Some of the surprising stories hidden behind the hands - నల్ల పిల్లనగ్రోవి
•••
"You never really understand a person until you consider things from his point of view... Until you climb inside of his skin and walk around in it."
~ Harper Lee, To Kill a Mockingbird
ఇవి “పైకి” చాలా సరళంగా, ప్రాధమిక దశలో ప్రాధమిక భాషలో గ్రామీణజీవులకు అర్థమయ్యే విధంగా, ఎలాంటి దృష్టికోణమూ లేకుండా ఒక కుర్రవాడు తనకు తెలిసిన నాలుగు పిచ్చిపాటీ విషయాలను కథలుగా వ్రాసాడనే తలంపు కలుగుతుండవచ్చు. నేరేటర్ ని చూస్తే అతనిలో ఇంకా పసితనం, అమాయకపు ఛాయలు మిగిలే ఉన్నాయని అనిపిస్తుంది. బహుశా అతని రాతలకి ఇవే బలమని కూడా నేను నమ్ముతున్నాను. పైన నేను చెప్పినట్లు ఇవి పిచ్చిపాటిగా రాసినవి కావు. ఇవి beyond ఆలోచించాల్సినవి. కేవలం ఆలోచించడం మాత్రమే కాకుండా రచయిత చెప్పినవాటికి వర్తమానధోరణికి మధ్య పొంతన సవివరంగా ఉందని పరిశీలించాల్సినవి. ఎనిమిదే కథలు కానీ ఏవాటికావాటికి వాటిదైన గురి వుంది. నిగూఢత ఉంది. ఈ కథలు చదవడం మాంచి ఆటవిడుపు. ఎనిమిది కథలని నేనెలా నిర్ధారించుకున్నానో ఆ విషయాలని ఇక్కడ పరుస్తున్నాను. కొన్ని కథలను దాదాపు బట్టబయలు చేసినా, కొన్నింటిని కావాలనే పైపైకి చెప్పాను. కొన్ని పాఠకుడికి వదిలేయడం మంచిదని.
కుందేలు బొమ్మ
ఈ కథ చదవడం పూర్తి చేసి కొన్ని క్షణాల పాటు ఆలోచనల్లోకి వెళ్ళినప్పుడు - మొదట ఇందులో ఏముందని కథ అంటున్నాడనే సంశయం కలుగుతుంది. స్థూలంగా పరిశీలించిన తర్వాత నాకు అందులో మూడు అంశాలు కనబడ్డాయి. ఒకటి పాప - అమ్మ ఎంత వారించినా వినకుండా తిరునాళ్ళలో పాతబడిపోయిన కుందేలు బొమ్మ కొనిపెట్టించుకున్న పాపకి పాత వస్తువులను కొంటే అరిష్టం అన్న వాళ్ళమ్మ నమ్మకంలాగా తనకలాంటి ఆలోచన లేదు, తెలియకపోవచ్చు. పాప లోకమంతా ఆ కుందేలుతోనే. పాప మనస్థత్వాన్ని అద్దంపట్టే సన్నివేశాలు చిత్రించాడు. అయితే చీకిపోయి చిరిగిపోయిన కుందేలు బొమ్మ- చచ్చిపోయిందన్న తలంపే పాప మనసులో పాతుకుపోయింది. అయితే ఒక దగ్గర వాళ్ళమ్మ “కుందేలు బొమ్మ కదా.. కోసుకుని తినుంటారు” అని అంటుంది. పాప కుందేలు బొమ్మని జీవం ఉన్నదానిలా చూసుకుంది కాబట్టి మరణానికి గురికాబడ్డ కుందేలు బొమ్మ ఇంకెప్పటికీ తన వద్దకు తిరిగిరాదనే బెంగలోకి వెళ్ళిపోయుండొచ్చు. అందుకే ఎప్పుడూ “బుజ్జి కుంతేలు… బుజ్జి కుంతేలు” అని తలుచుకుంటూ ఉండవచ్చు. రెండోది అమ్మ పాత్ర - కథాంతంలో “పాతబొమ్మని కొనుక్కోబట్టే అరిష్టం చుట్టుకొని పాప లేకుండా పోయిందని పాత వస్తువుల మీద అమ్మ ద్వేషం పెంచుకుంది” అని చెప్తాడు. నమ్మిన విషయాన్ని జరిగిన సంఘటనకు ఆపాదించుకుని ఉండటంవల్ల అమ్మకి ఇంకాస్త దిగమింగుకోలేని కోపం ద్వేషం. ఇది తన అనుభవాలచిట్టాలో చేరిన ఒక విషయం. పెద్దవాళ్ళ దగ్గర నుండి వస్తున్న ఆచరణార్థం తనింకా Inferior complexityలోనే తనమునకలైపోయింది. మూడోది - “పాత కుందేలుతో ఆడుకుంటున్న పాప ఫోటో మాత్రం పటం కట్టించి దాన్నే చూస్తూ ఉండేది అమ్మ”. పాప మరణానికి కారణం ఏదనది అమ్మ పాత్రకి స్పష్టత ఉండి ఉండవచ్చు. బహుశా పాప చినిగిపోయిన కుందేలు బొమ్మ వల్లే చనిపోయిన, పటంలోని పాప, కుందేలు బొమ్మ తనకి మిగిలిపోయిన జ్ఞాపకాలుగా చెప్పుకోవచ్చు. ఇది రచయిత కోణంలో ఏమై ఉండొచ్చో నాకు తెలియదు కానీ, నేను కథననుసరించినంతవరకు ఇవే నా మతికి తట్టింది.
తండా వాళ్ళ అమ్మాయి
ఈ కథ చదువుతూ ఉన్నంతసేపు ఇది ఇచ్చిన Involvement and flavour of the story ని అనుభూతి చెందుతూ ఉన్నాను. బంజారేతరుడు రాసిన అత్యంత శక్తివంతమైన పల్లెటూరి మనస్థత్వాలని నిండారా మూడు పాత్రల్లో చూపించడానికి ప్రయత్నించిన కథ అని నాకనిపిస్తుంది. ఇందులో కథను చెప్పే నేరేటర్ విపరీత భయస్తుడు. తన అన్నకి ఆడవాళ్ళతో తిరగాలనే వ్యామోహం మిక్కిలిగా ఉంటుంది. నమ్మిన వ్యక్తిని ప్రేమికుడిగా భావించి చివరికి మోసపోయి ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియని అమాయక “తండా వాళ్ళ అమ్మాయి” తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ గుర్తించుకోదగ్గ కథ. Narrator చుట్టూ ఉన్న జీవనగతులు - తన సావాసగాళ్ళకి లంబాడీ ఆడవాళ్ళంటే ఎంత మక్కువో, ఆడదాన్ని తప్పుగా చూస్తే ఏమౌతుందోనని దిగ్భ్రాంతి అనేకమార్లు చూస్తాం. అలాగే లంబాడీ మహిళలపై బయటి జనాలకి ఎలాంటి అభిప్రాయాలుంటాయో కూడా మాట్లాడుతాడు. రచనంతా ఎత్తుపల్లాలు లేకుండా సాఫీగా కదులుతూ ముగింపు తీసుకొచ్చిన సహజమైన అవరోధం పాఠకుడికి సుపరిచితం అవుతున్నట్టే అవగతం అవుతుంది కానీ తండా వాళ్ళ అమ్మాయి దయనీయమైన స్థితిని పాఠకుడు తట్టుకోలేని విధంగా మలుస్తుంది. తండా వాళ్ళ అమ్మాయి పాత్ర నాకు Cormac McCarthy - All the pretty horses నవల ముగింపులో John Grady Cole ని గుర్తుచేసింది. గుర్రాలతో ప్రపంచాన్ని నిర్మించుకున్న కోల్, ప్రేయసినుండి దూరంగా వచ్చేసి, Blevins అనే పదమూడు - పద్నాలుగేళ్ళ మిత్రుడి మరణాన్ని, Rawlins పై జరిగే కత్తిపోటు దృశ్యాన్ని కళ్ళెదుటే చూసి, ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కున్న పదహారేళ్ళ కోల్ ( ఈ కథలో తండా వాళ్ళ అమ్మాయి వయసు కూడా అంతే) ఎక్కడనుండి వచ్చాడో తిరిగి అక్కడికే కదిలిపోయిన సంగతి గుర్తుకొచ్చింది. కోల్ కి కారణాలు అనేకం కావొచ్చు కానీ అందులో ప్రేమ కూడా ఒకటి ఇక్కడ ప్రధాన పాత్రకు మల్లే. విషాదగీతికలుగా మారిన సంఘటనలు.
ఊళ్ళోకి నాయకుడు వచ్చాడు
కథకి అద్భుతమైన నడకతీరు ఉన్నప్పుడు, అది సరళంగా సూటిగా Running commentaryలాగ, సినిమాలాగా కళ్ళముందు దృశ్యాలు వెంటవెంటనే మారుతూ కథనంతా దృశ్యమానం చేస్తునప్పుడు పాఠకుడికి విసుగన్న తలంపే రాదు. ఈ కథలో నేను పైన ప్రస్తావించిన తీరుతెన్నులన్ని ఉన్నాయి. ఊళ్ళోకి నాయకుడు వస్తున్న సందర్భంగా ఆ ఊరి స్థితిగతులు, వొంకరచూపులు, ఏర్పాట్లు, అరుపులు, ఏమీ తెలియని వెర్రి చూపులు, వివాదాలు, తగాదాలు, రాజకీయ మురికి, పాయింట్ లేని స్పీచ్లు, ఒకటేమిటి ఇందులో ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తికరంగా, పొల్లుపోకుండా రాశాడు. ఐదువందల రూపాయలకి ఆ నాయకుడి సమావేశంలో ఉత్సాహభరితంగా నాట్యం చేయడానికి వచ్చిన లంబాడీ మహిళల్లో ముప్పై - ముప్పై ఐదేళ్ళ లోపున్న మహిళపై జరిగిన లైంగిక దాడి ఒక్కటే కాదు దీని ముగింపు అలాగే కథ. ఇది అన్ని వనరులు, వర్ణనలు, రాజకీయ వేషాలపై నచ్చని దృష్టితో వ్యంగ్య ధోరణిలో మాట్లాడే గొంతు అన్నీ సవివరంగా ఉన్న బలమైన బహుకథల సమాహారం.
నల్ల పిల్లనగ్రోవి
Mythologyలోని కథని తీసుకుని సరికొత్త కథలుగా తీర్చిదిద్దిన దాఖలాలున్నాయి చాలా చోట్ల. గ్రీకు పురాణాల్లోంచి కొన్ని ఘటనలను, పాత్రలని ఆధారంగా చేసుకుని ఆధునిక సాహిత్యంలో కథలు నవలలు రాసినవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు జేమ్స్ జాయిస్ “యులిసిస్”లో కొన్ని చోట్ల, అలీ స్మిత్, పాట్ బార్కర్ తమ నవలల్లో ఇలాంటి ప్రయోగాలు చేసారు. కృష్ణుడు రాధ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లనగ్రోవితో. రాధ ఇంకా రాదు. తర్వాత కృష్ణుడు అసలు వేణుగానం ఎలా నేర్చుకున్నాడనే కథను తనదైన ఫిక్షన్ తో చెప్పి , ఇంకో దగ్గర రాధ తక్కువ కులపు అమ్మాయి కాబట్టి యశోద ఆమెని కృష్ణుడితో తిరగొద్దని వారించిందని చెప్పడం, రాధాకృష్ణుల ప్రేమ కథ, ఇద్దరు ఎలా విడిపోయుంటారనే దాన్ని ఆసక్తికరంగా వ్రాసాడు.
ఒక కాలు ఒక చేయి మనిషి
చాలావరకు కథల్లో ఒకళ్ళ కోణం నుండే కథ నడుస్తూ ఆ ప్రధాన పాత్ర చుట్టూ ఉన్న మనస్థత్వాలను ఆ పాత్రే classify and define చేసుకుంటుంది. కానీ కథ మాత్రం ఏకధాటిగా చెప్పుకుంటూ పోయిన కథ. ముగ్గురు మనుషుల గుణగణాల గురించి చెప్పడమే కాక ముగ్గురి కోణాల్లోంచి ఎవరెవరి మానసిక స్థితి ఎలా వుంది అనే విషయాన్ని చెప్తూనే చర్చకు తీసుకొస్తాడు. అవిటివాడైన తిరుమలకి తన వదిన చెంచమ్మకి మధ్య సాగే జీవనగీతం ఎలాంటిది అన్నది మాత్రం పాఠకుడి నిర్ధారణకు వదిలేసాడని అనిపించింది.
గోయి
ఒక మనిషి గురించి, ఆ మనిషి జీవితం గురించి పల్లియులు చెప్పుకునే కథారీతే వేరు. ఈ కథని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ కథ ఒక రచయిత చెప్తున్నట్లే అనిపించదు. ఏ చెట్టు కిందో ఎన్నటికీ ఒడవని ముచ్చటగా మిగిలిన కొందరి కథలని ఊర్లు ఎలా మర్చిపోకుండా చెప్పుకుంటాయో గోయి కథని చదివితే తెలుస్తుంది.
