14, జులై 2021, బుధవారం

సరికొత్త ఆవు - పులి కథలు - గరిపెల్లి అశోక్

 ➤➤   నీతుల పరిమళాలను మోసుకొచ్చే
సరికొత్త ఆవు పులి కథలు 





పుస్తక సమీక్షకుడు:-  

లిఖిత్ కుమార్ గోదా.  

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్

ఫోన్:- 9640033378

••••••••••••••••••••••••••••••

తరం పిల్లలకు  కథలంటే మనం ఏం చెబుతున్నాం. హ్యారి పోటర్ కథలు, జంగిల్ బుక్ కథలు, ఆనిమేటెడ్ కథలు, కార్టూన్లు, ఫిక్షన్ కథలు చూపిస్తూ పిల్లల్ని పుస్తకాలకు దూరం చేస్తున్నాం. పిల్లలు చేతులకు పెద్దలే మొబైల్ ఫోన్లను సంకెళ్ళుగా తొడుగుతున్నారు. ఈతరం బాల్యం ఫోనులకు బానిస. ప్రస్తుతం ఉన్న తెలుగు బాలసాహిత్యంలో  రాజులు, రాజ్యాలు, దెయ్యాలు, ఊహా కథలు ఇలా ఒకే మూసలో కొంత శాతం రాయడం,రచన కొనసాగడం వలన చదివే పిల్లలకి ఎక్సైట్మెంట్ , శాటిస్ఫెక్షన్ కలగడం లేదు. ఎప్పుడూ అదే మూసలో రాయడం వలన బోర్ ఫీలింగ్ కలుగుతుంది చదివే పాఠకునికి. పిల్లలు గానీ పాఠకులు కానీ రచయితల నుంచి కొత్తదనాన్ని కోరుకుంటారు. ఎప్పటికప్పుడు సాహితీవేత్తలు కొత్త కొత్త ఆలోచనలకు, చూసిన సంఘటనలకు కొత్త తోవలో అక్షర రూపాలను ఇస్తే చదివే పాఠకుడిలో రిఫ్రెషనస్ కలుగుతుంది. మనం రాసేది పిల్లల్లోకి చేరాలంటే, పిల్లల స్థాయిలోకి దిగొచ్చి, వారి అందమైన మనస్తత్వాలు అర్థం చేసుకుని, వాటికి తగ్గట్టుగా కథలు రాయాల్సిందే.

అనుభవం ఉన్న ప్రముఖ సాహితీవేత్తల సూచనలను బట్టి చూస్తే; ఒక రచనను రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి, కొత్తదనాన్నైనా చెప్పగలగాలి, రెండు ఉన్నదానినే కొత్తగా అయిన చెప్పగలగాలి. ఈ తరహాలోంచి పుట్టుకొచ్చే కథలు నిజంగా రిఫ్రెష్మెంట్ ని కలిగిస్తాయి. రచయిత గరిపెల్లి అశోక్ ఈ తరహాలోనే నడిచారని చెప్పవచ్చు. ఏ తరానికైనా బాగా తెలిసిన అనంతామాత్యుని "భోజరాజీయం"లోని మాట తప్పని ఆవు పులి కథ(పుణ్యవతి)నే తీసుకొని విభిన్న సంఘటనలను, కొత్త కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ 12 కథలుగా అల్లారు. కథల్లో ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగకుండా, "త్యాగం కథ నుండి మమకారం కథ" దాకా ఆసాంతం చదివేలా రాశారు. ఈ పుస్తకం చేయి పట్టి, రచయిత పిల్లల్ని మొబైల్  లోకం నుండి  అడవిలోకి తీసుకెళ్లి ఒట్టి విచక్షణనే కాదు, రచయిత బాల్య దశలో ఉన్నప్పుడు అప్పటి  రైతు జీవన స్థితిగతులను కూడా కొన్ని కథలలో చూపించారు ‌. నేను గ్రహించిన దాన్నిబట్టి ఈ కథలు గొలుసుకట్టుగా రాయబడినవి. అక్కడక్కడ కొన్ని సంఘటనలు, కొన్ని కథలతో లింక్ అప్ అయి రాయబడినై.

కథా లోకానికి అడుగులేస్తే మొదటి కథ "త్యాగం"లో, తన బిడ్డకు సుద్దులు చెప్పి,  లక్ష్మీ అనే ఆవు, ఇచ్చిన మాట ప్రకారం పులి దగ్గరికి ఆహారం కావడానికి వెళితే, చెంగు చెంగున ఎగిరి కుంటూ లక్ష్మి బిడ్డైన ఆవు దూడ, పులి దగ్గరికి వచ్చి తనను తిని, తన తల్లిని వదిలేయమని మాట్లాడిన తీరు గుండెని పిండేసినంత  పని అయితది.


సహజత్వం కథలో- అడవికి మేతకు వెళ్ళిన రమ అనే ఆవు పులికి చిక్కగా, రమా తాను బాలింతనని ఎంత బ్రతిమలాడినా కనికరించకుండా పులి రమని చంపి తినడం; ఇప్పటి ప్రపంచంలోని దుర్మార్గం, దయాగుణం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో పులి పాత్ర ద్వారా ఇలా చెబుతారు రచయిత,- " ఇది సత్యహరిశ్చంద్రుని కాలం కాదు. సత్యానికి కట్టుబడి ఉన్నారా ఎవరైనా? అలాగే ఇది కలికాలం. నాటి అసత్యమాడని పులిని కాను. ముందు ఆకలి తీర్చుకుంటా. నరకంలో శిక్షలు పడితే పడని" అంటూ కళ్లకు కట్టినట్టు చూపించారు.

