజ్జి పాటలమ్మా.. బుజ్జి పాటలు‌. పసందైన పల్లె పాటలు, పిల్లలు మెచ్చే ఆట"పాటలు", ఆహ్లాదాన్ని కలిగించే అందమైన పాటలు, పిల్లల మనసులను చురగొనే కొంటైన పాటలు, అందరినీ అలరించి, ఆకట్టుకునే అపురూపమైన పాటలు.


పసిపిల్లలు బుజ్జి పాటలకి భలే తొందరగా ఆకర్షితులవుతారు. బుజ్జి పాటలంటే చెవి కోసుకొంటారు. అమ్మ ఒడిలో కూర్చుని అమ్మ పాడే"చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా?","చికుబుకు రైలు వస్తుంది.."వంటి పాటలు నుండి, స్కూల్లో టీచర్ లు చెప్పే రైమ్స్, పద్యాలు , పాటలు వరకూ ఊ ప్రతిదాన్ని చటుక్కున ఆకలింపు చేసుకుని ముద్దు ముద్దు స్వరాలతో, ముచ్చటైన పదాలతో అందంగా పాడుతుంటారు. సృజనకు తొందరగా ఆకర్షితిమయ్యే మనస్తత్వం పిల్లలది.

అలాంటి పసి మనసులు తెలిసిన గంగాదేవు యాదయ్య గారు బాలల్లో తియ్యటి చిరునవ్వుల కోసం వారు పాడుకోదగిన బుజ్జి పాటలు ఎన్నో సృష్టించారు. ఆ పసి మనసు దోచే బుజ్జి పాటలు ఉన్న బంగారు పుస్తకమే ఈ "ఉయ్యాల.. జంపాల".

గత 30 ఏళ్లు బోధనా శాస్త్రం లో నూతన పద్ధతులు రూపకల్పనా, వయస్సును, స్థాయిని, ఈ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని పాఠ్యాంశాలు తయారుచేస్తున్నారు యాదయ్య గారు. లిపిలేని కోయ, గోండి భాషల్లో బాల సాహిత్య సృజన కోసం శ్రీకారం చుట్టి ఆయా భాషల్లో మొదటి తరం రచయితలను వెలికి తీసి తమ కార్యశాల ద్వారా ఉత్సాహపరిచి మెరుగులు దిద్దుతున్నారు.


కోయ భాషలో తెలుగు లిపితో 8 పుస్తకాలు, కొండరెడ్ల మాండలికంలో నాలుగు పుస్తకాలు రావడానికి సూత్రధారి యాదయ్య గారు. కోయ భాషలో బాల సాహిత్య సృజనను ఒక ఉద్యమంలా చేశారు. ఇవాళ అనేకమందికి కోయ పిల్లలు వారి మాతృభాషలో బాలగేయాలు పాడుకుంటున్నారు.

ఈ ఉయ్యాల జంపాల బుజ్జి పాటల పుస్తకం లో పాటలు భలే గమ్మత్తుగా, పిల్లలను అలరిస్తూ, ఆకర్షిస్తూ కొత్త లోకానికి తీసుకుపోతాయి. కొన్ని బుజ్జి పాటలు నిత్యం ఇంటి దగ్గర, పరిసరాల దగ్గర జరిగే విషయాలే చెబుతూ "అరే నిజమే కదా! మనము ఎలా చేసుంటాం కదా అనుకుంటాం కదా"అని అబ్బురపడేలా చేస్తాయి.


హా..హా.. ఆహా.. బుజ్జి పాటను ఒకసారి పరిశీలిద్దాం,

 "అమ్మ నీళ్లు తీస్తుంటే

నేను కూడా తెస్తాను!

అమ్మ వంటలు చేస్తుంటే

ఆశ్చర్యంగా చూస్తాను!

ఘుమ ఘుమ వాసన వస్తుంటే

గుటకలు వేస్తూ ఉంటాను!

వంటలు తయారు అవ్వంగానే

అంతా స్వాహా చేసేస్తాను!

శుభ్రంగా స్వాహా చేసేస్తాను

ఆహా

ఏమి ఆహారం!!

- ఈ బుజ్జి పాటను పాడుతూ ఉన్నంతసేపు అమ్మ చుట్టూ తిరుగుతూ, అమ్మ చేసే వంట తరించి ఎవరు అలా చేయరు?

అలాగే "వాన.. గానం" భలే గమ్మత్తుగా ఉంటుంది..

"పై నుండి వాన

కింద నుండి నాన

చెట్టు చేమ స్నానం

ఆకు అలమా గానం"-

నిజమే కదా. పై నుండి వాన పడుతుంది ‌. కింద ఆ వర్షం వలన నేను నానుతోంది. చెట్టు చేమ ఆ వాన చినుకులతో తడిచి స్నానం చేస్తాయి. వాన చినుకులు ఆకుల మీద పడుతూ ఉంటే 'టపటప'మని శబ్దం వస్తుంటే అవి పాడుతున్నట్లే గోచరిస్తుంది.