కోరిక జబ్బు
ఇలాంటొక monologue ని వింటూ ఇంత సహజాతిసహజంగా కథ వ్రాయడం చూసినప్పుడు కాస్త ఉత్సుకత, ఉత్కంఠ కలిగాయి. మామూలుగా చిన్నప్పటి నుండి ఆడవాళ్ళతో కలిస్తే కలిగే సుఖం ఎలాగ ఉంటుందో తెలుసుకోవాలనే ఊబులాట వయసుకొచ్చిన చాలామంది మగ(పిల్లలు)వాళ్ళకు కలుగుతుంది. ఈ అంశాన్ని తీసుకుని ప్రళయభీకరంగా కూడా వ్రాయవచ్చు. కానీ చాలా polished గా నెరేషన్ సాగింది.
కవి గూండా సామ్రాట్
చాలా satirical గా, బయటికి కనబడకుండా జరిగే సాహిత్య విషయాలు వ్రాసినట్లు అనిపించింది.
ఇతని దాదాపు కథల్లో మనం పాత్రల perspectivesని వాటి point of viewలోంచే ఆలోచించినప్పుడే అతిసాధారణంగా, సరళాతిసరళంగా వ్రాయబడిన ఈ కథలు వొట్టి అర్థంకావడమే కాక మనం ఇంతవరకూ చూడకుండా, చాలా దగ్గరగా తెలిసి కూడా అక్షరరూపం దాల్చని విషయాలని, sensitive content , వేదనా పూరితమైన మనస్థత్వం మతికి తెలిసొస్తుంది. ఇవి అతని పూర్వ స్మృతులు కావు. కానీ తన అనుభవాన్ని, తను ఉన్న society ని అక్షరం వల దాటిపోకుండా అదిమిపట్టి వ్రాసుకున్నవి. ఎందుకో కొన్నిసార్లు రష్యన్ సాహిత్యాన్ని తెలుగులో చదివితే ఎలాంటి తన్మయానుభూతి పరిఢవిల్లుతోందో అలాంటి అనుభూతి చేతచిక్కింది. ఇతని కథలు ఊటతో మొదలై నదిలా మారి సుదూర ప్రయాణం చేసి చివరికి సముద్రంలో కలవడంతో ముగుస్తాయి దాని సాంద్రత సారాంశం ఎంత విశాలమైందో తెలుసుకోమన్నట్టు. Opening lineలు కథాంత వాక్యాలు ఈ కథకుడిలో ఉన్న బలం. Prose వైవిధ్యమైన శైలి, శిల్పం పరంగా అతికించినట్టు కాకుండా సామాన్యంగా చూసినదాన్నే బాగా గరుకురాయిపైన నూరి నూరి పదును చేసిన మెరిసేటి కొడవల్లిక్కిలానే తోచాయి. ఈ కథల్లో తుప్పుతుగారం లేదనేది నా అభిప్రాయం.
చాలా చోట్ల పెరుమాళ్ మురుగన్ “Poonachi, Trial by Silence” నవలలో కథ చెప్పే నేరేటర్ గొంతు ఎలా ప్రతిధ్వనిస్తుందో ఇతని కథలు కూడా ఇతని ప్రత్యేకమైన toneని వినిపిస్తూ landmark ఉండిపోయేట్టు చేశాయి నా వరకు. శృంగారోదృత దృశ్యాలను పద్ధతిగా పాఠకుడు పరవశపోయేలా రాయడం మురుగన్ speciality. ఈ quality నాకు రచయితలో కూడా తలపించేలా చేశాయి. Story construction గురించి ఇతనిదైన చూపు నాకు కనిపిస్తుంది. వైవిధ్యమైన ధోరణిలో బాగా పరిచయంకాని కథలను, కథని చెప్పే నాడీని పట్టుకున్నందుకు రచయిత గూండ్ల వెంకట నారాయణ కు అభినందనలు. పుస్తకాన్ని ప్రచురించిన Chaaya resources centre సంపాదకులు Mohan Babu కి, అరుణాంక్ లతకి కూడా.
ప్రతులకు:
నల్ల పిల్లనగ్రోవి : గూండ్ల వెంకటనారాయణ
ఛాయా ప్రచురణ
వెల్: 120
Contact: +91 98480 23384
Thank you one and all for reading this post 😄
- లిఖిత్ కుమార్ గోదా
20.10.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి