12, డిసెంబర్ 2023, మంగళవారం

జీరో నెంబర్- 1 : మొహమ్మద్ గౌస్

 ఫిక్షన్ టెక్నిక్ తెలిసిన నవల “జీరో నెంబర్ - 1”

లిఖిత్ కుమార్ గోదా. 

•••



“I just knew there were stories that I wanted to tell” - Octavia E. Butler

జీరో నెంబర్ 1 - నవలా రచయితగా మొహమ్మద్ గౌస్ రాసిన మొట్టమొదటి నవల ఇది. చికెన్ షాపు నడుపుకుని బతికే సూరిగాడి కథ. అతని కథలో కులాన్ని తొడుక్కుని గుండాగిరి చేస్తూ పైకి అందరిలో భయం వల్ల మర్యాదింపబడే బాబు, అతడి గూండాలు, అతడి సహచరుడు జయరాం, బాబు చేసే అన్యాయాలలో పరజనులతోపాటు సొంతింట్లో చావుబతుకుల మధ్య నలిగి చివరికి సూరిగాడి చికెన్ షాపులోని సీక్రెట్ రూంలో(అది బ్రిటిష్ ప్రభుత్వం కాలంనాటి దాని రచయిత అంటాడు) మూడు వారాలు తలదాచుకున్న శశికళ, ‘మట్టసంగా’ కథ సుఖాంతానికి తోడ్పడే ముసిలాయప్ప అలియాస్ పెదయ్య(కేశవరెడ్డి నవలల్లో మధ్యలో ప్రవేశపెట్టబడే Story changing characters - చివరి గుడిసె నవలికలో “బైరాగి”, స్మశానం దున్నేరులో వ్యాసదేవలాగా) . మొత్తానికి తనకు చెప్పాలున్న కథనే వైవిధ్యమైన రీతిలో రాశాడు. మన కళ్ళముందే సాధారణంగా నడిచే సూరిగాడు లాంటి చికెన్ షాపు వ్యక్తి కథను ఫిక్షన్లోకి తేవడం బావుంది.


Novel పఠన ప్రారంభం నుండి ఆఖరి వరకు సులువైన readability ని కలిగించింది. నవలలో కావాల్సిన Story telling, Twist set-up, Narration link-up, Utilizing the fictional elements (తను క్రియేట్ చేసిన సీక్రెట్ రూంలో తన శత్రువవుల కథను ముగించడం), Clarification చాలా స్పష్టంగా ఉండి, మెళుకువలు ఎక్కడెక్కడ technical గా వాడాలో అలా వాడినందుకేమో చక్కగా కాలక్షేపం అయ్యింది. 


సెకండ్ చాప్టర్ ప్రారంభంలో నేతపని గురించి ప్రస్తావించినప్పుడు - తన “గాజులసంచి”లోని కథ “మా అన్నకి మగ్గానికి పడల్యా” గుర్తుకొచ్చింది. తనకున్న, కావాల్సిన సోర్సలని వాడడం, ముఖ్యంగా తన ప్రాంతపు మాండలికం నవల నచ్చేలా చేసింది. నిజానికి ఇదొక మంచి ఆరంభమని చెప్పొచ్చు ఈ నవలాకారుడి నుంచి.


నవల ఎందుకు రాయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు జవాబు బ్యాక్ కవర్ పేజీపై ఇలా రాసుకున్నాడు:

“… కొన్ని కట్టడాలను, ఊర్లను చూసి వాటి విశేషాలను గమనించినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన కథ జరిగి ఉండే అవకాశం ఉంది కదా అనిపించడం మొదలైంది. అలా నేను చూసిన ఒక ప్రదేశం నాకు ఇలాంటి ఆలోచనే కలిగేలా చేసింది. అయితే అలాంటి కథలేవీ అక్కడ జరగలేదని తెలిసాక నేనే నాకు నచ్చినట్టు ఒక కథ రాసాను. ఇప్పుడా ప్రదేశంతో పాటు నాకు ఈ కథ కూడా గుర్తుంటుంది.”

- మొహమ్మద్ గౌస్


“If you don't see the book you want on the shelf, write it.”

-Beverly Cleary


“If there's a book that you want to read

But it hasn't been written yet

you must be the one to write it”

Toni Morrison, American English Novelist

 ఈ రెండు కొటేషన్స్ రచయిత రచనలపై తన ఇష్టాన్ని, రాయడానికి గల కారణాలను బలపరుస్తాయి. ఇంకా ముందుముందు Mohammad Gouse మెరుగైన రచనలు రాస్తాడని ఆశిస్తున్నాను.


Contact: Chaaya Mohan Babu +91 98480 23384

20, అక్టోబర్ 2023, శుక్రవారం

నల్ల పిల్లనగ్రోవి - గూండ్ల వెంకటనారాయణ

Some of the surprising stories hidden behind the hands - నల్ల పిల్లనగ్రోవి

                                        •••


"You never really understand a person until you consider things from his point of view... Until you climb inside of his skin and walk around in it."

~ Harper Lee, To Kill a Mockingbird



       ఇవి “పైకి” చాలా సరళంగా, ప్రాధమిక దశలో ప్రాధమిక భాషలో గ్రామీణజీవులకు అర్థమయ్యే విధంగా, ఎలాంటి దృష్టికోణమూ లేకుండా ఒక కుర్రవాడు తనకు తెలిసిన నాలుగు పిచ్చిపాటీ విషయాలను కథలుగా వ్రాసాడనే తలంపు కలుగుతుండవచ్చు. నేరేటర్ ని చూస్తే అతనిలో ఇంకా పసితనం, అమాయకపు ఛాయలు మిగిలే ఉన్నాయని అనిపిస్తుంది. బహుశా అతని రాతలకి ఇవే బలమని కూడా నేను నమ్ముతున్నాను. పైన నేను చెప్పినట్లు ఇవి పిచ్చిపాటిగా రాసినవి కావు. ఇవి beyond ఆలోచించాల్సినవి. కేవలం ఆలోచించడం మాత్రమే కాకుండా రచయిత చెప్పినవాటికి వర్తమానధోరణికి మధ్య పొంతన సవివరంగా ఉందని పరిశీలించాల్సినవి. ఎనిమిదే కథలు కానీ ఏవాటికావాటికి వాటిదైన గురి వుంది. నిగూఢత ఉంది. ఈ కథలు చదవడం మాంచి ఆటవిడుపు. ఎనిమిది కథలని నేనెలా నిర్ధారించుకున్నానో ఆ విషయాలని ఇక్కడ పరుస్తున్నాను. కొన్ని కథలను దాదాపు బట్టబయలు చేసినా, కొన్నింటిని కావాలనే పైపైకి చెప్పాను. కొన్ని పాఠకుడికి వదిలేయడం మంచిదని.


కుందేలు బొమ్మ 

         ఈ కథ చదవడం పూర్తి చేసి కొన్ని క్షణాల పాటు ఆలోచనల్లోకి వెళ్ళినప్పుడు - మొదట ఇందులో ఏముందని కథ అంటున్నాడనే సంశయం కలుగుతుంది. స్థూలంగా పరిశీలించిన తర్వాత నాకు అందులో మూడు అంశాలు కనబడ్డాయి. ఒకటి పాప - అమ్మ ఎంత వారించినా వినకుండా తిరునాళ్ళలో పాతబడిపోయిన కుందేలు బొమ్మ కొనిపెట్టించుకున్న పాపకి పాత వస్తువులను కొంటే అరిష్టం అన్న వాళ్ళమ్మ నమ్మకంలాగా తనకలాంటి ఆలోచన లేదు, తెలియకపోవచ్చు. పాప లోకమంతా ఆ కుందేలుతోనే. పాప మనస్థత్వాన్ని అద్దంపట్టే సన్నివేశాలు చిత్రించాడు. అయితే చీకిపోయి చిరిగిపోయిన కుందేలు బొమ్మ- చచ్చిపోయిందన్న తలంపే పాప మనసులో పాతుకుపోయింది. అయితే ఒక దగ్గర వాళ్ళమ్మ “కుందేలు బొమ్మ కదా.. కోసుకుని తినుంటారు” అని అంటుంది. పాప కుందేలు బొమ్మని జీవం ఉన్నదానిలా చూసుకుంది కాబట్టి మరణానికి గురికాబడ్డ కుందేలు బొమ్మ ఇంకెప్పటికీ తన వద్దకు తిరిగిరాదనే బెంగలోకి వెళ్ళిపోయుండొచ్చు. అందుకే ఎప్పుడూ “బుజ్జి కుంతేలు… బుజ్జి కుంతేలు” అని తలుచుకుంటూ ఉండవచ్చు. రెండోది అమ్మ పాత్ర - కథాంతంలో “పాతబొమ్మని కొనుక్కోబట్టే అరిష్టం చుట్టుకొని పాప లేకుండా పోయిందని పాత వస్తువుల మీద అమ్మ ద్వేషం పెంచుకుంది” అని చెప్తాడు. నమ్మిన విషయాన్ని జరిగిన సంఘటనకు ఆపాదించుకుని ఉండటంవల్ల అమ్మకి ఇంకాస్త దిగమింగుకోలేని కోపం ద్వేషం. ఇది తన అనుభవాలచిట్టాలో చేరిన ఒక విషయం. పెద్దవాళ్ళ దగ్గర నుండి వస్తున్న ఆచరణార్థం తనింకా Inferior complexityలోనే తనమునకలైపోయింది. మూడోది - “పాత కుందేలుతో ఆడుకుంటున్న పాప ఫోటో మాత్రం పటం కట్టించి దాన్నే చూస్తూ ఉండేది అమ్మ”. పాప మరణానికి కారణం ఏదనది అమ్మ పాత్రకి స్పష్టత ఉండి ఉండవచ్చు. బహుశా పాప చినిగిపోయిన కుందేలు బొమ్మ వల్లే చనిపోయిన, పటంలోని పాప, కుందేలు బొమ్మ తనకి మిగిలిపోయిన జ్ఞాపకాలుగా చెప్పుకోవచ్చు. ఇది రచయిత కోణంలో ఏమై ఉండొచ్చో నాకు తెలియదు కానీ, నేను కథననుసరించినంతవరకు ఇవే నా మతికి తట్టింది.


తండా వాళ్ళ అమ్మాయి

          ఈ కథ చదువుతూ ఉన్నంతసేపు ఇది ఇచ్చిన Involvement and flavour of the story ని అనుభూతి చెందుతూ ఉన్నాను. బంజారేతరుడు రాసిన అత్యంత శక్తివంతమైన పల్లెటూరి మనస్థత్వాలని నిండారా మూడు పాత్రల్లో చూపించడానికి ప్రయత్నించిన కథ అని నాకనిపిస్తుంది. ఇందులో కథను చెప్పే నేరేటర్ విపరీత భయస్తుడు‌. తన అన్నకి ఆడవాళ్ళతో తిరగాలనే వ్యామోహం మిక్కిలిగా ఉంటుంది. నమ్మిన వ్యక్తిని ప్రేమికుడిగా భావించి చివరికి మోసపోయి ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియని అమాయక “తండా వాళ్ళ అమ్మాయి” తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ గుర్తించుకోదగ్గ కథ. Narrator చుట్టూ ఉన్న జీవనగతులు - తన సావాసగాళ్ళకి లంబాడీ ఆడవాళ్ళంటే ఎంత మక్కువో, ఆడదాన్ని తప్పుగా చూస్తే ఏమౌతుందోనని దిగ్భ్రాంతి అనేకమార్లు చూస్తాం. అలాగే లంబాడీ మహిళలపై బయటి జనాలకి ఎలాంటి అభిప్రాయాలుంటాయో కూడా మాట్లాడుతాడు. రచనంతా ఎత్తుపల్లాలు లేకుండా సాఫీగా కదులుతూ ముగింపు తీసుకొచ్చిన సహజమైన అవరోధం పాఠకుడికి సుపరిచితం అవుతున్నట్టే అవగతం అవుతుంది కానీ తండా వాళ్ళ అమ్మాయి దయనీయమైన స్థితిని పాఠకుడు తట్టుకోలేని విధంగా మలుస్తుంది. తండా వాళ్ళ అమ్మాయి పాత్ర నాకు Cormac McCarthy - All the pretty horses నవల ముగింపులో John Grady Cole ని గుర్తుచేసింది. గుర్రాలతో ప్రపంచాన్ని నిర్మించుకున్న కోల్, ప్రేయసినుండి దూరంగా వచ్చేసి, Blevins అనే పదమూడు - పద్నాలుగేళ్ళ మిత్రుడి మరణాన్ని, Rawlins పై జరిగే కత్తిపోటు దృశ్యాన్ని కళ్ళెదుటే చూసి, ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కున్న పదహారేళ్ళ కోల్ ( ఈ కథలో తండా వాళ్ళ అమ్మాయి వయసు కూడా అంతే) ఎక్కడనుండి వచ్చాడో తిరిగి అక్కడికే కదిలిపోయిన సంగతి గుర్తుకొచ్చింది. కోల్ కి కారణాలు అనేకం కావొచ్చు కానీ అందులో ప్రేమ కూడా ఒకటి ఇక్కడ ప్రధాన పాత్రకు మల్లే. విషాదగీతికలుగా మారిన సంఘటనలు.


ఊళ్ళోకి నాయకుడు వచ్చాడు 

       

           కథకి అద్భుతమైన నడకతీరు ఉన్నప్పుడు, అది సరళంగా సూటిగా Running commentaryలాగ, సినిమాలాగా కళ్ళముందు దృశ్యాలు వెంటవెంటనే మారుతూ కథనంతా దృశ్యమానం చేస్తునప్పుడు పాఠకుడికి విసుగన్న తలంపే రాదు. ఈ కథలో నేను పైన ప్రస్తావించిన తీరుతెన్నులన్ని ఉన్నాయి. ఊళ్ళోకి నాయకుడు వస్తున్న సందర్భంగా ఆ ఊరి స్థితిగతులు, వొంకరచూపులు, ఏర్పాట్లు, అరుపులు, ఏమీ తెలియని వెర్రి చూపులు, వివాదాలు, తగాదాలు, రాజకీయ మురికి, పాయింట్ లేని స్పీచ్లు, ఒకటేమిటి ఇందులో ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తికరంగా, పొల్లుపోకుండా రాశాడు. ఐదువందల రూపాయలకి ఆ నాయకుడి సమావేశంలో ఉత్సాహభరితంగా నాట్యం చేయడానికి వచ్చిన లంబాడీ మహిళల్లో ముప్పై - ముప్పై ఐదేళ్ళ లోపున్న మహిళపై జరిగిన లైంగిక దాడి ఒక్కటే కాదు దీని ముగింపు అలాగే కథ. ఇది అన్ని వనరులు, వర్ణనలు, రాజకీయ వేషాలపై నచ్చని దృష్టితో వ్యంగ్య ధోరణిలో మాట్లాడే గొంతు అన్నీ సవివరంగా ఉన్న బలమైన బహుకథల సమాహారం. 


నల్ల పిల్లనగ్రోవి

        Mythologyలోని కథని తీసుకుని సరికొత్త కథలుగా తీర్చిదిద్దిన దాఖలాలున్నాయి చాలా చోట్ల. గ్రీకు పురాణాల్లోంచి కొన్ని ఘటనలను, పాత్రలని ఆధారంగా చేసుకుని ఆధునిక సాహిత్యంలో కథలు నవలలు రాసినవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు జేమ్స్ జాయిస్ “యులిసిస్”లో కొన్ని చోట్ల, అలీ స్మిత్, పాట్ బార్కర్ తమ నవలల్లో ఇలాంటి ప్రయోగాలు చేసారు. కృష్ణుడు రాధ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లనగ్రోవితో. రాధ ఇంకా రాదు. తర్వాత కృష్ణుడు అసలు వేణుగానం ఎలా నేర్చుకున్నాడనే కథను తనదైన ఫిక్షన్ తో చెప్పి , ఇంకో దగ్గర రాధ తక్కువ కులపు అమ్మాయి కాబట్టి యశోద ఆమెని కృష్ణుడితో తిరగొద్దని వారించిందని చెప్పడం, రాధాకృష్ణుల ప్రేమ కథ, ఇద్దరు ఎలా విడిపోయుంటారనే దాన్ని ఆసక్తికరంగా వ్రాసాడు. 


ఒక కాలు ఒక చేయి మనిషి


చాలావరకు కథల్లో ఒకళ్ళ కోణం నుండే కథ నడుస్తూ ఆ ప్రధాన పాత్ర చుట్టూ ఉన్న మనస్థత్వాలను ఆ పాత్రే classify and define చేసుకుంటుంది. కానీ కథ మాత్రం ఏకధాటిగా చెప్పుకుంటూ పోయిన కథ. ముగ్గురు మనుషుల గుణగణాల గురించి చెప్పడమే కాక ముగ్గురి కోణాల్లోంచి ఎవరెవరి మానసిక స్థితి ఎలా వుంది అనే విషయాన్ని చెప్తూనే చర్చకు తీసుకొస్తాడు. అవిటివాడైన తిరుమలకి తన వదిన చెంచమ్మకి మధ్య సాగే జీవనగీతం ఎలాంటిది అన్నది మాత్రం పాఠకుడి నిర్ధారణకు వదిలేసాడని అనిపించింది.


గోయి

    

       ఒక మనిషి గురించి, ఆ మనిషి జీవితం గురించి పల్లియులు చెప్పుకునే కథారీతే వేరు. ఈ కథని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ కథ ఒక రచయిత చెప్తున్నట్లే అనిపించదు. ఏ చెట్టు కిందో ఎన్నటికీ ఒడవని ముచ్చటగా మిగిలిన కొందరి కథలని ఊర్లు ఎలా మర్చిపోకుండా చెప్పుకుంటాయో గోయి కథని చదివితే తెలుస్తుంది. 


కోరిక జబ్బు

   

      ఇలాంటొక monologue ని వింటూ ఇంత సహజాతిసహజంగా కథ వ్రాయడం చూసినప్పుడు కాస్త ఉత్సుకత, ఉత్కంఠ కలిగాయి. మామూలుగా చిన్నప్పటి నుండి ఆడవాళ్ళతో కలిస్తే కలిగే సుఖం ఎలాగ ఉంటుందో తెలుసుకోవాలనే ఊబులాట వయసుకొచ్చిన చాలామంది మగ(పిల్లలు)వాళ్ళకు కలుగుతుంది. ఈ అంశాన్ని తీసుకుని ప్రళయభీకరంగా కూడా వ్రాయవచ్చు. కానీ చాలా polished గా నెరేషన్ సాగింది. 


కవి గూండా సామ్రాట్

      చాలా satirical గా, బయటికి కనబడకుండా జరిగే సాహిత్య విషయాలు వ్రాసినట్లు అనిపించింది. 


ఇతని దాదాపు కథల్లో మనం పాత్రల perspectivesని వాటి point of viewలోంచే ఆలోచించినప్పుడే అతిసాధారణంగా, సరళాతిసరళంగా వ్రాయబడిన ఈ కథలు వొట్టి అర్థంకావడమే కాక మనం ఇంతవరకూ చూడకుండా, చాలా దగ్గరగా తెలిసి కూడా అక్షరరూపం దాల్చని విషయాలని, sensitive content , వేదనా పూరితమైన మనస్థత్వం మతికి తెలిసొస్తుంది. ఇవి అతని పూర్వ స్మృతులు కావు. కానీ తన అనుభవాన్ని, తను ఉన్న society ని అక్షరం వల దాటిపోకుండా అదిమిపట్టి వ్రాసుకున్నవి. ఎందుకో కొన్నిసార్లు రష్యన్ సాహిత్యాన్ని తెలుగులో చదివితే ఎలాంటి తన్మయానుభూతి పరిఢవిల్లుతోందో అలాంటి అనుభూతి చేతచిక్కింది. ఇతని కథలు ఊటతో మొదలై నదిలా మారి సుదూర ప్రయాణం చేసి చివరికి సముద్రంలో కలవడంతో ముగుస్తాయి దాని సాంద్రత సారాంశం ఎంత విశాలమైందో తెలుసుకోమన్నట్టు. Opening lineలు కథాంత వాక్యాలు ఈ కథకుడిలో ఉన్న బలం. Prose వైవిధ్యమైన శైలి, శిల్పం పరంగా అతికించినట్టు కాకుండా సామాన్యంగా చూసినదాన్నే బాగా గరుకురాయిపైన నూరి నూరి పదును చేసిన మెరిసేటి కొడవల్లిక్కిలానే తోచాయి. ఈ కథల్లో తుప్పుతుగారం లేదనేది నా అభిప్రాయం.


చాలా చోట్ల పెరుమాళ్ మురుగన్ “Poonachi, Trial by Silence” నవలలో కథ చెప్పే నేరేటర్ గొంతు ఎలా ప్రతిధ్వనిస్తుందో ఇతని కథలు కూడా ఇతని ప్రత్యేకమైన toneని వినిపిస్తూ landmark ఉండిపోయేట్టు చేశాయి నా వరకు. శృంగారోదృత దృశ్యాలను పద్ధతిగా పాఠకుడు పరవశపోయేలా రాయడం మురుగన్ speciality. ఈ quality నాకు రచయితలో కూడా తలపించేలా చేశాయి. Story construction గురించి ఇతనిదైన చూపు నాకు కనిపిస్తుంది. వైవిధ్యమైన ధోరణిలో బాగా పరిచయంకాని కథలను, కథని చెప్పే నాడీని పట్టుకున్నందుకు రచయిత గూండ్ల వెంకట నారాయణ కు అభినందనలు. పుస్తకాన్ని ప్రచురించిన Chaaya resources centre సంపాదకులు Mohan Babu కి, అరుణాంక్ లతకి కూడా.


ప్రతులకు:

నల్ల పిల్లనగ్రోవి : గూండ్ల వెంకటనారాయణ

ఛాయా ప్రచురణ

వెల్: 120

Contact: +91 98480 23384


Thank you one and all for reading this post 😄


- లిఖిత్ కుమార్ గోదా

20.10.2023

Pustakam.net (23 Oct 2023)

9, జూన్ 2023, శుక్రవారం

గరికపాటోడి కతలు - గూండ్ల వెంకటనారాయణ

➦The Stories of Ethos Pathos and Logos - Garikapatodi Kathalu

                             

Perhaps they were right put love into books. Perhaps it could not leave anywhere else.
-William Faulkner

ప్రేమలు- తెలిసిన వ్యక్తులపై అనేక రకాలుగా, అనేక విధాలుగా ఉండొచ్చు. మనకి తెలిసినంతవరకు యువతి యువకులకు మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, స్నేహితునికి తన ప్రియమిత్రుడుకి మధ్య, పెంచుకునే జంతువుల మధ్య అలివిగాని ప్రేమ ఉంటుంది. అవన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం. ఆ అనుబంధాల మీద వెలువడిన కతలెన్నింటినో చదివి పరవశించిపోతున్నాం. అలాగే “గరికపాటోడి కతలు” రాసిన గూండ్ల వెంకట నారాయణకి తను పుట్టి పెరిగిన గరికపాడు పల్లె మీద, ఆ పల్లెలో బతికీడుస్తూ; బతుకీడ్చి జ్ఞాపకాలుగా మిగిలిపోయిన తన మనుషుల మీద అలివిగాని ప్రేమ ఉంది. అందుకనే వాళ్లందర్నీ జ్ఞాపకం తెచ్చుకొని కన్నీళ్లు కారుస్తూ రాసుకున్న రాతలివి. వాళ్ల మీద దాచుకున్న ప్రేమ ఒక్క పుస్తకంలోనే బతికుండగలదని నమ్మి నిక్షిప్తపరిచిన కతలు.

ఇవి ఎలాంటి కతలు అని మీరు అడిగితే:
కారు చీకట్లో కురిసిన కుండపోత వాన చినుకులు టపటపమని తాటాకుల గుడిసె పైన పడి తాటాకుల మీదగా టపటపమని నేలకు తగిలి చప్పుడు చేస్తున్నప్పుడు ఒక్కో చుక్కా మనసుని నిద్ర లేపి చెప్పిన కతలివి. జ్ఞాపకాల దొంతర్లు.

మనకి బాగా తెలిసినంతవరకు పల్లెటూరి కతలంటే అగ్ర-దిగువర్గాల దైనందిన జీవితాల గురించి, దిగువ వర్గం పైన అగ్రకులాల దోపిడీ గురించి చదివి ఉంటాం. కులాలు మతాలు కేంద్రంగా రాయబడ్డ కతల్ని చదివే ఉంటాం. కానీ వాటన్నింటికీ భిన్నంగా ఇవి ఒక పల్లీయుడు అందులోనూ పాతికేళ్ళు కూడా నిండని యువకుడు ఆ ఊరికి దూరంగా జరిగాక, కోల్పోయిన మనుషుల్ని, తను మళ్లీ చూడలేని చెమట దేహాలని, వాళ్ల బ్రహ్మాండమైన జీవనతీరును తలుచుకుని లోకానికి చాటింపు వేసి చెప్పాలనుకుని రాసుకున్న కతలు. ఈ వరకాడదాకో పొలం దున్ని వచ్చి గట్టుమీద అన్నం ముద్దలు తింటున్నప్పుడు పొలమారి, నేలలో కలిసిపోయి తనని తలచుకున్న మనుషులు ఎవరైవుంటారోనని పొగిలిపొగిలి ఏడుస్తూ రాసుకున్న కతలు. మట్టి ముద్రలతో గరికిపాటోడు గరికపాడు పల్లె గురించి లోకానికి చెప్తున్న శాత్రాలు.

ఇందులో మొత్తం 16 బతుకులు. రకరకాలుగా Ethos Pathos and Logos దాగి ఉన్న బతుకులు. క్షుణ్ణంగా చదివి క్లుప్తంగా అర్థం చేసుకోవాల్సిన బతుకులు. పరిస్థితులు బతుకులు రూపాంతరం చెందిన విషయాల్ని అవగాహన చేసుకోవాల్సిన బతుకులు. ఆ పల్లీయుల పోలేరు జాతరుంది, పిచ్చమ్మ అవ్వ చెప్పే శాత్రాల తాలూకా జ్ఞాపకముంది, నిండుగా ఆమెతో రాతగాడికి గోరుముద్దుల తీపిరుచిలాంటి స్మృతులున్నాయి, అత్తని సరిగ్గా చూసుకోలేని కోడలుంది, ఆగం బట్టిపొయ్యిన పెదగోపాల్ ఉన్నాడు, కన్నీళ్ళ పర్యంతం చేయగల పసిదూడ… ఇలా మట్టి బతుకులను మన అరచేతుల్లోకి కుప్పగా పోసున్నాయి.

