The Songs of Sentinels - Goondla Venkatanarayana's poetry collection
ఈ మధ్య పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ పుస్తకం ఏ అవసరార్థం రాయబడింది? రాసిన వ్యక్తి ఆ రచనని దేనికి సంకేతంగా, సూచనగా వ్రాశాడు? అతను వర్ణిస్తున్న వస్తువు తాలూకా సిద్దాంతం ఎలాంటిది? అతను పునరావృతం చేస్తున్న విషయాలు, పదాలు ప్రజానీకానికి ఎలాంటి వివరణలు ఇస్తున్నాయి? అన్న విషయాలను ఓకింత ఆలోచనాత్మకంగా చూస్తున్నాను. Recent గా చదివిన అమెరికన్ రచయిత Cormac McCarthy - the Border trilogy లో Vaqueros(Cowboys) మధ్య పారే రక్తపాతం (Blood-oath), హింసాత్మక ధోరణి (Violence )- దోపిడీ గురించి అతను అదను అనుకున్న ప్రతీ విషయంలో జొప్పించి పాఠకులను attentiveగా నిలుపుతాడు. ఉదా: blood coloured- bar light, blood coloured- sunlight… ఇలాగే “కాపలాదారుల పాటలు” పేరుతో కవిత్వంలో రాత్రిని, చీకటిని, పాటని,పొద్దుపొడుపుని, అడవిని, వెన్నెలని, వానని ఇలా ఎన్నో విప్లవాత్మక ప్రతీకలను వాడి అన్నలపట్ల, తన మనుషులపట్ల, అన్నలని కనిపెంచిన పల్లెలు, అడవులుపట్ల ప్రేమని వ్యక్తపరుచుకుంటున్నాడు గూండ్ల వెంకటనారాయణ.
నిజానికి నాకు అన్నలు తెలియదు. వాళ్ళ గురించి విన్న కథలు లేవు. వాళ్ళు రాత్రులలో వినిపించిన పాటలు, రాగాలు తెలియవు. తూటా చప్పుడు తెలియదు. అలా తెలియనితనంతో చదివిన పుస్తకంలో తెలుసుకున్న విషయాలు భలే ఆసక్తికరంగా తలపిస్తాయి. అలా దాదాపు ఈ కవితలు నాకు కైపెక్కిన రాత్రిలా తోచాయి. ఈ కవితలని అర్థం చేసుకోవాలంటే అడవులని ఊహించుకోవాలి, అణచబడుతున్న జనావళి ఆర్తనాదాలని ఊహించుకోవాలి, మొత్తంగా ఒక యుద్ధపు వాతావరణాన్ని కనుగొనాలి అప్పుడే ఈ పాటలు మనసుల్లోకి కూరుకుపోతాయి.
పేరు లేని ఓ రాత్రి-
“అయినా ఇప్పుడు తీరిగ్గా నువ్వూ నేనూ చెప్పుకోవడానికి ఏముంది?
ఏదో వెలితి కమ్మాక నీకూ నాకైనా ఏం శాంతి? మనవాళ్ళు ఇంకా బానిసలే అన్నది మన గుండెల్లో నెత్తురును ఏం మిగిలిస్తుంది? పిరికెడు గడ్డ కట్టిన కన్నీళ్ళనే కదా!
ఇలాంటి రోజుల్లో దేశద్రోహులమై ఈ నేలపై ఉన్నామంటే
మన వాళ్ళ తరుపున నిలిచామనే కదా! కనీసం మనవాళ్ళ బానిసత్వం గురించి పికిలిగొంతులతోనైనా మాట్లాడుతున్నామనే కదా!...
….
ఇదీ దేశ ద్రోహమేనా?
ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు ద్రోహుల గురించి ఎందుకు ఆలోచిస్తారు? మనుషుల గురించి ఆలోచించకుండా?
ఈ కవితావాక్యాలు అన్నలు ఎందుకు పోరుబాటపై మళ్ళుతున్నారో తేల్చేస్తున్నాయి.
దీనిని పొడిగిస్తూ మధ్యలో ఇలా అంటాడు -
“రాజ్యం అధికారాన్ని కన్నాక దాన్ని మట్టుబెట్టకపోతే
అణిచివేత ఎప్పుడూ దాని అడుగున మగ్గుతూనే ఉంటుంది”
అని పోరాటం ధిక్కారం ఎందుకు ప్రకటిస్తారో మాట్లాడతాడు.