కొన్ని పాటలు భలే నవ్వులు కురిపిస్తాయి.మొదట గొప్పతనం చెప్పినట్లే చెప్పి తరువాత గాలి తీసినంత పని చేసి నవ్విస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ "అనగనగా రాజు"..

"అనగనగా రాజు

కొడతాడు పెద్ద ఫోజు

మూరెడు మూరెడు మీసాలు

బారెడు బారెడు గడ్డాలు

గుర్రాల మీద సవారి

పులిని చూస్తే ఫరారీ"-

నవ్వుకోడానికి పసందైన బుజ్జి పాట ఇది. ఇట్లాంటివి మన బడి పిల్లల నోట్లో కోకొల్లలు.

"నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు" అన్నట్లు సాగుతోందీ "నాగలి..అరక" పాట,

"భూమిని దున్నే బురుక

ఎద్దులు లాగితే ఉరుక

దున్నలు లాగితే బరుక

దున్నిన వానికే ఎరుక

దున్నని వారికి ఏమెరుకా?"

అంటూ హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇందులో రైతన్న కష్టం ,దానికి పశువుల తోడ్పాటు గురించి ఒకింత అస్త్ర ప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది. ఇది ఆనందం కోసమే కాదు ఆలోచించాల్సిన బుజ్జిపాట కూడా.

"నేను పోత ఢిల్లీ"లో-

"కొణిదెస

  కొణిజెర్ల

 కొణిజేడు

 కొడిగెనవాల్లి

ఆపు.. ఆపురా.. నీ లొల్లి

నే.. వెళుతున్నారా.. ఢిల్లీ

నే వచ్చానంటే

చేస్తాను రా నీ పెళ్లి"-

అని పాడుకుంటూ ఉంటే పిల్లలు గొడవలు పెట్టుకుని "నీ పెళ్ళికి డొక్కు లారీ" అనుకున్నట్లు నవ్వొస్తుంది.


"చెక్కెరకేళి" లో

పండుగ హోళీ

తినేది గోళీ

కొట్టేది డోలీ

నమ్లేది పోలి

రాకండి నా జోలి"-అంటూ కొంటెగా బుడుగులు

కుదిరి కుదరక చూపుడు వేలుతో ముందుకి వెనక్కి అంటూ ముఖంలో కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నట్లు ఉంది కదూ.

ఇట్లాంటి పాటలు ఎన్నో మనకి ఉయ్యాల జంపాల పుస్తకాలు పొందుపరిచారు రచయిత.

పిల్లలూ! మనం ఈ పుస్తకాన్ని చదివి అటు హాస్యాన్ని, ఇటు ఆలోచనాశక్తిని పెంచుకుని కల్మషం లేని మనుషులుగా, సమాజంపై అవ్యాజమైన ప్రేమను ఒలికిస్తూ అందమైన ప్రపంచాన్ని సృజించు కుందాం. ఏమంటారు బుడుగు లారా! అల్లరి పాపల్లారా!" పండే"నా?.

____________________________

మొలక న్యూస్

ఉయ్యాల జంపాల రివ్యూ - Molaka News


0️⃣1️⃣/0️⃣8️⃣/2️⃣0️⃣2️⃣0️⃣

13, జులై 2020, సోమవారం

పూల గోపురం - భీమవరం బడి పిల్లల కథలు

  •  వర్తమాన సమాజ దర్పణం -పూల గోపురం


                               

"త్తేజాన్ని కలిగించేది, ఉన్నత విలువలు నేర్పించేది, ఊహాశక్తికి పదును పెట్టేది ఉత్తమమైన పుస్తకం"- 

ఈ సూక్తి నూటికి నూరుపాళ్ళు ఈ "పూల గోపురం బాలల కథా సంకలనానికి" సరితూగుతుంది. బాలసాహిత్య రంగంలో పూలగోపురం ఒక మహత్తరమైన బాలల కథా కదంబం.


సాహిత్యంలో కథలు రెండు రకాలు. ఒకటి కాలక్షేపం కోసం చెప్పుకునే కథలు,రెండోది ఒక నిర్దిష్ట సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చెప్పుకునేవి లేదా రచించేవి. ఈ సంకలనం లోని కథలు సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసినవి. అంటే రెండో కోవకు చెందినవన్న మాట.

      సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, నైతిక విలువలేలక్ష్యంగా పెట్టుకొని, చిట్టి చేతులతో కలాలు పట్టుకొని వర్తమాన సమాజంలో చోటుచేసుకున్న సంఘటనలను, మనుషుల తీరును, నడవడికను, తొలి ప్రయత్నంలోనే చేయి తిరిగిన రచయితల్లా కథలు రాసి సమాజ హితానికి శ్రీకారం చుట్టారు. Vvr Zpss భీమవరం వర్ధమాన (బాల) రచయిత(త్రు)లు. 

ఈ పుస్తకం గురించి చెప్పే ముందు ఒక చిట్టి కథను చెప్పాలి.

"ఒకానొక కాలంలో "పోతగాని" అనే దివ్యమైన మహర్షికి కొంత మంది బాల శిష్యులు ఉన్నారు. శిష్యుల వయస్సు సుమారు 14 - 15 దాకా ఉంటాయి. వాళ్లు పరమానందయ్య శిష్యుల్లా కాదు, అపర మేధావులు. ఎటువంటి అంశానికైనా ఇట్టే స్పందించగలరు. చక్కని హితబోధలు, కథలు, ప్రవచనాలు, వ్యక్తిత్వ వికాసం గురించి బోధిస్తూ కలుషితం లేని ఆ విద్యార్థుల మదిలో జ్ఞాన,సంస్కార జ్యోతులను వెలిగించారు పోతగాని మహర్షి.

ఒకసారి ఈ ప్రపంచానికి ఆపద వచ్చింది. అది కేవలం మనుషుల్లో వస్తున్న మార్పుకి, సంభవిస్తున్న దురాలోచనలకి, దుర్బుద్ధికి, దురలవాట్లకు, అవి దారితీస్తున్న పరిణామాలకు ప్రపంచంలో "మంచితనం" అన్నది కనుమరుగై పోయిది. ఈ విషయం తెలుసుకున్న పోతగాని మహర్షి మనుషుల్లో మాయమవుతున్న మానవత్వానికి, వారిలో సంభవిస్తున్న దుష్టయోచనలకి ఏదైనా చక్కటి ఔషధం (మందు, విరుగుడు) తయారు చేయాలి అనుకున్నాడు. మనిషి మస్తిష్కం లో మానవత్వాన్ని మళ్ళీ చిగురింపజేయాలని అనుకున్నాడు.

అటు పిమ్మట తన శిష్యులకి ఈ ప్రళయం గురించి చెప్పి సమాజానికి ఉపయోగపడే ఔషధానికి తగిన మూలికలు వెదికి తీసుకురమ్మన్నాడు.

వెనువెంటనే శిష్యులందరూ తలొక దిక్కుకి వెళ్లి, కొన్ని రోజులు తర్వాత తిరిగి వచ్చారు. మూలికల్ని చేత పట్టుకొని. వాటిలో మేలైన మూలికలు ఏరారు పోతగాని మహర్షి. అందులో 15 మంది శిష్యులు తలా ఒక మూలికని తీసుకొస్తే, ఒక శిష్యురాలు మాత్రం రెండు సమాజహిత మూలికల్ని గురువుగారికి అందించింది.

ఇక ఆలస్యం చేయని పొతగాని మహర్షి, సంకల్ప బలం చేత తన శిష్యులు తెచ్చిన మేలైన 'సంజీవని' వంటి మూలికలతో కొంతమంది మునులు, మహర్షులుతో కలిసి ఒక యజ్ఞంలా, మనిషిలో దాగున్న కుబుద్ధుని మటుమాయం చేసి, మానవత్వాన్ని పరిమళింప చేసే "పూల గోపురం" అనే దివ్యౌషధాన్ని తయారు చేశారు.

తరువాత పూల గోపురం ఔషధాన్ని సేవించిన ప్రతి ఒక్క మనిషి, తన మస్తిష్కంలోని మలినాన్ని వదులుకొని, జ్ఞాన బోధ జరిగి, హితాన్ని తెలుసుకొని మళ్లీ మనిషిలా రూపుదిద్దుకున్నాడు.

___________

ఈ కథ నూటికి నూరు శాతం హిందీ ఉపాధ్యాయులు, పూల గోపురం బాలల కథా సంకలనం సంపాదకులు, శ్రీ పోతగాని కవి గారి కృషికి, వారికి తోడ్పడిన శిష్యులకి సరిగ్గా సరిపోలుతుంది.

సాధారణంగా పిల్లల కథల్ని పిల్లల కోసం పెద్దలు రాస్తుంటారు. కానీ ఇప్పుడు, కొన్ని దశాబ్దాల నుండి పిల్లల కోసం పిల్లలే రచనలు చేస్తూ "ఆహ్లాదకరమైన,అందమైన,కపటం లేని, కల్మషం లేని పిల్లల లోకాన్ని సృజించుకుంటున్నారు".వారికి తోడ్పాటుగా వెన్నుగా,దన్నుగా పోతగాని కవి గారి వంటి ఎందరో ఉపాధ్యాయులు సహకారంగా నిలుస్తున్నారు. వారిలోని కవిని,రచయితని వెలికి తీస్తున్నారు.

కథా రచన గురించి యువ రచయిత,కవి రాచమళ్ళ ఉపేందర్ గారు తొలిపాదులు పుస్తకంలో ముందుమాటగా ఇలా అంటారు-

"కథా రచన అనేది ఒక సృజనాత్మక కళ.కథ రక్తి కట్టాలంటే సమర్థవంతమైన ప్రతిభ,పాటువాలే కాదు నిరంతరం కృషి ఓపిక ఎంతో అవసరం.

కదిలే కాళ్లను,అల్లరి చేసి పిల్లలను కట్టిపడేస్తుంది మంచి కథ అంటారు.

మరి పిల్లల కథలు రాస్తే. చేయి తిరిగిన రచయితల్లా కథలు అల్లితే. అలా అల్లిన కథలకు పాఠకులకు కళ్ళు చెమ్మగిల్లితే, హృదయాలని పిండేస్తే.. దానికి మించిన సామాజిక ప్రయోజనం ఏముంటుంది? పిల్లల కృషికి అంతకు మించిన బహుమతి ఇంకేముంటుంది?" అంటారు.

పై మాటలు అన్నీ పూల గోపురంలో కథలు రాసిన తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు ఎటువంటి సందేహం లేకుండా చెల్లుబాటు అవుతాయి.

ఇప్పుడు వస్తున్న కథల పుస్తకాలలో కల్పితాలకు చోటు ఎక్కువ. మానవతా విలువలు, సమాజ పోకడ కలిగిన బాలల కథలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గ్రహించిన పోతగాని కవిగారు వర్తమాన సమాజాన్నే కథలుగా మలిచేలా విద్యార్థుల చేత ఈ కథల సంకలనాన్ని రాయించారని భావించవచ్చు.

ఈ కథల పుస్తకంలోని కథలన్నీ విశిష్టమైనవి, విలువైనవి.

ముందుగా కథల సంకలనం ముఖచిత్రం మనల్ని ఆకట్టుకుంటుంది. పేరు కూడా సరికొత్తగా ఉంది "పూల గోపురం" అని.

కథలకు తగిన రీతిలో ఈ పిల్లలు రాసిన కధల శీర్షికలు ప్రతి పాఠకున్ని ఆకట్టుకుని, వేటికవే పోటీ పడుతుంటాయి.

పిల్లలందరూ గ్రామీణ జీవనం నుండి వచ్చారు కాబట్టి కథలన్నీ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి అద్దం పడుతూ ఎక్కడా విసుగును కలిగించకుండా హాయిగా సాగుతుంటాయి.

మొదటి కథ "భయం కాటు" ఎస్.నిహారిక రాసిన

కథ ఎదుటివారి సొత్తును దొంగతనం చేస్తే మనకు తెలియకుండా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా వెల్లడించింది.

"చదువు విలువ"కథలో సాయి రాం ఎంతో పరిణితితో ప్రస్తుతం చాలామంది జీవితాల్లో జరిగే సంఘటనలే ఉదాహరణగా తీసుకొని చక్కని కథని అల్లాడు. కార్తీక్ చదువుకోకుండా బలాదూర్ తిరుగుతూ తల్లిదండ్రుల కష్టం తెలియకుండా ఉండడం, ఒకసారి తల్లిదండ్రులు ఎలా పని చేస్తున్నారోనని తెలుసుకోవడానికి పొలానికి వెళ్లి వాళ్ళు ఎండలో కష్టపడి పని చేయడాన్ని చూసి పశ్చాత్తాప్పడి చదువుపై శ్రద్ధ చూపడం ప్రతి పాఠకున్ని ఆకట్టుకుంటుంది.




కె. పావని రాసిన"చెలిమి చెరిచిన చరవాణి"కథలో వర్తమాన సమాజంపై సెల్ ఫోన్ పిచ్చి పిల్లల్లో ప్రేమానురాగాలను ఎలా దూరం చేస్తుందో తెలియపరచింది.తరువాత నాయనమ్మ యుక్తితో చేసిన పని వల్ల సెల్ ఫోన్ భూతం వీడి మళ్ళీ మిత్రుడు తో స్నేహం చేయడం తో మంచి ముగింపు నిచ్చింది.


ఎస్. అఖిల్ కుమార్ రెడ్డి రాసిన"పిల్లి సాక్ష్యం"కథ చదువుతూ ఉంటే అచ్చంగా చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో కథలు చదివినంత ఆనందం కలిగింది.

ఎంతో తెలివితో, సమయస్ఫూర్తితో రాసిన కథ ఇది.

జి. అఖిల తన"వలపోత"కథలో పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కన్నులు చెమ్మగిల్లేలా రాసింది. కథా ఇతివృత్తం నవ సమాజానికి అద్దం పట్టింది.


బి.నితిన్ "పిట్టల శాపం"కథలో చెట్లను నరికి పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాకుండా, పక్షులు, జంతువులు నివాసాలు కోల్పోవడం వల్ల పిట్టలు మనుషులపై ఆగ్రహించి శపించడం అనేది ఆలోచించాల్సిన అంశం. నీటి ప్రాముఖ్యతను తెలియపరిచిన కథ ఇది.


"ముగ్గురు మిత్రులు" కథలో కె.ఉమ

     "మంచి హృదయం ఉన్న వాళ్ళు ఎంతమంది కైనా స్నేహాన్ని పంచగలరు" అనే ఒక్క మాటను ఆధారం చేసుకొని కథను నడిపించింది.

మనుషుల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని, నిజమైన నిస్వార్ధమైన మిత్రులు చెప్పుడు మాటలకు తొందర పడరని మృదువుగా చెప్పి కథని ముగించింది.


"పాల పంచాయతీ" కథలో ఎన్. రక్షణ-

"కన్న తల్లి కి ఎంతమంది బిడ్డలు ఉన్నా అందరికీ సమానంగానే ప్రేమను పంచుతుంది"అనే సూక్తిని తీసుకొని యుక్తితో మన ఇంట్లో నిత్యం జరిగే అక్కాచెల్లెళ్ళు,అన్నాతమ్ముళ్లు,తోబుట్టువుల గొడవల్ని కథలా మలిచింది.

"కనులు చూసిన వెంటనే, బుద్ధికి పని చెప్పకుండా అనుమానాన్ని,తీర్చుకోకుండా అసూయతో రగిలి పోకూడదు" అంటూ 'అనుమానం పెను భూతం' అని చక్కని హితబోధ చేసింది.


కథా శీర్షికలోనే "తాగుడు వ్యసనం"అంటూ హెచ్చరిస్తున్న నఫ్రీన్ సమాజంలో నిత్యం జరిగే సంఘటననే కథావస్తువుగా తీసుకుని ఇంటి పెద్ద తాగడానికి అలవాటుపడి కుటుంబాన్ని ఒంటరిగా ఎలా రోడ్డుమీద వదిలేస్తుంటాడో దృశ్యమానం చేసింది.

"సంకల్పబలం"కథలో నందిని-

నేటి సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే ఆడపిల్ల పడే అవస్థని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఇది వర్తమాన అంశం. సంఘంలో అనుదినం చోటుచేసుకునేది.

ఈ కథలో శ్రావణి లాగే తల్లిదండ్రుల్ని కోల్పోయి సంకల్ప బలం చేత చక్కగా చదువుకొని విజ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఆడపిల్లలు కోకొల్లలు. 

తల్లి తండ్రులు చనిపోతే ఆడపిల్ల నిస్సహాయంగా ఉంటుందని, చుట్టాలు ఎవరూ పట్టించుకోరని,అదే మగవాడైతే ఎవరైనా ముందుకు వచ్చి పెంచుకుంటారని నేటికీ కొనసాగుతున్న ఆడ మగ వివక్షని కళ్ళు చెమ్మగిల్లేలా కథలో చొప్పించింది.


        "ఆస్తులు-ఆత్మీయతలు"కథను రాసిన ఎం. సరస్వతిని అభినందించకుండా ఉండలేం.

ఈ కథను చదువుతున్నంతసేపు మనసుకు ఉల్లాసంగా,ఆలోచించే విధంగా ఉంటుంది.ఈ కథ చదువుతుంటే వారికి ఈ సమాజం పైన ఆత్మీయతలకు, డబ్బుకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతగా అవగాహన ఉన్నదో అర్థం అవుతుంది.ఈ కథను చదువుతూంటే ఒకప్పటి పాత సినిమాల్లోకి వెళ్ళిపోతాం. మానవ జీవితంలో ఆస్తులకు విలువ ఇస్తే ఎలా ఉంటామో, ఆత్మీయులకు విలువ ఇస్తే ఎలా బ్రతుకుతామో ప్రత్యక్షంగా చూపించే కథ.


         తొమ్మిదవ తరగతి చదివే బాలస్వామి "చదివే హక్కు" అంటూ ఒక నినాదాన్ని పలికినట్లు కథను రాశాడు.

ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తూ,ప్రస్తుతం సంఘాల్లో పేదల పిల్లలు చదువుకోకుండా పనులు చేస్తూ ఉండడాన్ని చూపించాడు సూక్ష్మంగా.

కథలు రాయడం అంటే కేవలం కథ చెప్పడం కాదని, కథా రచయిత కథలోని పాత్రలతో మాట్లాడించాలని తన పదునైన పద, భావజాలంతో వ్యక్తపరిచాడు.

చివరిగా "దాన ఫలం" కథలో నాజియా బేగం "ఎదుటి వారి కష్టాలను ఎరిగి సాయపడితే మనం సాయం పొందుతామని" హితవు పలికింది.

పాఠశాలలో చదువుకునే దశలోనే ఇంతటి సమాజ అవగాహన, ప్రేమానురాగాలు, పదునైన భావజాలం కలిగిన (కలగలిసిన) ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు భవిష్యత్తులో గొప్ప మానవతా విలువలు తెలిసిన రచయిత(త్రు)లు కాగలరని ఆశిస్తున్నాను.

పిల్లలకి ఇంతటి మహత్తరమైన జ్ఞానం, ప్రేమ, సద్గుణాలను తెలియపరిచి సమాజానికి "నైతిక విలువల టానిక్"ని అందించిన శ్రీ పోతగాని కవి గారిని అభినందించకుండా ఉండలేం.

ఇలాగే ప్రతి ఒక్క పాఠశాలలో పిల్లలు ,ఉపాధ్యాయులు నవ సమాజం కోసం పూలగోపురంతో ముందడుగు వేసిన భీమవరం పిల్లల్లా కృషి చేసి ఈ సమాజానికి మహోన్నత రచనలు అందిస్తే రేపు ఈ సమాజంలో మన చూపులు చాలా శుభ్రంగా ఉంటాయి.

ఇది కేవలం బాలసాహిత్యాన్ని, తెలుగు భాషని కాపాడుకుంటే జరిగే మార్పు.అందుకే తెలుగు భాషని, బాలసాహిత్యాన్ని కాపాడుకుందాం పరిశుభ్రమైన నవ సమాజాన్ని తరిద్దాం, సృష్టిద్దాం.


||జై బాలసాహిత్యం|| ||జై జై వర్ధమాన(బాల) సాహిత్యకారులు||

11, జూన్ 2020, గురువారం

మధుర పద్మాలు - జక్కాపూర్ బడి పిల్లల కవిత్వం

 పుస్తక సమీక్ష -1

రోజూ నేను ఏదో ఒక సాహిత్య రచనలు నావి మీకు పరిచయం చేస్తున్నాను. ఈసారి మీ ముందుకు నేను రాసిన పుస్తక సమీక్షను తీసుకొచ్చాను. 2 వారాల క్రితం భైతి దుర్గం అనే సార్ వాళ్ళ పాఠశాల నుంచి వెలువరించిన మధుర పద్మాలు అనే బాలల కవితా సంకలనాన్ని నాకు పిడిఎఫ్ పంపి నువ్వు పుస్తక సమీక్ష రాయగలవా? అని అడిగారు. నేను నా ప్రయత్నంగా రాస్తాను సార్ అని బదులిచ్చాను. అన్నదే తడవుగా ఒక రోజులో పుస్తకాన్ని చదివి పుస్తక సమీక్షను రాశి భైతి దుర్గం గారికి పంపించాను. వారు చదివి బాగుందని ప్రశంసించి నేటి నిజం పత్రికకి పంపగా ఈరోజు ఆ దిన పత్రికలో ప్రచురితమైనది. సహకరించిన నేటి నిజం దినపత్రిక సంపాదకులు శ్రీ బైస దేవదాసు గారికి, మధుర పద్మాలు బాల కవితా సంకలనం సంపాదకులు శ్రీ భైతి దుర్గం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
     
       నాయీ మొదటి పుస్తక సమీక్ష చదివి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచగలరు అని ఆశిస్తూ-
మీ లిఖిత్ కుమార్ గోదా.
____________________________
నా మొదటి పుస్తక సమీక్ష జక్కాపూర్ బడి పిల్లలు రాసిన కవితల సంకలనం "మధుర పద్మాలు"పై.
పుస్తక సమీక్ష-1
పుస్తక సమీక్ష-"1"
శీర్షిక: - చైతన్య దీపాలు.. మధుర పద్మాలు
పుస్తక సమీక్షకుడు: - లిఖిత్ కుమార్ గోదా
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    ప్రతిభకు వయసు పరిమితి లేదని పెద్దల మాట. బడిలో చదువుకునే దశలో కేవలం చదువుకోవడం, పరీక్షల్లో మార్కుల కోసం పోటీ పడటం, స్నేహం చేయడం, ఆడుకోవడమే ఇప్పటి విద్యార్థులకు తెలిసిన విషయం. కానీ ఇంత చిన్న వయసులోనే కలాలతో స్నేహం చేస్తూ సమాజ శ్రేయోభిలాషులు గా మారి ప్రస్తుతం వాళ్ళు మానవ జీవనాన్ని దర్శిస్తూ, తమ ఆలోచనలని కవితలుగా మార్చి సమాజంపై తమ ప్రభావం ఎట్టిదో, చిట్టి కలాలతో బయల్దేరి తమ అభిమతాన్ని వ్యక్తపరుస్తున్నారు జక్కాపూర్ బడి పిల్లలు.
    తేనె పట్టు కావాలంటే తేనెటీగ సుమాల పై వాలి వాటిని సేకరించి ఒక చెట్టు కొమ్మపై చేర్చాలి. ఆ సేకరించిన తేనె మనందరికీ ఎంతో ఆరోగ్యకరం శ్రేయస్కరం. అలాగే తేనె దాదాపు వెయ్యి సంవత్సరాల వరకు నిలవ ఉండగలదు. అట్లాగే ఈ ప్రపంచం ఉన్నంతవరకూ ఎక్స్పైర్ లేకుండా నిలిచే కవిత్వమే ఈ “మధుర పద్మాలు” కవితాసంకలనం.
      మాన్యులు, సాహిత్యకారులు, పాఠశాల గురువులు శ్రీ భైతి దుర్గయ్య గారు తాను కలలు కనే నవ సమాజం కోసం తేనేటీగలా మారి, సుమాల ఉద్యానవనం లాంటి జక్కాపూర్ బడిలో అందమైన సుమాల వంటి విద్యార్థులలో అక్షరం దాల్చిన కవితల్ని సేకరించి మనకి తేనెపట్టు లాంటి ఈ కవితా సంకలనం రేపటి భారతదేశ శ్రేయస్సు కోరి అందించారని సంశయం లేకుండా చెప్పవచ్చు. తెలుగు భాష అవునత్వం ఉట్టిపడేలా తమ రచనలు కొనసాగించిన ఈ బాలలందరికీ ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.
ఇక ఈ నవ కవితాసంకలనం లోకి వెళితే బాల కవులు తమ సృజనకు, ప్రతిభకు పెద్దపీట వేశారని చెప్పాలి. అక్షర సంపద ధారాళంగా ప్రదర్శిస్తూ ఈ సమాజానికి మేలైన కవితలు అందించారు ఈ బాలబాలికలు. వారిలో దాగున్న గురుభక్తిని, తల్లిదండ్రులపై ప్రేమని, స్నేహం పై విలువని, పర్యావరణం పై బాధ్యతని, దేశానికి చేయాల్సిన సేవని చిట్టి కవితలతో వర్ణిస్తూ మిఠాయి లాంటి కవితలు రాశారు ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..




      మనల్ని లోకానికి పరిచయం చేసేది అమ్మ. మమతకి, సహనానికి మారుపేరు అమ్మ. కానీ అలాంటి అమ్మని బాధ పడితే ఏం జరుగుతుందో గురజాల అలేఖ్య తన “దూరం” కవితలో -
             “అమ్మను బాధ పెడితే
               ప్రేమ దూరం అవుతుంది”
 అని సత్యవాక్కు పలికింది.
అలాగే చాలామంది బాల కవులు అమ్మ నాన్న ని కవితా వస్తువుగా తీసుకొని ఎవరికి వారే భిన్న ఆత్మ కంగా అమ్మ పెట్టే పాలబువ్వ లాగా, నాన్న నోటికి అందించే మిఠాయి లాగా అందమైన కవితలతో రంజింప చేశారు. తమ తల్లిదండ్రుల పై వారికి ఎంత ప్రేమ ఉందో తమ కవితల్లోన తెలియపరిచారు.
      తోకల కావ్య రాసిన కవితలో -
       “బడి మన దేవాలయం
        గురువు మన పూజారి” -
అంటూ కవితను ప్రారంభించింది. ఆ కవితను చదువుతుంటేనే మనకు అర్థం అవుతుంది ఆ బాల బాలికల ఎదలో ఆ బడి సంస్కారాన్ని ఎంత లోతుల్లో నాటిందోనని. 
తమ వెలలేని ప్రేమకు రూపాన్ని ఇచ్చిన గురువులు దుర్గయ్య గారికి తమ వంతు ప్రేమతో, గురుభక్తితో, గురువుపై విశ్వాసంతో ఆ గురువునే ఉదాహరణగా తీసుకొని కమ్మని కవితల వర్షం కురిపించారు అనడంలో అతిశయోక్తి లేదు.
క్రీడలకు దూరమై శారీరక బలాన్ని రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు నేటి బాలలు. వీడియో గేమ్ల పిచ్చి పట్టి పుస్తకాలను సైతం పక్కన పెట్టేశారు. పబ్జి , ఫ్రీ ఫైర్ అంటూ ఎన్నో క్రూరాత్మక, హింసాత్మకమైన వీడియో గేములు ఆడుతూ తమ మస్తిష్కంలో కోపాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని జ్వలించు కొంటున్నారు.
పబ్జి, ఫ్రీ ఫైర్ వంటి ఆటలు వలన, పుస్తకాలను దూరం పెట్టడం వల్ల పిల్లలు ఏం కోల్పోతున్నారో, ఏం పొందుతున్నారు సమాజానికి గుర్తుచేస్తూ నిరుగొండ అఖిల్ తన పబ్జీ కవితలో ఇలా రాసుకొచ్చాడు -
       “పబ్జి ఎందుకు?
         చాలా పుస్తకాలు ఉండగా
         చదువుకుని అవుదాం గొప్పవాళ్ళం!” - అంటూ అటు సెల్ ఫోన్ వాడకం, సెల్ ఫోన్ ఆటల్ని నిలుపుకొని, పుస్తకాలు పట్టు“కొమ్మ” నాడు. “సెల్ఫోన్ వద్దు పుస్తకాలే ముద్దు” అని చెప్పకనే చెప్పాడు ఈ బాలమేధావి.
       ఓటు విలువ ఎంతటి మహత్తర మార్పును తెస్తుంది తమ కవితల ద్వారా వెల్లడించారు తమ్ముళ్లు ఎర్రం అంకిత్ రెడ్డి, కరికె నితీష్ కుమార్. ఓటు గురించి వీరు రాసిన ప్రతి అక్షరం నేటి పెద్దల నుండి రేపటి పిల్లల దాకా చర్చాంశనియం.
మనిషి జీవితంలో చెట్లు మహోన్నత స్థానం కలిగి ఉంటాయి. చెట్టుకి మనిషికి వ్యత్యాసం తెలుపుతూ కరికె నితీష్ కుమార్ తన “పుణ్యకార్యం” కవితలో -
          “మనిషికి లేనిది పరోపకారము