•••

“Telling stories is a way of surviving and continuing to live”
Orhan Pamuk, Turkish Novelist

ఈ రాత గాడు మంచి Raconteur. అంటే మంచి Storyteller అని. కతను ఎక్కడ లేవనెత్తి, ఎక్కడ ముగించాలో ఏ మాటలతో ముగించి పాఠకుడిని కట్టిపడేయాలో ఆ నాడీ వ్యవస్థ ఇతనికి తెలిసినట్టుంది. తనూరి యాసని: ఎక్కువగా ప్రాచుర్యం కానీ చారిత్రాత్మక గుర్తింపున్న పల్నాడు జిల్లా యాసతో కతలు చెప్పడం ఇంకో ఆసక్తికరమైన విషయం. తన యాసలో తన వాళ్ల కతలు చెప్పటం ఈ కతలకి బలాన్నిచ్చింది. ఈ పల్లీయుడి నిజాయితీ తన యాసలోనే అర్థమవుతుంది.

•••

“A being from a planet that no longer existed. The tales which were suspect.” (The Road)
Cormac McCarthy 

తన కతలు గాని, తనతో బతికి గతించిపోయిన మనుషులు గురించి గాని, తన పల్లెటూరి లోకపు పోగడ గురించి కానీ ఆ జీవి రాయకపోతే ఎవురో కల్పనలు జోడించి రాసిన కతలనే నమ్మాల్సి వస్తుంది. అసలు ఆ జనాలు నిజంగా ఉండివుంటారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఆ కథలన్నీ ఒకోసారి అనుమానాస్పదంగా మారొచ్చును కూడా.

      పల్లీయుల గొప్ప జాతరగా చెప్పుకునే “పోలేరు జాతర” ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదు. తరాలు దాటిన జరగని పోలేరు జాతరని తెలిసిన ముదసళ్ళు తమ జ్ఞాపకాలతో జరిపిన విధానాన్ని, ఊరి జనం హడావుడిని మొదటి కతలో నిక్షిప్తం చేశాడు. దీన్ని నేను డాక్యుమెంటేషన్ అంటాను కత కంటే ఎక్కువగా. పోలేరు జాతర తీరుతెన్నులు గురించి లోకానికి పరిచయం చేసిన కత. ఇంకా ఈ కత పైన రచయిత రాజకీయ దృక్పథం కూడా ఉండి ఉండొచ్చు. బ్రాహ్మణుల విగ్రహారాధన, పూజ, భక్తి విధానాల సంస్కృతి ఇక్కడిది కాదని, ఇక్కడి అసలైన జానపదుల జీవ సంస్కృతి ఏదో చెప్పాలని రచయిత ఈ కత రాసి ఉండొచ్చు.

కతలన్నింటిలో రాతగాడి ధైర్యాన్ని మెచ్చుకునేటట్టు చేసినది - “ఎల్లుటూరి సీనుమామ జచ్చిపొయ్యాక మత్తగతి అట్టయ్యింది” అన్న కత. ఊర్లో భర్త చనిపోయిన భార్య స్థితి ఎంత దుర్భరంగా ఉండి ఇంకో మగాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న సంఘటన స్వయంగా ఆమె కూతురు కళ్ళారా చూస్తే ఆ కూతురికి తల్లిపై కలిగే జుగుప్స, అసహ్యం మనకి కతలో మనీషాలో కనిపిస్తుంది. అలాగే కాస్త హాస్యబద్దంగా, ఊరి ప్రజల అక్రమ సంబంధాలు, వాటిని కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళు సృష్టించే కట్టు కతలలో ఒకటి- “ఊళ్ళోకి కొండ సిలువొచ్చింది”.

అతనికి తన నాన్నమ్మకి మధ్య అల్లుకుపోయిన రక్తసంబంధప్రేమని పసివాడి అమాయకత్వపు కోణంలోంచి చూపెట్టిన కత- “మా పిచ్చమ్మవ్వ జెప్పే శాత్రాలు”

సినిమాల్లో హీరోల నుండి విలన్లుగా మారే కాల్పనిక కతలను చూసుంటాం. “ఆగం బట్టిపొయ్యిన మా పెదగోపాల్ మావ” చదువుతున్నప్పుడు ఊరిలో కొందరి జీవన పరివర్తన ఎలా దిగజారి చివరికి కాటికి చేరుతుందో చెప్పే సస్పెన్స్ లాంటి కత.

ఇవి టెక్నిక్ని ఎత్తుగడని బేస్ చేసుకుని రాసిన కతలు కాదు. కాసేపు నవ్వుకోడానికి ఇందులో గాసిప్లు ఉండవు. మనుషుల కన్నీళ్ళ చెమటచుక్కల ఘోష. మొక్కుబడిగా రాసుకున్న కతలు కావు. పరిపూర్ణంగా తెలిసిన పల్లీయుల మనోగీతపు జీవన ఆంతర్య-బాహ్య రేఖలు. సబాల్టర్న్ కతలు.

•••

“Find the key emotion this may be all you need now to find your short story”
F. Scott Fitzgerald 
ఈ రాతగాడు కతకిచ్చే ముగింపు స్థాణువయ్యేలా చేస్తుంది మనసుని. నిజానికి కతకి చాలాసార్లు ముగింపే ఆయువుపట్టు‌. ఆయు పట్టుని బలంగా పట్టుకుని ఏ రీతికి తగ్గట్టు ఆ రీతికి ముగింపు మాట్లాడతాడు. 
నచ్చిన కొన్ని ముగింపు వాక్యాలు:
“మా గోయిందమ్మవ్వ జచ్చిపొయ్యాక ఊళ్లో జనం అత్తని జంపిందని మా పెదమ్మని మవ్వ పేరుతో గోయిందమ్మని బిలవడం మొదలుపెట్టింరు.
ఇప్పుడు ఎవ్వురైన మా పెదమ్మ పేరు తిరుపతమ్మ అంటే ఎవ్వురికి దెలీదు.”
(మా గోయిందమ్మవ్వకు ఎట్టాడి సావొచ్చిందో)

“మవ్వ మంచవులో పండుకొని నిదరబొయ్యాక, మవ్వ బొంద సుట్టూ పిచ్చి మొక్కలు పెరిగుంటే, నే నవ్వా ఒక శాత్రాం జెప్పవా అని ఏడుత్తా దిరుగుతున్నట్టు కలొచ్చింది ఆ రెయ్యి”
(మా పిచ్చమ్మవ్వ జెప్పే శాత్రాం)

“ఊరోళ్ళ నోళ్ళల్లో నానీనానీ వాళ్ళ నోళ్ళల్లోనే పొద్దు బొడిసిండు మా పెద గోపాల్ మావ”
(ఆగం బట్టిపొయ్యిన మా పెదగోపాల్ మావ)

ఒక్క ముగింపులోనే కాదు, కళ్ళకు కట్టినట్లు ఏకధాటిగా ఎక్కడ కించిత్ సందేహం కలగకుండా జీవిత పార్శ్వాలను తడుముకుంటూ రాసిన కతలివి. కతలకి పెట్టిన శీర్షికల్లో కొన్నిచోట్ల సొలోమోన్ విజయ్ కుమార్, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రభావితం ఉందేమో అని అనిపించింది. ఇది అనుకరణ అనుకోలేము గాని కత యొక్క పూర్తి సంగ్రహ విషయాన్ని ఒక వాక్యంలో చెప్పాలని ఈ శీర్షికలు ఎన్నుకొని పెట్టి ఉండొచ్చు. పల్లెటూరోళ్ళు మాట్లాడే పచ్చిబూతులు ఉన్నాయని ఈ జీవితాలున్న కతలని పక్కన పెడితే పల్లెటూర్లో తిరిగాడుతూ పొందే అనుభూతులను పోగొట్టుకున్నట్లే. బూతులు జానపదులు రాయని కావ్యాలు.

సొలోమోన్ విజయ్ కుమార్ ‘మునికాంతపల్లి కతలు’, నామిని కతలు, సం.వె రమేశ్ ’కతల గంప’, ఎండపల్లి భారతి ‘ఎదారి బతుకులు’ కతకులలాగా వాళ్ళ కతల్లాగా తీసుకున్న తన మనుషుల బతుకుని చెక్కుచెదరకుండా రాసిన కతలివి. మట్టికాళ్లతో గుడిసెలోకి వచ్చినంత సంబరం కలుగుతుంది ఈ గరికిపాటోడు చెప్పిన కతలు విన్నప్పుడు. 

“There is no greater agony than bearing an untold story inside you”
-Maya Angelou

వేదనాపూరితమైన బతుకుల్ని ఎన్నో ఏళ్లుగా గుండెల్లో మోస్తూ కతల్లాగా రాసిన రాతగాడికి, కతల్ని BUL BUL BOOK CAFE నుండి పుస్తకంగా వెలువరించిన Vijay Kumar Svk కి ఇద్దరికీ నెనర్లు.
లిఖిత్ కుమార్ గోదా. 
09.06.2023

For copies:
Contact: +91 6302 500 028 (శ్రీనిధి)
గూగుల్ పే/ ఫోన్ పే
వెల: ₹150(including the postal charges)

పుస్తకం.నెట్ (జూన్ 16, 2023)

25, జనవరి 2023, బుధవారం

ఇయ్యాల ఊళ్ళో - గూండ్ల వెంకటనారాయణ

 'Capella songs of ఇయ్యాల ఊళ్ళో'

★ 

1


"All you need to know of a place is,

do people live there.

If they do, you know everything."

(A Village Life)

~

Louise Glück , Nobel prize in literature.


దేశానికి జీవనాడులగా కేవలం చెప్పుకోవడానికే పరిమితమై,పల్లెల్ని పల్లీయుల జీవితాలని చాలా చిన్న చూపు చూస్తూ, పట్టించుకోకుండా ఉన్న ఇప్పటి ఆధునిక సాంకేతిక నానో మైండ్స్ కి పల్లెల మట్టి, మనుషులు, మమతలు, ప్రేమలు గురించి కచ్చితంగా తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఉరుకుల పరుగులతో అతలాకుతలమౌతున్న ఇప్పటి జీవితాలకు మట్టి ‌పరిమళం రుచి చూపించాల్సిన బాధ్యత కచ్చితంగా పల్లీయుడిగా బతికే కవితా ప్రేమికుడిపైన ఉంది. మట్టిలో పుట్టి, పెరిగి, కూలికెళ్ళిన అమ్మని తలుచుకున్నప్పుడో, గొడ్లు కాయడానికి వెళ్లినప్పుడో, సరదాగా జతగాళ్ళతో కలిసి ఈతగొట్టడానికి వెళ్ళినప్పుడో , అప్పటి స్మృతులను గుర్తు చేసుకుంటూ తన దేహంలో అల్లుకుపోయిన పల్లెటూరి గురించి ఒక కుర్రాడు ఏ సంగీత సాధనాలు లేకుండా పాడుకుంటున్న పాటలివి. వేదన, విరహం,వలపోత అన్నీ తను అనుభవించిన ప్రతీ పల్లె ఛాయల్ని గూండ్ల వెంకటనారాయణ తాను రాసిన ఇయ్యాల 'ఊళ్ళో కవిత్వంలో' నిక్షిప్తపరుచుకున్నాడు.



2


 >ఇయ్యాల ఊళ్ళో


మాగాడి చుట్టూ కొంగల ఈకలు రాలినట్టు 

పళ్ళెం చుట్టూ మెతుకులు

ఆటలకి పరుగుతీస్తూ

సగం కలిపి వదిలిన పాలబువ్వ 

'పళ్ళెం చుట్టూ కళ్ళమే'

అని అరిసే అమ్మ గొంతు

కొత్తగా పండక్కి ఆలికిన పేడమట్టి కమ్మని వాసన గుడిసె చూరులకి వేలాడుతున్న ఎండ


మట్టిదుమ్ము అరిచేతుల నిండా అద్దుకొని 

గురి చూసి కొట్టిన గోళీకాయ కేరింత 

గాలిని మేస్తూ మబ్బుల పరుగు

రెక్కలతో ఎండని విసురుతూ పచ్చుల పయానాం


జంగిడి గొడ్లు అడివికి బోయిన బాటంతా

గిట్టల జాడలు 

పేడకల్ల తాంబేళ్ల గుంపు 

బర్రెపెండ మీద కుచ్చిన రాయి 

నెత్తిన పొదిగిన ఉంగరం 

ఒంటి చుట్టూతా నీడని పెనేసుకున్న చెట్లు


పగలంతా గోళీలాటలో కాలానికి దుమ్ము పూసి, 

మట్టి పులుముకొని వెళ్లి 

ఇంటిముందు వాలగానే అమ్మ చివాట్లు 

బెరుకు బెరుగ్గా గడపలోకి చేరి 

మంచం మీద ముడుక్కుంటే 

అప్పటిదాకా తిట్టిన అమ్మ 

అప్పుడే బతిమిలాడి ఒళ్ళో కూచ్చోబెట్టుకొని 

కొసరి కొసరి బువ్వ తినిపిస్తుంది 

అప్పుడు బుగ్గ మీద అమ్మ పెట్టిన ముద్దు 

ఒళ్ళంతా చక్కిలిగింతలు పుట్టిన కులుకు


కాసేపు పక్కమీద కన్నుకొరికి 

కునుకు తీరి, ఇంటి ముందు 

దడి పక్కన నిలబడగానే 

నెత్తిన సూర్యుడు కుంకుమ చల్లుకున్న పుల్లెద్దులాగా 

గుడిసెనకమాల కొట్టంలోకి చొరబడుతూ కనబడతాడు


బజాట్లో ఊతకర్ర నేల పొడుస్తూ 

అడుగులు లెక్కపెడుతూ 

చెట్టు కొమ్మలంతున్న 

బుర్ర మీసాల సందున 

చిరునవ్వు పిట్టల్ని ఎగరేస్తూ 

ముతక తాత వెళ్తూ ఉంటాడు


దిబ్బలో ఎండిన పెంటకుప్పల్ని 

గెలిగిస్తూ కోళ్ల గుంపు 

మర్నాడు పండక్కి పళ్ళెంలో 

పొగలు కక్కే రాగిసంగటి ముద్దల నడుమ 

చియ్య ముక్కల రుచి విందు


నీళ్ళతొట్టి కాడ జాలాడమ్మటి 

బండ మీద అంట్లు తోముతూ 

గాజుల చేతులకి బూడిద పూసుకున్న అమ్మ


తూరుపు ముంగిట్లో

ఎడ్డకొండ ఎనకమాల 

తొంగిచూస్తున్న పున్నమినాటి 

జీరంగిగుడ్డు చంద్రుడు


సావిటి కాడ మసీదులో 

అల్లాని పిలుస్తున్న గొంతు


ఎద్దుల కాడి మీద గడ్డిమోపు కట్టుకొని 

అరక తోలుకుంటూ వస్తున్న నాన్న


పైన నింగిలో

సగం చీకటి సగం వెలుతురు నిండుకొని ఉంది 

బతుకులోని తీపి చేదుల్లాగా 

ఊరంతా ఇప్పుడు నలుపూ తెలుపుల 

గచ్చకాయలా ఉంది.


వాస్తవానికి ఈ కవితల్ని విప్పి విమర్శ (విశ్లేషణ అంటే బాగుంటుందేమో) చేయాల్సినంత పనేమీ లేదు. ఇతను ఈ కవితలో చెప్పేది ఒక పిల్లాడి జీవితం ఊరిలో సాధారణ అనేక దృశ్యాలు. పిల్లలు ఆటల్లో మునిగితే ఎంత ఆతృతగా తిండిమీద కూడా దృష్టి పెట్టకుండా పరుగులు తీస్తారు దానిని ముందు ప్రారంభించి ఆ నేపథ్యంలో ఊరి జీవితాన్ని, అందులోని నలుపూ తెలుపులు లాంటి తీపి చేదును పట్టి చూపించాడు.


ఈ రాతరిది ఎక్కువగా Narrative poetry. తన ఊరి భాషని,పద వాడుకని సర్వసాధారణంగా,మనతో మాట్లాడుతున్నట్లు కవిత్వం చేసేస్తాడు. కవితల్ని నిర్మించే పద్దతి చాలా flexible గా, detailing గా కనబడుతుంది.

ఇతను పల్లెపదాలతో బతుకుతున్నందున సామెతలతో కవిత్వం రాస్తున్నాడా? లేక వాళ్ళూరి సామెతల్ని సమకూర్చుతున్నాడా? అని ఆశ్చర్యపోయాను.

ఆలోచనతో అవినాభావ సంబంధం ఉన్న వస్తు సముదాయాన్నీ,ఘటనల క్రమాన్ని, సన్నివేశాల సమాహారాన్నీ,జత చేస్తూ 'ఆడిటరీ ఇమిజినేషన్' పద్దతిని చాలా ఇంపుగా వాడిన వాక్యాలు ఇందులో ఉన్నాయి.

  


> మమ్మ కళ్ళలో వాళ్ళూరు 


మమ్మ అప్పుడప్పుడూ తనలో తను 

గొణుక్కుంటూ ఉంటుంది

కొన్ని సార్లు ఎవరికీ వినిపించని పాటలు పాడుకుంటూ ఉంటుంది

బువ్వ ఒండుతూనో, కసువు ఊడుస్తూనో మాట్లాడుకుంటూనే ఉంటుంది.

ఏ పనీ లేక పోయినా ఒక్కో సారి పదేపదే "ఓరా..."అని పిలుత్తూ ఉంటుంది.


నేనాం పిలుపు పెద్దగా పట్టించుకోను.

కొన్ని సార్లు "ఏందవా.."అని ఎళ్తే, 

ఎందుకు పిలిచానా అని తనలో తను ఆలోచించుకొని

"పిలుత్తుంటే ఎంత సేపటికీ రావేంది"అని తిట్టి పోతుంది.

నాకప్పుడయితే పిచ్చి కోపమొస్తుంది


"మా నారాయణ కొచ్చే పిల్ల ఎట్టుంటదో. మా ఊరమ్మాయినే సెయ్యాలి. ఈ సావాన్లన్నీ దాని కోసవే" అంటది.

గూళ్ళల్లో ఒదిగిన పెద్ద బేసా నుండి సిన్న గలాసు దాకా అందుకే వాడకుండుంచింది.


నేను కూచ్చోని రాసుకుంటంటే "పిచ్చి పన్లన్నీ సేత్తుంటాడు."అని బుగ్గ గిచ్చి ముద్దు పెట్టుకొని పోతుంది.

కొన్ని సార్లయితే చెప్పిన పనే ఎన్నో చెప్తూ ఉంటుంది చచ్చిపోయిన వాళ్ళ నాన్న పేరు తలుచుకున్నట్టు


కొన్ని సార్లు మమ్మ మాట్లాడితే

వాళ్లూరు గుర్తొస్తుంది


ఎన్నేళ్ళు అయితుందో 

మమ్మ ఈ ఊర్లో అడుగుపెట్టి 

ఇంకా ఆవ గొంతులో వాళ్ళూరు.


వాళ్ళమ్మని పిచ్చిరావక్కా అనే వాళ్ళంటా

మా నాన్న అప్పుడప్పుడూ అదే మాటతో 

మమ్మను ఎక్కిరిస్తుంటాడు 

అవేవీ పట్టించుకోదు మమ్మ


ఏ పనీ లేకపోతే పడుకొని పైకి చూస్తూ 

కనురెప్ప వేయకుండా కింద పెదవిని అప్పుడప్పుడు కొరుకుతూ 

ఆలోచిస్తూ ఉంటుంది.

అసలు ఆవ కళ్ళ ఎదురు గాలిలో 

ఏ లోకం ఉండి ఉంటుంది?

ఆ లోకంలో ఏమేమి ఉండుంటాయి?


మమ్మకు సరిగ్గా అంట్లు తోమను రాదు

బట్టలు మట్టి పోయేలా ఉతకటం రాదు 

బువ్వాకూరా రుచిగా వండటం కూడా రాదు


ఆవ ఇల్లూడిస్తే సగం కసువు బండల మీదే పొర్లాడుతూ ఉంటుంది

ఆవకి సరిగ్గా పనే సెయ్యను రాదు.


కానీ వాళ్ళమ్మ కాడ నేర్చుకున్న 

కోడికూర, సంగటి వండితే మాత్తరం

అప్పటిదాకా నాలికమీద రుసులన్నీ ఏ చెట్లు ఎతుక్కుంటూ పోతాయో

కోడిచారు అద్దుకున్న సంగటి ముద్ద 

ఊళ్ళో బొడ్రాయి ఉన్నట్టు వోరం రోజులైనా నిలబడాల్సిందే.


చేలో పని ఎంపర్లాడుతూ చేసిద్ది

చేని మీద తిరిగే ఉత్తితీతి పిట్టలాగా 

ఒక్కతే కలుపు తీసుకుంటుంది.


ఇద్దరు పెళ్ళాలున్న మా నాన్నంటే 

మమ్మకి అప్పుడప్పుడూ బో కచ్చ.

ఏడాదికి ఒక సారన్నా మా పిన్నావ మమ్మా తిట్టుకుంటుంటారు


ఎప్పుడన్నా మా నాన్న కొడితే 

ఇంకంతే!వారం రోజులు కురిసిన తుపానులో 

నానిన అడివిలాగ అయితుంది ఇళ్లు.


మా నాన్ని బెదిరియ్యాటానికి 

"మన్నోల్లకి చెభ్తానని"పసిబిడ్డలాగా ఏడ్చిద్ది

"ఒక్కనాడన్నా మా నాన్న మమ్మని కొట్టెరగడు

ఇట్ట మిడియాలం సూపిచ్చే నీతో ఎవుడు 

కాపురం జేత్తరు పో.."అని ఇదిలిచ్చి

బట్టలు సర్దుకొని వాళ్ళమ్మా నాన్నా లేని 

వాళ్లూరు పోతానంటది.


మమ్మ గెవుతుల్లో ఆ ఊరు ఎలా ఉంటుందో వాళ్లమ్మా నాన్నా లేకుండయితే ఉండరనుకుంటా.


ఎప్పుడన్నా మమ్మమ్మ ఊరెళితే 

ఊరిలోని పతి ఇంటినీ పలకరించబోతే 

పొద్దుపోదు మమ్మకు

యాభై ఇల్లులున్న ఆ చిన్న ఊరిలో 

తిరుపతమ్మ పలకరించని మడిసి

చెయ్యి కడగని ఇళ్లు ఉండదు.


ముంగిలా ఉండే వాళ్లన్నకి ఎడతెగని 

కబుర్లు చెప్పిద్ది

'మా వొదిన దోసొక్కలేసి పప్పు జెత్తే 

ఎంత కమ్మగుంటదో ' అని ఎన్ని సార్లు జెప్పిద్దో


ఆ ఊరు నుంచి తిరిగొచ్చే పతి సారీ 

మళ్ళీ వచ్చి ఈ ఊరు సూత్తనో సూడనో 

అనే బెంగతోనే తిరిగెల్లేది.


దొంతోరపల్లె తువ్వ దారి మీద నడుత్తూ 

కొండ చాటుగా ఉన్న వాళ్ళ అమ్మ గారి ఊరిని 

ఎన్ని సార్లు తడి కళ్ళతో సూసిద్దో... దానికి అంతే లేదు.


ఈ పుస్తకంలో రాతరి తన అమ్మని తలంచి,అమ్మని, ఆమెతో మమేకమైన జ్ఞాపకాలని ఇందులో నాలుగు కవితల్లో రాసుకున్నాడు. ఒక్కొక్క దానిది ఒక్కో ఊసు. పనికెళ్ళిన కూలి తల్లి గురించి ఏడ్చే పిల్లోడి విచారగీతిక -''అమ్మింకా ఇంటికి రాలేదు''; చుట్టపు చూపుగా పుట్టినూరొచ్చిన వాళ్ళమ్మతో ఊరోళ్ళు చూపించే మమకారం,పంచుకునే విచారం - ''ఎన్నటి రాగి సంగటో'';ఆత్మీయతలు అనుబంధాలు అరకొరగా ఉండే నగరజీవితంలో అమ్మని తలుచుకుని కనీసం అమ్మ కొంగునైనా పంపమనే కొడుకు కన్నీళ్ళు - "అమ్మ కొంగు తోడు కావాలి" ఏ కవితల్లోనైనా తల్లి(పై) ప్రేమ మనల్ని పెనవేసుకుంటుంది. అమాయకంగా,చెమటదేహాలతో బతికే అనేక అమ్మల బతుకులు,గమనాలు ఇందులో మనకు తారపడతాయి.

"…

పందిరి కొసన పండగ తారలాగా

క్రిస్మస్ అనగానే

నువ్వే మతికొస్తావురా లాజర్గా."(పండగపూట నీతో)


పల్లెల్లో క్రిస్మస్ పండుగను జరుపుకునే తీరును వర్ణించే తీరు చలిలో కాచుకున్న మంటలా హాయిగా అనిపిస్తుంది.


> వాన గాలి


ఒక్కన్ని కూర్చున్నాక ఇంకేమీ తోచదు 

కాస్త గాలి

అక్కడక్కడా చుక్కలు 

ఇలాంటి రోజుల్లోనే నువ్వు గుర్తుకు వస్తావు


చావులూ పుట్టకలూ ఏడుపులూ సిద్దాంతాలూ అన్నీ నా నుంచి యడమయ్యి

నా ఆవేశమంతా చల్లబడిపోయాక

ఊరిలో కానుగ చెట్టుకింద కూర్చొని 

నువ్వు చెప్పిన కుందేలుపిల్ల కత మనసులో మెదులుతుంది.


వానలో తిన్న కలేకాయల రుచి

ఉన్నట్టుండి మతికి వస్తుంది.


కంది చేలో పరిగెత్తుతూ కాలికి కొయ్య గుచ్చుకొని తగిలిన గాయం

దానిని వేలితో తడుముకుంటే

నువ్వు కట్టిన కట్ట

బెదురుతో నీ చూపులు 

అప్పుడే నిన్ను తొలిసారి ముద్దు పెట్టుకుంది


ఇప్పుడివన్నీ ఇలా ఒక్కన్నే కూర్చున్నాక గుర్తొస్తూ ఉంటాయి


పగులు మిరపతోటలో పాము ఒళ్ళో దూకి 

మెత్తగా పాక్కుంటూ పోయిన స్పర్శ గుర్తొస్తుంది.


వానకి ముందు

కొండంతా మబ్బుని కప్పుకోవడం 

ఇంటి ముందు నిల్చొని చూస్తుంటే

నువ్వు దగ్గరికొచ్చి నవ్వి

ఏముందని అలా చూస్తావు అని పక్కనే నిల్చోగానే 

వానగాలి నునుమెత్తగా తాకుతూ పోయేది


ఊరికి దూరంగా జరిగాక ఇవే

తలుస్తూ ఉంటాను

ఇవి తలుచుకొని నీకు ఏవో కబుర్లు చెబుతున్నట్టు 

కవిత్వం రాసుకుంటాను


నువ్వూ ఊరూ కవిత్వ

ఇప్పుడు ఇవి మాత్రమే నాకు మిగిలింది.


ఇలా ప్రియురాలితో చెప్పుకోవాలనుకునే కన్నీటి చారికలు కూడా కనిపిస్తాయి. వాటిలోనూ అతణ్ణి వీడని పల్లె ఉంది. 

ఇతనికి కురిసే వాన, వీచే గాలి,నల్లని రాత్రి, కప్పబడ్డ వెన్నెలంటే అత్యంత ప్రీతి కూడా. అందుకే చాలా వరకు వాటినే కవితా వస్తువులుగా మార్చుకున్నాడు. 


3


ఇంకా ఈ కవిత్వ సంపుటిలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు -


ఎక్కడో ఇప్పటి జీవితం మీద 

ప్రేమ సన్నగిల్లినప్పుడే 

గతంలోకి పోతుంటాం అనుకుంటా

కోల్పోయినవి ఎంతటి మధురమైనవో 

కోల్పోయిన నీకే కాదు ఈ సృష్టికీ తెలీదు


జీవితంలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన 

ఒక మధుర ఘడియనైనా కోల్పోవడం 

ఈ సమస్త మానవ లోకపు పరాజయం


అది ఈ సృష్టి నెత్తిన ఒక విషాధ శాశ్వత హస్తిక

~

Interior గా ఏదో ఒక తాత్వికతను తనకు తానే చెప్పుకుంటున్నట్టు.


తగుళ్ళ గోపాల్  "దండకడియం"లోని ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం మతికొచ్చింది ఇందులోని"ఆమె లోకం" చదువుతున్నప్పుడు. పల్లి పట్టు  నాగరాజు "యాలై పూడ్సింది" కవిత్వ సంపుటిలోని కుశాల,రుక్కత్త లాంటి కవితలు గుర్తొచ్చాయి. అంటే ఏ ప్రాంతానికి చెందిన పదజాలాన్ని ఎవరికి వాళ్ళు తమ కవిత్వంలోకి తెచ్చుకున్నారన్నమాట.

ఇంకా ఇతనికి ఎర్రని విప్లవాన్ని ప్రేమించే అటవీ అన్నలని చూడాలని, కార్ల్ మార్క్స్ తో చెలిమి చేయాలని బహు ప్రీతి. అందుకే ఎంతో ప్రేమగా వాళ్ళపై కవిత్వం రాసుకున్నాడు. 


ఇవి కేవలం ఎమోషన్స్ ఇమాజినేషన్స్ డాక్యుమెంటేషనే కాదు, జీవనానికి సమూల స్తంభాలుగా అయ్యుండి కూడా పరిగణింపబడని మనుషుల,పల్లెల జీవరాతలు. పల్లెల మనుగడ,మరుగున పడకూడదని రాసుకున్న కవితలు. ఈ కవి తను వాడే ఉపమానాలకు పల్లెటూరి జీవన సంబంధితాలనే ఒక పరిధిలోకి పెట్టుకుని రాయలేదు. అవి జీవితంలో కలిసిపోయినవి తనకు. తనకు ఉపమేయాలు ఉపమానాలు వేరు వేరు కాదు. వాటిని వీటితోనూ, వీటిని వాటితోనూ ద్వంద్వ భావ సముచితంగా పోల్చుకుంటూ రాసుకున్నవి. ఒక్కమాటగా ఈ పుస్తకంలోని కవితలు పల్లె ఆత్మగీతాలు. సజీవంగా నిలబడగలిగే "సబాల్టర్న్ పోయెట్రీ".


కవిత్వమంటే ఇప్పటి తరం యువకులకి కొన్ని లవ్ పోయెమ్స్ అనుకునే సోకాల్డ్ సాహిత్యకారుల మాటల్ని కొట్టి పారేసే విధంగా రాసుకున్న  అస్థిత్వ,అనుభూతుల,అనుభువాల కావ్యం. తప్పకుండా చదవాల్సిన కవిత్వం. ఇది ఒట్టి మాట మాత్రం కాదు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన హోరు ప్రచురణలకు అభినందనలు మరియు శుభాకాంక్షలు. రాతరికి,పాటగాడికి మేల్తలుపులు. 



లిఖిత్ కుమార్ గోదా. 

25-01-2023


పుస్తకం కొనాలనుకున్నవారు.

7032553063 కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి పొందవచ్చు.

నవోదయలో కూడా మీకు లభిస్తాయి.

బుక్ 100 రూ... పోస్టల్ చార్జెస్ 36 రూ…

16, జనవరి 2023, సోమవారం

మాన-భంగం- బాలాజీ ప్రసాద్

 ప్రస్తుత శారీరక అఘాయిత్యాలపై మాట్లాడే 
'మాన- భంగం' నవల

~

"The object of the novelist is to keep the reader entirely oblivious of the fact that the author exists, even of the fact that he is reading a book"

- Ford Madox Ford




తెలుగు లిటరేచర్ లో డిటెక్టివ్ (ఇన్వెస్టిగేషన్) తరహాలో నేను చదివిన మొదటి నవల ఇది. ‌ రకరకాల సమస్యలతో తనామునకలవుతున్న ప్రస్తుత సమాజంలో మనుషుల్ని భయంకరంగా బాధపెట్టేవి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు- అత్యాచారాలు. రేప్ - ఒళ్ళు గొగ్గురుపొడిచే పదం. మానసిక స్థితిని కుళ్ళపొడిచే పదం. చాలామంది కుర్రకారు మగాళ్లు ఆడవాళ్ళ మీద అత్యాచారానికి ఎందుకు పాల్పడుతున్నారు? ఈ ప్రశ్న ఈ నవలలో రకరకాల రేప్ల మీద పరిశోధన చేస్తూ పుస్తకం రాస్తున్న ఇన్స్పెక్టర్ మాధవ్ లోనే కాదు మనలోనూ మొదలవ్వాలి.


విచక్షణ కోల్పోయి, వావివరసలు మర్చిపోతూ ఆడపిల్లల్ని శారీరక అఘాయిత్యాలకు ఎందుకు బలి చేస్తున్నారు ఈ దేశంలో. ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉండే నివారణ కావాలి. ఇంటిదగ్గర తల్లిదండ్రులచే 'గుడ్ టచ్- బాడ్ టచ్' గురించి ఆడపిల్లలతో మగ పిల్లలెలా మసులుకోవాలి? మగవాళ్ళతో ఆడపిల్లలు ఎలా నడుచుకోవాలో ఇంటిదగ్గరే తల్లిదండ్రులు వివరంగా చెప్పాలి. బడిలో ఇంటి ఆవరణలోనూ ఎలాంటి సమస్యలు పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలి.

★★★

నవలా కథనం ప్రకారం:-

ఓపెనింగ్ చాప్టర్ ప్రియా అనే స్నేక్ క్యాచర్ సుబ్బారెడ్డి పొలంలో పాము పట్టడంతో మొదలవుతుంది. తన భర్త మాధవ్ పోలీస్ ఆఫీసర్. వాళ్ళు ఉండే ఊరి దగ్గరి బ్రిడ్జి కింద శవం కనబడిందని కూతురు యోగితాని కాలేజ్ కి డ్రాప్ చేయడానికి వెళుతున్న మాధవ్ కి మంగమ్మ, నాగయ్య ద్వారా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అది ప్రకృతి అనే అమ్మాయి శవమని, ఆమెని రేప్ చేశారని, తర్వాత బ్రిడ్జి కింద పడేశారని పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. హంతకుడు ఎవరో తెలుసుకోవడమే మాధవ్ వెతుకులాట.


మాధవ్ రకరకాల రేప్ ల మీద ఒక పుస్తకం కూడా రాస్తుంటాడు. మాధవ్ తన కొలీగ్స్ పురుషోత్తం, వనజలు కలిసి suspects ని ఎంక్వయిరీ చేస్తారు. ఎదురింటి కుమారస్వామిని, బాయ్ ఫ్రెండ్ దుర్గాప్రసాద్ ని, ఆఫీసుకు పగడాల సత్యాన్ని, బాబాయ్ వరసయ్యే ధర్మేంద్రని ఇలా తన ఎంక్వయిరీలో ఒక్కో కొత్త కోణంలో ప్రకృతి అత్యాచారానికి చిన్నప్పుడు నుండే ఎలా బలైపోయిందో చెప్తాడు. ఈ కేసు గురించే పురుషోత్తం మాధవ్ లు ఇద్దరు గొడవలు పడుతుంటారు.


ప్రకృతిని గురించి ఆలోచిస్తూ తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి తనపై జరిగిన మూడు అత్యాచారాలు అతన్ని వదలని దెయ్యాలయి, తన జీవితం మీద ఎంత ప్రభావం చూపాయో ఒక చాప్టర్లో చెప్తాడు‌.


చివరికి తన భార్య ప్రియ ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాముల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం చెప్పినప్పుడు మాధవ్ కి ఈ కేసును ఎలా డీల్ చేయాలో స్ఫురణకు వస్తుంది‌. ఆకలితో తను పెట్టిన గుడ్లని చూడకుండా,తన పిల్లలి కూడా చూడకుండా కన్నపామే తినేసినట్టు తండ్రి సుబ్రహ్మణ్యమే కూతురు ప్రకృతిని అత్యాచారం చేసి పిడిగుద్దులతో చంపి తన చాపర్ లోనుండి బ్రిడ్జ్ కిందికి పారేశాడని.


ఇలా ముగుస్తుంది నవల. 

★★★

మనుషులు మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయో వివరించిన సంఘటనలు ఉన్నాయి. సమకాలీనంగా అత్యాచారాలపై వస్తున్న తెలుగు సినిమా చూసినంత ఫీలింగ్ కలిగింది. తీసుకున్న వస్తువు, శిల్పం చాలా మటుకు దేనికి తగ్గ ఫ్లేవర్ దానికి వాడి ఆకట్టుకునేలా రాశాడు.



With the Author: Balaji Prasad 

ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయాలు 

1. ఇన్వెస్టిగేషన్ మోడ్లో నవల నడిపించడం. 


2. మాధవ్ బాల్యంలో అత్యాచారానికి గురవడం. ఆడవాళ్ళు ఎక్కువ శాతం రేపులకు గురవడం మనం చూస్తూ ఉంటాం. కానీ మగపిల్లలను కూడా మగవాళ్ళు తమ శారీరక వాంఛకు ఎలా లొంగ తీసుకుంటారో చెప్తుంది మాధవ్ చిన్నప్పటి పాత్ర. ఇలాంటి సంఘటనలు మనం ఇంగ్లీష్ లిటరేచర్లలలోనూ, సినిమాల్లోనూ తరచూ చూస్తూ ఉంటాం. కానీ పెద్దగా దృష్టి పెట్టం.


3. ప్రియ పాత్ర. ఒక నవలలో మొదటి నుండి ఒక పాత్ర గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటే ఆ పాత్ర ద్వారా రచయిత ఏదో ఒక విషయాన్నో, ఉపయోగాన్నో తెలియజేయాలనే చిత్రీకరిస్తాడు. ఈ నవలలు opening protagonical character స్నేక్ క్యాచర్ ప్రియది. రచయిత స్నేక్ క్యాచింగ్ చేసే ప్రియ ద్వారా ఏ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. Investigation తరహాలో నడుస్తున్న ఈ నవలలు ప్రియ పాత్ర స్నేక్యాచార్ గా ఎందుకు ప్రత్యేకంగా పెట్టాడు అని ఆలోచన. మాధవ్,ప్రకృతి మరణం విషయంలో ఎంతమందిని ఇన్వెస్టిగేషన్ చేసిన అంతుచిక్కని చిక్కుముడి చివరికి ప్రియ వల్ల వీడిపోతుంది. ప్రియ పాత్ర అక్కడ ఉపయోగమైంది. Major గా, Minor గా పాములు గురించి, పాములు మనస్తత్వం కలిగిన మనుషుల గురించి చైతన్యం తేవడం.

★★★

సోలోమోన్ విజయ్ కుమార్ రాసిన మునికాంతపల్లి కతల్లో 'యానాది సెంచయ్య ' ఒకటి. యానాదుల జీవన విధానంలో ఉపాధికి ఉపయోగపడే తత్వం పాటలు, వివిధ వేషాలు వేసుకొని (మగాళ్లు కోకా రైకా కట్టుకొని) ఆడవాళ్లలా యాక్షన్ చేయడం భలే విచిత్రమైన విషయంగా తోస్తాయి. డా. కేశవరెడ్డి చివరి గుడిసె నవలలో కూడా వాళ్ల జీవనం వెనుకున్న కన్నీటి సంఘర్షణ, తత్వం పాటలు పాడిస్తూ అవగతం చేస్తాడు. అలాగ, రచయిత బాలాజీ ప్రసాద్ కూడా యానాది జీవితాలను దగ్గరగా చూపించాడు. ఇందులో రచయిత పరిశీలనా పరిశోధనా నవలా రచనలో పడిన శ్రమ కనిపిస్తుంది. ఇందులో తత్వం పాటలు ఆకర్షణంగా అనిపించాయి.


'వాలు కళ్ళ ఒక చిన్నది.. దాని నెత్తిన ఒక కడవంట 

కాలు జారిపాయ.. కడవ పగిలి పాయా

నీళ్ళు పారిపాయా.. చిన్నదాని గుండె నిరమళ మాయ 

మాయా సంసారం ఇదేరా.. కలి మాయా సంసారమిదేరా'


యానాది జీవుల మౌఖిక సాహిత్యాన్ని కొంతలో కొంత నైనా లిఖిత సాహిత్యంగా మార్చి నిక్షిప్తపరిచేలా చేయడం హర్షించదగ్గ విషయం.


పల్లెల్లో మమేకమైన జీవితాలని చిత్రించడం కూడా బాగుంది. అందులో మిడియాళం పాత్ర కడుపుబ్బా నవ్విచ్చేలాగా ఉంది.

నా అభిప్రాయాలుగా రచయితకి కొన్ని సూచనలు ఇవ్వదలిచాను.

Tautology

'గాలిదేవుడు ఇసనకర్రతో ఊపినట్టు పొడబారిన చేలంతా జోరున గాలి'. ఇక్కడ ప్రస్తావించేదంతా గాలి వీస్తోందని. కానీ గాలికి సంబంధించిన అర్థాలను ప్రతీకలను రెండు మూడు సార్లు వాడటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. భావం,వర్ణన కోసం వాక్యాన్ని తారుమారు చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటివి ఈ నవలలు స్వల్పంగానే ఉన్నాయి. వీటిపై దృష్టి సారిస్తే మంచిది.(పేజీ నెం: 92:1:1)


అలాగే భాషను నడిపించే తీరులో ఒకసారి స్పష్టత కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. భాష ఎక్కడ సరళంగా ఉండాలో, ఎక్కడ మాండలికంలో ఉండాలో బాగానే చూసుకున్నాడు. కానీ ఒక్కోసారి సరళమైన వాచ్యంలో చెబుతూ, అదే క్రమంలో యాసని మాండలికాన్ని కలపడం వల్ల చదవడానికి వెసులుబాటుగా అనిపించక కాస్త ఇబ్బంది కలిగింది.


కొంచెం clarity కానీ విషయాలు

మాధవ్ తండ్రి యానాదయ్య ఎలా మరణించాడు? పోలిరెడ్డి కొట్టినందుకా? అవమానం వల్ల? అవసరమైన కాకపోయినా ప్రస్తావన క్లారిటీ ఇవ్వలేదనిపించింది. ఇవేం పెద్ద మిస్టేక్స్ ఏమీ కాదు. ఒకసారి దృష్టి సారిస్తే మంచిది. ‌

మొత్తానికి ఈ నవల ద్వారా ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఎలాంటి సెక్స్ అండ్ సైకాలజీ ఎడ్యుకేషన్ నేర్పాలి? తల్లిదండ్రులు చిన్నప్పటినుండి తమ పిల్లలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తో పాటు విక్టిమ్ బ్లేమింగ్ అన్న విషయాలు అవగాహనకు తీసుకురావాలి అనే వాటిని మనముందుకు తెచ్చి పెట్టి ఆలోచించమంటాడు.


ఒక చోట -


మనుషులు సెక్స్ విషయంలో తెలీయకుండా నిగ్రహం ఎందుకు కోల్పోతారు. ఆ సమయంలో ఆడ, మగ ఆక్రోశం తీర్చుకోవాలని ఎందుకు చూస్తారు. పిల్లల మీద, ఆడవాళ్ళ మీదనే ఈ అఘాయిత్యాలకు ఎందుకు పాల్పడతారు. వాళ్ళు బలహీనులు అనా? వాళ్ళ కన్నా బలవంతులు ఐతే వాళ్ళ అహన్ని అణగార్చుకోడానికి వీలు కాదనా?. ఆ లెక్కన ప్రతిఒక్కరిని గెలుచుకోవాలని అనుకుంటారు కదా? తనా మనా అనే భేదాలు లేకుండా బంధాలు మరిచి కోర్కెలు తీర్చుకోవాలని అనుకుంటారు కదా. అవకాశం ఉండదు కాబట్టి అలా చేయలేకపోతున్నారా? ఒకవేళ అవకాశమే ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఆ రెండుక్షణాల క్షణికావేశానికి అంతలా ఎందుకు పాకులాడుతారు? ఆ రెండుక్షణాల క్షణికావేశం తర్వాత ఏముండదు.. దాని వల్ల ఘోరం జరిగిపోతుందనేంత తెలీని అజ్ఞానంలో ఉంటారా? తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి…


ఈ ఉద్వేగం, సంఘర్షణ రచయితవి.ఆ కోపంలోంచే ఈ నవల రాశాడనిపిస్తుంది రచయిత. మంచి సోషల్ అవేర్నెస్ తో, మంచి కథనంతో బాగా రాశాడు నవలని. యువ రచయితలు ప్రస్తుత సమాజం మీద, మార్పు మీద దృష్టి పెట్టారనడానికి ఈ నవల ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇంకా రాయాలని ఆశిస్తున్నాను. అభినందనలతో -

లిఖిత్ కుమార్ గోదా,

ఐ.ఎం.ఏ- తెలుగు - ద్వితీయ సంవత్సరం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

ఫోన్:- 9640033378