"ఒకరి కోసం" కథలో, తమ తల్లుల్ని కోల్పోయిన దూడలు, పులితో; భారతి అనే ఆవుకు బదులు తమని తినమని, అమ్మల ప్రేమలకు దూరమైనా ఓ పది దాకా పసి దూడలు, ఇంకో దూడకు మాతృ ప్రేమ ఉండాలనే సదుద్దేశంతో,  తమ ప్రాణాలను త్యాగం చేయడానికి, పులి దగ్గర సిద్ధపడినప్పుడు కళ్ళు దుఃఖపునదులా మారిపోతాయి.

ఆత్మార్పణ కథలో- మల్లిక చెప్పిన మాటలు విని,నలుగురికి సేవ చేయని ఈ స్వార్థజీవితం నాకెందుకు అని పులి గుహలోంచి కొండమీదకు పరిగెత్తి మరణించడం సూక్ష్మంగా ఆలోచించాల్సిన కథ. కౄరమృగమే పశ్చాత్తాపం చెందినప్పుడు,మనుషులం మనం నిజమైన మనుషులుగా బ్రతకలేమా అని ప్రశ్నలు రేకెత్తించే కథ.

ఐకమత్యం కథలో తాను పెంచుకునే కుక్కని రామయ్య పటేలు,"తమ్ముడు" అని ఆప్యాయంగా పిలవడం మనిషిలోని మంచితనాన్ని, పెంపుడు జంతువులపై ప్రేమానుబంధాలు పరిచయం చేస్తుంది. తమ్ముడు, తన ఇతర మిత్రులైన కుక్కలతో కలిసి దొంగచాటుగా కాచుకుని ఉన్న పులిని తరమడం ఐకమత్యమే మహాబలం అని అనిపించింది.


ప్రాణదానం లాంటి ఇంకొన్ని కథల్ఊ జంతువులను, మనుషులతో మాట్లాడించిన తీరు ఆవుల్లోని విచక్షణను మనసుకు వివరిస్తుంది. ఈ ప్రయోగం మంచి ప్రయత్నంగా అనిపించింది నాకు.


చివరిగా మమకారం కథ, దుబ్బాక, మల్లారెడ్డి పేటలో జరిగిన ఓ వాస్తవ సంఘటన్నే కథావస్తువుగా తీసుకుని ఉండొచ్చు. రైతు కుటుంబం, తాము పెంచుకునే పశువులతో ఎంత గొప్ప మమకారం, ఇంటరాక్షన్ ఉంటుందో చూపిస్తారు. ఈ కథ చదువుతున్నప్పుడు పాఠశాల స్థాయిలో నేను చదువుకున్న ఓసఫ్- కన్నన్ కథ మరలా యాదికొచ్చింది. అంతటి ప్రేమానురాగాలు, గుర్తింపు కనబడింది కథలో.మొత్తానికి ఇది బహు నీతుల సమ్మేళన బాల కథా సంపుటి.


ఇప్పటి తరానికి తెలియని కొన్ని రైతు జీవన పదాల్ని రచయిత పరిచయం చేశారు. ఉదాహరణకు "తెలకపిండి,పల్లిపిండి,మత్తది అన్నం,జంగిడి" ఇలాంటి పదాలు చదివినప్పుడు మన యాస లోని మాధుర్యాలు మనసులో నిండిపోయాయి. ప్రతి కథలోనూ జానపదులు వాడే సామెతలని, జాతీయాలని ఉపయోగిస్తూ కథల్ని పల్లెటూరి వాతావరణానికి దగ్గర చేశారు. మన మూలాల్ని పదిలపరిచే విధంగా కథా రచన చేయడం వల్ల రచయితను అభినందించకుండా ఉండలేం. బుక్ హైలెట్ కోసమో, రచయితను హైలెట్ చేయాలనే ఆలోచనతో అన్న మాటలు కావివి. కేవలం కథలు చదివాక కలిగిన ఒపీనియన్ అంతే.

కొత్త కొత్త అడవుల్లోకి, కొత్త కొత్త ఆవు పాత్రలతో, వాటికి పేర్లు పెట్టి కథలు, గుండె గల్ల గురిగిలో నిండిపోయేలా రాశారు.


రచయిత గరిపెల్లి అశోక్కి పిల్లల కథల్లో ఎలాంటి ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులు, కథా వస్తువులు, ఎలాంటి సంఘటనలు ఉపయోగించి పాఠకుడికి కొత్త పరిమళం కలిగేలా ఫీలింగ్ తీసుకురావచ్చో ఆ అంశాల పైన మంచి పట్టు ఉంది. కథనంతా ఎంతో రసవత్తరంగా సాగించి, మంచి టెక్నిక్ వాడుతూ, మంచి ముగింపునిచ్చే సీక్రెట్ కూడా తెలుసు. అందుకే కథల్ని ఇంత బాగా చదివేలా రాశారు. వర్ధమాన బాల సాహితీవేత్తలకు ఈ పుస్తకం బహు ఉపకరిస్తుంది. ఇలాంటి మంచి పుస్తకానికి బాలసాహిత్య లోకానికి అందించిన రచయిత అశోక్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

||14-07-2021||