            చెట్టుకు ఉంది ఆ లక్షణం” - అని ఒక్క వాక్యంలో తన కవిత్వం అంతా అర్థవంతంగా చెప్పేశాడు. నేటి మనిషికి ఎదుటి వ్యక్తికి పరోపకారం చేద్దాం అనే సదుద్దేశంతో లేకపోవడం కవితా వస్తువుగా తీసుకున్న ఈ బాల కవి రేపు మహోన్నత కవితలు రాయగలడని ఆకాంక్షిస్తున్నాను.
మారుతున్న ఈ ఆధునిక కాలంలో సైకిల్ విశిష్టత తగ్గిపోయింది. ఇప్పుడు పదేళ్ళు పిల్లలు సైతం బైకులు నడుపుతూ చక్కర్లు కొడుతున్నారు. కానీ సైకిల్ విశిష్టత కవిత ద్వారా ఇలా చెప్తుంది తేజస్విని చెల్లి -
            “రెండు చక్రాల బండి
              మనకు ఎంతో మేలైన బండి
             గొప్పనైన బండ్లు చేయలేని పని
             ఒక్క సైకిల్ మాత్రమే చేస్తుంది” .
అంటూ సైకిల్ మనకు అందించే ఆరోగ్యాన్ని, చేర్చే గమ్యాన్ని ఇట్టే చెప్పేసింది.
పర్యావరణం పై ప్రేమతో పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెబుతూనే, మన పండుగలు సైతం సంస్కార రహితంగా జరుపుకో కుండా, శాస్త్రయుక్తంగా జరుపుకోవాలని తమ కవితల ద్వారా అద్దం పట్టారు జయంత్, రాగల చంద్రలేఖ, దుర్గం స్నేహ. వీరిని అభినందించకుండా ఉండలేము.
 “మహా ఉద్యమం” అంటూ స్వచ్ఛభారత్ పై కవిత రాసిన సూర్య శ్రేయ మనకు మన బాధ్యతను తెలియపరిచింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకు ఏ రోగాలు అంటవని, అప్పుడే దేశం మహోన్నతంగా స్వచ్ఛంగా ఉండగలదని తెలియపరిచింది.
బొప్ప సాత్విక తన “అన్న చెల్లెల బంధం” కవితలో
          “ఇలవేల్పు నీవే
           నాకు రక్షణ నిచ్చేది నీవే
           నీ రుణం తీర్చగలనా?”
అంటూ రాసిన కవితలో అన్నా చెల్లెల అనుబంధాన్ని ఉట్టి పడేలా చేసింది.
      చిన్న వయసులోనే సమాజంపై ఇంతటి సామాజిక స్పృహ, అవగాహన కలిగి ఉన్న మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు చూస్తే రేపు నవ్యభారతం తయారవుతుందని గుండెల మీద చేయి వేసి చెప్పగలను.
బాలలందరూ భగీరథ దీక్షను చేపట్టి ప్రతి ఒక్కరూ ఉపమన్యుడులా పట్టుదలతో పదునైన కవితలు రాశారు. ఇంతటి గొప్ప కార్యానికి సహకరించిన శ్రీ భైతి దుర్గయ్య గారిని ప్రశంసించకుండా ఉండలేము.
అలాగే ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక ఉపాధ్యాయుడు సాహిత్యం పై మక్కువ కలిగి విద్యార్థులకు తెలుగు సాహిత్యం పై మక్కువ కలిగేలా చేసి మధుర పద్మాల వంటి ఎన్నో బాల సంకలనాలు తీసుకొస్తే రేపు తెలుగు సాహిత్యానికి లోటు ఉండదు. రేపు తెలుగు భాష కనుమరుగు అవుతుంది అన్న బాధ మనకు ఉండదు.
తమ అభిలాషను కొనసాగిస్తూ రేపటి ప్రజల్లో కూడా చైతన్య దీపాన్ని వెలిగిస్తారు అని' గురువులకు, తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి మహోన్నత కీర్తిని సంపాదించి తీసుకొస్తారు అని ఆశిస్తూ
మీ లిఖిత్ కుమార్ గోదా
మీలాంటి ఓ బాల కవి.
_________________