13, జులై 2020, సోమవారం

పూల గోపురం - భీమవరం బడి పిల్లల కథలు

  •  వర్తమాన సమాజ దర్పణం -పూల గోపురం


                               

"త్తేజాన్ని కలిగించేది, ఉన్నత విలువలు నేర్పించేది, ఊహాశక్తికి పదును పెట్టేది ఉత్తమమైన పుస్తకం"- 

ఈ సూక్తి నూటికి నూరుపాళ్ళు ఈ "పూల గోపురం బాలల కథా సంకలనానికి" సరితూగుతుంది. బాలసాహిత్య రంగంలో పూలగోపురం ఒక మహత్తరమైన బాలల కథా కదంబం.


సాహిత్యంలో కథలు రెండు రకాలు. ఒకటి కాలక్షేపం కోసం చెప్పుకునే కథలు,రెండోది ఒక నిర్దిష్ట సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చెప్పుకునేవి లేదా రచించేవి. ఈ సంకలనం లోని కథలు సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసినవి. అంటే రెండో కోవకు చెందినవన్న మాట.

      సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, నైతిక విలువలేలక్ష్యంగా పెట్టుకొని, చిట్టి చేతులతో కలాలు పట్టుకొని వర్తమాన సమాజంలో చోటుచేసుకున్న సంఘటనలను, మనుషుల తీరును, నడవడికను, తొలి ప్రయత్నంలోనే చేయి తిరిగిన రచయితల్లా కథలు రాసి సమాజ హితానికి శ్రీకారం చుట్టారు. Vvr Zpss భీమవరం వర్ధమాన (బాల) రచయిత(త్రు)లు. 

ఈ పుస్తకం గురించి చెప్పే ముందు ఒక చిట్టి కథను చెప్పాలి.

"ఒకానొక కాలంలో "పోతగాని" అనే దివ్యమైన మహర్షికి కొంత మంది బాల శిష్యులు ఉన్నారు. శిష్యుల వయస్సు సుమారు 14 - 15 దాకా ఉంటాయి. వాళ్లు పరమానందయ్య శిష్యుల్లా కాదు, అపర మేధావులు. ఎటువంటి అంశానికైనా ఇట్టే స్పందించగలరు. చక్కని హితబోధలు, కథలు, ప్రవచనాలు, వ్యక్తిత్వ వికాసం గురించి బోధిస్తూ కలుషితం లేని ఆ విద్యార్థుల మదిలో జ్ఞాన,సంస్కార జ్యోతులను వెలిగించారు పోతగాని మహర్షి.

ఒకసారి ఈ ప్రపంచానికి ఆపద వచ్చింది. అది కేవలం మనుషుల్లో వస్తున్న మార్పుకి, సంభవిస్తున్న దురాలోచనలకి, దుర్బుద్ధికి, దురలవాట్లకు, అవి దారితీస్తున్న పరిణామాలకు ప్రపంచంలో "మంచితనం" అన్నది కనుమరుగై పోయిది. ఈ విషయం తెలుసుకున్న పోతగాని మహర్షి మనుషుల్లో మాయమవుతున్న మానవత్వానికి, వారిలో సంభవిస్తున్న దుష్టయోచనలకి ఏదైనా చక్కటి ఔషధం (మందు, విరుగుడు) తయారు చేయాలి అనుకున్నాడు. మనిషి మస్తిష్కం లో మానవత్వాన్ని మళ్ళీ చిగురింపజేయాలని అనుకున్నాడు.

అటు పిమ్మట తన శిష్యులకి ఈ ప్రళయం గురించి చెప్పి సమాజానికి ఉపయోగపడే ఔషధానికి తగిన మూలికలు వెదికి తీసుకురమ్మన్నాడు.

వెనువెంటనే శిష్యులందరూ తలొక దిక్కుకి వెళ్లి, కొన్ని రోజులు తర్వాత తిరిగి వచ్చారు. మూలికల్ని చేత పట్టుకొని. వాటిలో మేలైన మూలికలు ఏరారు పోతగాని మహర్షి. అందులో 15 మంది శిష్యులు తలా ఒక మూలికని తీసుకొస్తే, ఒక శిష్యురాలు మాత్రం రెండు సమాజహిత మూలికల్ని గురువుగారికి అందించింది.

ఇక ఆలస్యం చేయని పొతగాని మహర్షి, సంకల్ప బలం చేత తన శిష్యులు తెచ్చిన మేలైన 'సంజీవని' వంటి మూలికలతో కొంతమంది మునులు, మహర్షులుతో కలిసి ఒక యజ్ఞంలా, మనిషిలో దాగున్న కుబుద్ధుని మటుమాయం చేసి, మానవత్వాన్ని పరిమళింప చేసే "పూల గోపురం" అనే దివ్యౌషధాన్ని తయారు చేశారు.

తరువాత పూల గోపురం ఔషధాన్ని సేవించిన ప్రతి ఒక్క మనిషి, తన మస్తిష్కంలోని మలినాన్ని వదులుకొని, జ్ఞాన బోధ జరిగి, హితాన్ని తెలుసుకొని మళ్లీ మనిషిలా రూపుదిద్దుకున్నాడు.

___________

ఈ కథ నూటికి నూరు శాతం హిందీ ఉపాధ్యాయులు, పూల గోపురం బాలల కథా సంకలనం సంపాదకులు, శ్రీ పోతగాని కవి గారి కృషికి, వారికి తోడ్పడిన శిష్యులకి సరిగ్గా సరిపోలుతుంది.

సాధారణంగా పిల్లల కథల్ని పిల్లల కోసం పెద్దలు రాస్తుంటారు. కానీ ఇప్పుడు, కొన్ని దశాబ్దాల నుండి పిల్లల కోసం పిల్లలే రచనలు చేస్తూ "ఆహ్లాదకరమైన,అందమైన,కపటం లేని, కల్మషం లేని పిల్లల లోకాన్ని సృజించుకుంటున్నారు".వారికి తోడ్పాటుగా వెన్నుగా,దన్నుగా పోతగాని కవి గారి వంటి ఎందరో ఉపాధ్యాయులు సహకారంగా నిలుస్తున్నారు. వారిలోని కవిని,రచయితని వెలికి తీస్తున్నారు.

కథా రచన గురించి యువ రచయిత,కవి రాచమళ్ళ ఉపేందర్ గారు తొలిపాదులు పుస్తకంలో ముందుమాటగా ఇలా అంటారు-

"కథా రచన అనేది ఒక సృజనాత్మక కళ.కథ రక్తి కట్టాలంటే సమర్థవంతమైన ప్రతిభ,పాటువాలే కాదు నిరంతరం కృషి ఓపిక ఎంతో అవసరం.

కదిలే కాళ్లను,అల్లరి చేసి పిల్లలను కట్టిపడేస్తుంది మంచి కథ అంటారు.

మరి పిల్లల కథలు రాస్తే. చేయి తిరిగిన రచయితల్లా కథలు అల్లితే. అలా అల్లిన కథలకు పాఠకులకు కళ్ళు చెమ్మగిల్లితే, హృదయాలని పిండేస్తే.. దానికి మించిన సామాజిక ప్రయోజనం ఏముంటుంది? పిల్లల కృషికి అంతకు మించిన బహుమతి ఇంకేముంటుంది?" అంటారు.

పై మాటలు అన్నీ పూల గోపురంలో కథలు రాసిన తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు ఎటువంటి సందేహం లేకుండా చెల్లుబాటు అవుతాయి.

ఇప్పుడు వస్తున్న కథల పుస్తకాలలో కల్పితాలకు చోటు ఎక్కువ. మానవతా విలువలు, సమాజ పోకడ కలిగిన బాలల కథలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గ్రహించిన పోతగాని కవిగారు వర్తమాన సమాజాన్నే కథలుగా మలిచేలా విద్యార్థుల చేత ఈ కథల సంకలనాన్ని రాయించారని భావించవచ్చు.

ఈ కథల పుస్తకంలోని కథలన్నీ విశిష్టమైనవి, విలువైనవి.

ముందుగా కథల సంకలనం ముఖచిత్రం మనల్ని ఆకట్టుకుంటుంది. పేరు కూడా సరికొత్తగా ఉంది "పూల గోపురం" అని.

కథలకు తగిన రీతిలో ఈ పిల్లలు రాసిన కధల శీర్షికలు ప్రతి పాఠకున్ని ఆకట్టుకుని, వేటికవే పోటీ పడుతుంటాయి.

పిల్లలందరూ గ్రామీణ జీవనం నుండి వచ్చారు కాబట్టి కథలన్నీ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి అద్దం పడుతూ ఎక్కడా విసుగును కలిగించకుండా హాయిగా సాగుతుంటాయి.

మొదటి కథ "భయం కాటు" ఎస్.నిహారిక రాసిన

కథ ఎదుటివారి సొత్తును దొంగతనం చేస్తే మనకు తెలియకుండా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా వెల్లడించింది.

"చదువు విలువ"కథలో సాయి రాం ఎంతో పరిణితితో ప్రస్తుతం చాలామంది జీవితాల్లో జరిగే సంఘటనలే ఉదాహరణగా తీసుకొని చక్కని కథని అల్లాడు. కార్తీక్ చదువుకోకుండా బలాదూర్ తిరుగుతూ తల్లిదండ్రుల కష్టం తెలియకుండా ఉండడం, ఒకసారి తల్లిదండ్రులు ఎలా పని చేస్తున్నారోనని తెలుసుకోవడానికి పొలానికి వెళ్లి వాళ్ళు ఎండలో కష్టపడి పని చేయడాన్ని చూసి పశ్చాత్తాప్పడి చదువుపై శ్రద్ధ చూపడం ప్రతి పాఠకున్ని ఆకట్టుకుంటుంది.




కె. పావని రాసిన"చెలిమి చెరిచిన చరవాణి"కథలో వర్తమాన సమాజంపై సెల్ ఫోన్ పిచ్చి పిల్లల్లో ప్రేమానురాగాలను ఎలా దూరం చేస్తుందో తెలియపరచింది.తరువాత నాయనమ్మ యుక్తితో చేసిన పని వల్ల సెల్ ఫోన్ భూతం వీడి మళ్ళీ మిత్రుడు తో స్నేహం చేయడం తో మంచి ముగింపు నిచ్చింది.


ఎస్. అఖిల్ కుమార్ రెడ్డి రాసిన"పిల్లి సాక్ష్యం"కథ చదువుతూ ఉంటే అచ్చంగా చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో కథలు చదివినంత ఆనందం కలిగింది.

ఎంతో తెలివితో, సమయస్ఫూర్తితో రాసిన కథ ఇది.

జి. అఖిల తన"వలపోత"కథలో పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కన్నులు చెమ్మగిల్లేలా రాసింది. కథా ఇతివృత్తం నవ సమాజానికి అద్దం పట్టింది.


బి.నితిన్ "పిట్టల శాపం"కథలో చెట్లను నరికి పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాకుండా, పక్షులు, జంతువులు నివాసాలు కోల్పోవడం వల్ల పిట్టలు మనుషులపై ఆగ్రహించి శపించడం అనేది ఆలోచించాల్సిన అంశం. నీటి ప్రాముఖ్యతను తెలియపరిచిన కథ ఇది.


"ముగ్గురు మిత్రులు" కథలో కె.ఉమ

     "మంచి హృదయం ఉన్న వాళ్ళు ఎంతమంది కైనా స్నేహాన్ని పంచగలరు" అనే ఒక్క మాటను ఆధారం చేసుకొని కథను నడిపించింది.

మనుషుల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని, నిజమైన నిస్వార్ధమైన మిత్రులు చెప్పుడు మాటలకు తొందర పడరని మృదువుగా చెప్పి కథని ముగించింది.


"పాల పంచాయతీ" కథలో ఎన్. రక్షణ-

"కన్న తల్లి కి ఎంతమంది బిడ్డలు ఉన్నా అందరికీ సమానంగానే ప్రేమను పంచుతుంది"అనే సూక్తిని తీసుకొని యుక్తితో మన ఇంట్లో నిత్యం జరిగే అక్కాచెల్లెళ్ళు,అన్నాతమ్ముళ్లు,తోబుట్టువుల గొడవల్ని కథలా మలిచింది.

"కనులు చూసిన వెంటనే, బుద్ధికి పని చెప్పకుండా అనుమానాన్ని,తీర్చుకోకుండా అసూయతో రగిలి పోకూడదు" అంటూ 'అనుమానం పెను భూతం' అని చక్కని హితబోధ చేసింది.


కథా శీర్షికలోనే "తాగుడు వ్యసనం"అంటూ హెచ్చరిస్తున్న నఫ్రీన్ సమాజంలో నిత్యం జరిగే సంఘటననే కథావస్తువుగా తీసుకుని ఇంటి పెద్ద తాగడానికి అలవాటుపడి కుటుంబాన్ని ఒంటరిగా ఎలా రోడ్డుమీద వదిలేస్తుంటాడో దృశ్యమానం చేసింది.

"సంకల్పబలం"కథలో నందిని-

నేటి సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే ఆడపిల్ల పడే అవస్థని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఇది వర్తమాన అంశం. సంఘంలో అనుదినం చోటుచేసుకునేది.

ఈ కథలో శ్రావణి లాగే తల్లిదండ్రుల్ని కోల్పోయి సంకల్ప బలం చేత చక్కగా చదువుకొని విజ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఆడపిల్లలు కోకొల్లలు. 

తల్లి తండ్రులు చనిపోతే ఆడపిల్ల నిస్సహాయంగా ఉంటుందని, చుట్టాలు ఎవరూ పట్టించుకోరని,అదే మగవాడైతే ఎవరైనా ముందుకు వచ్చి పెంచుకుంటారని నేటికీ కొనసాగుతున్న ఆడ మగ వివక్షని కళ్ళు చెమ్మగిల్లేలా కథలో చొప్పించింది.


        "ఆస్తులు-ఆత్మీయతలు"కథను రాసిన ఎం. సరస్వతిని అభినందించకుండా ఉండలేం.

ఈ కథను చదువుతున్నంతసేపు మనసుకు ఉల్లాసంగా,ఆలోచించే విధంగా ఉంటుంది.ఈ కథ చదువుతుంటే వారికి ఈ సమాజం పైన ఆత్మీయతలకు, డబ్బుకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతగా అవగాహన ఉన్నదో అర్థం అవుతుంది.ఈ కథను చదువుతూంటే ఒకప్పటి పాత సినిమాల్లోకి వెళ్ళిపోతాం. మానవ జీవితంలో ఆస్తులకు విలువ ఇస్తే ఎలా ఉంటామో, ఆత్మీయులకు విలువ ఇస్తే ఎలా బ్రతుకుతామో ప్రత్యక్షంగా చూపించే కథ.


         తొమ్మిదవ తరగతి చదివే బాలస్వామి "చదివే హక్కు" అంటూ ఒక నినాదాన్ని పలికినట్లు కథను రాశాడు.

ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తూ,ప్రస్తుతం సంఘాల్లో పేదల పిల్లలు చదువుకోకుండా పనులు చేస్తూ ఉండడాన్ని చూపించాడు సూక్ష్మంగా.

కథలు రాయడం అంటే కేవలం కథ చెప్పడం కాదని, కథా రచయిత కథలోని పాత్రలతో మాట్లాడించాలని తన పదునైన పద, భావజాలంతో వ్యక్తపరిచాడు.

చివరిగా "దాన ఫలం" కథలో నాజియా బేగం "ఎదుటి వారి కష్టాలను ఎరిగి సాయపడితే మనం సాయం పొందుతామని" హితవు పలికింది.

పాఠశాలలో చదువుకునే దశలోనే ఇంతటి సమాజ అవగాహన, ప్రేమానురాగాలు, పదునైన భావజాలం కలిగిన (కలగలిసిన) ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు భవిష్యత్తులో గొప్ప మానవతా విలువలు తెలిసిన రచయిత(త్రు)లు కాగలరని ఆశిస్తున్నాను.

పిల్లలకి ఇంతటి మహత్తరమైన జ్ఞానం, ప్రేమ, సద్గుణాలను తెలియపరిచి సమాజానికి "నైతిక విలువల టానిక్"ని అందించిన శ్రీ పోతగాని కవి గారిని అభినందించకుండా ఉండలేం.

ఇలాగే ప్రతి ఒక్క పాఠశాలలో పిల్లలు ,ఉపాధ్యాయులు నవ సమాజం కోసం పూలగోపురంతో ముందడుగు వేసిన భీమవరం పిల్లల్లా కృషి చేసి ఈ సమాజానికి మహోన్నత రచనలు అందిస్తే రేపు ఈ సమాజంలో మన చూపులు చాలా శుభ్రంగా ఉంటాయి.

ఇది కేవలం బాలసాహిత్యాన్ని, తెలుగు భాషని కాపాడుకుంటే జరిగే మార్పు.అందుకే తెలుగు భాషని, బాలసాహిత్యాన్ని కాపాడుకుందాం పరిశుభ్రమైన నవ సమాజాన్ని తరిద్దాం, సృష్టిద్దాం.


||జై బాలసాహిత్యం|| ||జై జై వర్ధమాన(బాల) సాహిత్యకారులు||