“నగరపల్లెటూరు” అంటూ బెజవాడ గురించి వ్రాసిన కవిత ఆ ప్రాంతపు జీవన రీతిలో ఈ పాటగాడి జీవితం తీసిన రాగాలు వినిపిస్తుంది. “పేదరాశి పెద్దమ్మ శాత్రం” Narrative-Story based poem చాలా beautiful గా అనిపించింది. ఈ రాతరి జానపద కల్పనలో రాసిన కవిత లాంటి కథని, కథ లాంటి కవితని చదవడం కొత్తగా అనిపించింది.
“పూర్వుడు” కవితలో తన పూర్వికులను వారి వేషధారణను గుర్తుకుతెచ్చుకుంటూ, ముగింపులో ఇలా అంటాడు -
“నేలపై దారుల్ని ఈ మానవులు నిర్మించుకున్నారేమో
మన పూర్వులు మన కాడికి వచ్చిపోవటానికి” అనడం ఒక కొత్త ఊహని, ప్రేమని, జనస్రవంతిలో సరైన మార్పుకోసం పాటుపడిన పూర్వీకుల ఆశని చూపిస్తుంది.
చేదుపాట కవితలో -
“....
కథల్ని మింగేసే కాలం
పొత్తాలు, తత్వాలు
లోకంలో ఒక కాకి
దాని కూత కుక్క అరుపు…” అని తన తరం నిజంగా ఎదురిస్తున్న అలలిత కళాహృదయావస్థ గురించి, వాస్తవాలను మట్టుబెట్టే మతోన్మాదులు, పాలకుల గురించి మాట్లాడడం, ఆవేదన చెందడం ఆలోచించదగినది అనిపించింది.
“పొడుపు” కవితలో అణిచివేత ఉంది, పాటగాడి కలలున్నాయి, దేనిచేత భయమో, ఏ కాషాయరంగు కుతంత్రము దేశాన్ని చీకటి మింగినట్టు అజ్ఞానంలోకి మింగుదాముకుంటుందో దాని తాలూకా కవితాసూచనంతా indirectగా ఉంది. అలాగే తాత్వికంగా అణిచేవాడిపై, అణచబడ్డవాడిపై సమానత్వం దాగుంది.
హైదర్ బాగ్ -
“ఓ నా పూలతోటా...
నువ్వు నా పూర్వికుల మోహంజారో నగరానివే కదా!
ఈ లోకపు ప్రేమ గీతమా
నాలుగు వీణల మినార్ ప్రియతమా
ఈ చీకటి రాత్రి నాతో ఉసులాడి
ఎందుకు నన్ను మభ్య పెడతావు?
తాగుబోతుని, తిరుగుబోతుని అయినా నన్ను
అక్కున చేర్చుకున్న నా హృదయమా
నువ్వు ఈ దేశపు చిత్ర పటంలో
దేశ ద్రోహుల ఇంటివి అయినందుకు గర్విస్తున్నాను.
నిజాం నవాబు చెంతన కూర్చొని
ఈ రాత్రి మందు కొడుతున్న భాగ్యాన్ని కల్పించిన
నా బాగ్ చెలియా…”
ఈ దేశంలో ప్రస్తుత Political atrocities అందరికీ సుపరిచితమే. మనిషిని మతంతో కుళ్ళబొడిచి చంపే ఘటనలు. అది కాషాయరంగు బుల్డోజర్ తిరిగే ఉత్తరప్రదేశ్ కావొచ్చు, ఒక బాబ్రీ మసీదు కూల్చివేత కావొచ్చు. రేపెప్పుడైనా మతం ముదిరి, భాగ్యలక్ష్మిదేవి గుడి పేరుతో చార్మినార్ కూల్చబడునూ వచ్చు. Specificగా చార్మినార్ ఎందుకు దేశద్రోహుల జాబితాలో చేరిందో చెప్పక్కర్లేదు. దేశంలో మతం పేరుతో అధికారం చెలాయించాలని చూస్తున్న తరుణంలో మనుషులు చెదిరిపోయి మతాలు identitiesగా మార్చబడుతున్న వ్యవస్థపై వ్యంగ్యహాస్యమిది.
అన్నలపాట - ఇది జనాలు, అన్నలపై వీళ్ళకున్న విశ్వాసాన్ని ప్రేమని పాట రూపంలో, బహుశా పాటగాడే ప్రేమగా పాడేటి పాటగా తలపించింది. మొత్తంగా ఇది గూండ్ల వెంకటనారాయణ అనే వాడి రాజకీయ కవితలు. మతంనిండిన ఇప్పటి రాజ్యంపై తిరగబడేటి పాటలు. ఇవి నిరంతర ప్రవాహాలు. ప్రేమగా గుండెలనిండా పాడుకోవాల్సినవి.
***
కాపలాదారుల పాటలు
గూండ్ల వెంకటనారాయణ
వెల: ₹100/-
పేజీలు -82
Contact: 7032553063
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి