14, సెప్టెంబర్ 2021, మంగళవారం

బాలలకో బహుమతి - వురిమళ్ల సునంద

⟾  సునంద అత్త ఇచ్చిన అందమైన బహుమతి

వురిమళ్ళ సునంద గారు రాసిన బాలలకో బహుమతి పై పుస్తక సమీక్ష



పిల్లలకి కథలు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే కథలు వాళ్ళతో మాట్లాడితాయి కాబట్టి? కథలు, పిల్లల చేతిని పట్టుకొని, ఏవేవో ఊసులు చెబుతూ ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్లి వాళ్ళు మర్చిపోలేని కొన్ని దృశ్యాలను చూపిస్తాయి కాబట్టి! వాళ్లని నవ్విస్తాయి కాబట్టి.. "అవునా, తర్వాత ఏంటి?" అనేలా పిల్లల్ని తమవైపు తిప్పేసుకుంటాయి కాబట్టి! అరచేతుల్లో జీవిత సారాన్ని చూపించి, మంచి బాట వైపు వాళ్లని నడిపిస్తాయి కాబట్టి!


వురిమళ్ళ సునంద (భోగోజు), రచయిత్రి



బడిలో చదివే పిల్లల కోసం ఎలాంటి కథలు అయితే బాగుంటాయి? ఆ ప్రశ్నకు సమాధానం ప్రముఖ రచయిత్రి, ఉపాధ్యాయురాలు వురిమళ్ళ సునంద రాసిన "బాలలకో బహుమతి" చెబుతుంది.. ఉపాధ్యాయురాలు కాబట్టి రోజూ పిల్లల్ని గమనించి, వాళ్ళ అల్లరి మనస్తత్వాలను అర్థం చేసుకుని,వారికెలాంటి కథలైతే ఎగిరి గంతులు వేస్తారో సరిగ్గా అలాంటి కథలే రాశారు సనంద అత్త. సరళమైన భాషలో, వారికి చదవడానికి తేలికగా ఉండేలా,ద్విత్వ సంయుక్తాక్షరాలు లేకుండా 14 కథల్ని రాసి బాలలకో బహుమతి పుస్తకం పేరుతో మనముందుకు తీసుకొచ్చారు. ద్విత్వ సంయుక్తాక్షరాలు లేకుండా కథలు, నవలలు చాలా తక్కువ వచ్చాయి.. డా.ఎం. హరికిషన్ లాంటి ప్రముఖ బాలసాహితీవేత్తలు ఇలాంటి రచనలు చేశారు..




ఇందులో మొదటి కథ చెలిమి విలువలో, జంతువుల పాత్రను పెట్టి, మనింటి దగ్గరో,వీధిలోనో, బడిలోనో మనం వినే "నువ్వు ఆ ఫ్రెండ్ తో స్నేహం చేయకు" అనే మాటలనే కథా వస్తువుగా తీసుకుని కథను అల్లారు.




పూర్తిగా పగలే ఉంటే బాగుంటుంది కదా ఎంచక్కా ఆడుకోవచ్చు, పూర్తిగా రాత్రే ఉండొచ్చు కదా ఎంచక్కా నిద్రపోవచ్చు అని ముద్దు ముద్దుగా పిల్లలు అడిగే కొన్ని గమ్మత్తైన ప్రశ్నలకు, మాటలకు సమాధానంగా ఓ కొత్త ఆలోచన చేసి "పగలు రేయి లేకుంటే" అనే చక్కని కథని అల్లారు. ఇలాగే "పాలు నీరు చెలిమి" అనే కథ కూడా భలే సరదాగా సాగుతూ ఆకట్టుకుంటాయి.




చిలిపి చిలుక కథలో, చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న చిలుకను పాత్రగా పెట్టి, వాళ్ళ అల్లరిని అందంగా చూపించి, తెలివైన స్నేహితులు, పెద్దలు వారి అల్లరికి చెక్ పెట్టే అందమైన నెరేషన్ ఇందులో మనకు కనిపిస్తుంది.




ఇలా ఈ సంపుటిలో అన్నీ పిల్లల్ని ఆకట్టుకునే అంశాల్ని తీసుకుని, ఎక్కువగా జంతువుల పాత్రలను పెట్టి వాళ్ళ అల్లరి మనస్తత్వాలను చక్కగా చూపించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు రచయిత్రి.ద్విత్వ సంయుక్తాక్షరాలు లేకుండా కథలు రాయడమనేది ఒక ప్రయోగంలా మనం చూడకుండా,కథల నిర్మాణం పరంగా చూస్తే పిల్లలకు సున్నితంగా ఎలా కథలు చెప్పాలో తెలుసుకోవచ్చు.పుస్తకం రూపం గురించి కొంచెం చెప్పాలి.లెటర్ సైజు(మనం A4 అని పిలిచే పేపర్ సైజ్)లో పుటలు, ఆయిల్ పేపర్ వాడి,ప్రతి పేజీలో పమ్మి ఉపేంద్రాచారి గారి అందమైన బొమ్మలతో అందంగా ముస్తాబు చేశారు. ఇలాంటి కథలు మన పిల్లల దాకా చేరగలిగితే రేపు మనం ఆశించే స్వచ్ఛమైన సమాజాన్ని చూడొచ్చు.తెలుగు బాలసాహిత్యంలో పిల్లల కోసం ఒక మంచి కథల బహుమతిని వెలువరించిన రచయిత్రి సునంద గారికి హృదయపూర్వక అభినందనలు.. బాల సాహిత్యంలో పిల్లల దాకా చేరే మరెన్నో రచనలు చేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం...

6, సెప్టెంబర్ 2021, సోమవారం

కథా శతక పద్యం - డా‌. బి.వి.ఎన్. స్వామి

  •  తెలుగు వారసులకు బహుమతి.. క.శ.ప (కథా శతక పద్యం) (పుస్తక సమీక్ష)
  • పుస్తక రచయిత:-డా| బి.వి.ఎన్. స్వామి
  • పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.


తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు, శతక పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది. కథ చెప్పుకోవడానికి కనువిందుగా ఉంటే, నీతిశతక పద్యాలలో మాత్రం నాలుగు పాదాల్లో శతక కవి ఏం చెప్పదలచుకున్నాడో ఇట్టే అర్థమైపోతాయి.


 

రెండు సాహిత్య ప్రక్రియలు కూడా నైతిక విలువలు నూరుపోస్తూ, చక్కని నడవడిని నేర్పిస్తూ, ఆలోచింపజేసే తత్వాన్ని రేకెత్తిస్తాయి.

పసి మనసుల్లో సద్గుణాలు విరబూయాలనే దృక్పథంతో ఆనాడు కథలు, సామాజిక విలువలు, చైతన్యం, ప్రజా జాగృతి రావాలనే సదుద్దేశంతో ఆనాడు శతక కవులు నీతి శతకాలను రాశారు. వేమన పద్యాలు, సుమతి సూక్తులు ఈనాటికీ ప్రతి తెలుగువారి నాలుకలపై నాట్యం చేస్తూ అందరిని రంజింప చేస్తున్నాయి.

Author:- B.V.N. Swamy 



ప్రస్తుతం నేటి బాలల్లో కథలు చదివే తత్వం కాస్తోకూస్తో ఉంది. కథల పుస్తకమో, లేదా ఉపాధ్యాయులు చెప్పే చిట్టి చిట్టి కథలుకు మురిసిపోయి గంతులేస్తుంటారు. కానీ మన వారసత్వంగా వచ్చిన అమూల్యమైన నీతి శతక పద్యాలు అంటే కాస్త చేదు భావాన్ని వ్యక్త పరుస్తారు. "ఈ పద్యాన్ని నేనెలా గుర్తుంచుకుంటాను బాబోయ్, ఈ పదాలు నేనెక్కడ పలకగలను బాబోయ్," అంటూ వెనక్కి మళ్ళి పోతున్నారు. నీతి శతక పద్యాలు అంటే కేవలం నీతి సంపదే కాదు, జ్ఞానం పదకోశ భాండాగారం. నాలుగు పాదాల్లో గొప్ప అర్ధాన్నిచ్చే మన నీతి శతక పద్యాలను పక్కన పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనది తెలుగుజాతి. నీతి శతక పద్యాలు మనకు వజ్రవైఢూర్యాలు తో సమానం. ఎంత దాచుకుంటే అంత ఉన్నతుడిని చేస్తాయి.


ఆధునిక పరిజ్ఞానం పెరగడం ద్వారా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వంటివి పిల్లల చేతుల్లోకి రావడం వలన తెలుగు పిల్లలు పద్యాలను పక్కన పెట్టేస్తున్నారు. రేపు మన శతక పద్యాలు, శతక కవులు, కమ్మని కథలు మరుగున పడిపోకూడదనే సత్సంకల్పంతో రచయిత బి.వి.ఎన్ స్వామి గారు తమ సాహిత్య అనుభవాలుతో ఈ క.శ.ప(కథా శతక పద్యాలు) అనే నిత్యనూతన కథా ప్రక్రియను సృజించారు. మన తెలుగు భాషలో కవిత్వం, కొత్త సోయగాలతో రోజుకొక ప్రక్రియగా రూపుదిద్దుకుంటున్నాయి. కానీ కథా ప్రక్రియ మటుకు "గల్పిక, కార్డు కథలు, మినీ కథలు వంటి" వేళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్యలోనే ఉంటున్నప్పటికీ కొత్తగాను, కొత్తదై పరిమళిస్తుంది తెలుగు కథా ప్రక్రియ.


తెలుగు కథా సాహిత్యానికి, నీతి శతక పద్యాలకు నూతన రూపాన్ని సృష్టించాలనే దృక్పథంతో క.శ‌‌.ప ను సృష్టించి ఉంటారని అనుకుంటున్నాను.

క.శ.ప నియమాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ఈ ప్రక్రియలో కథ ఒక కథానాయకుడు (బుంగి )చేత ఇంకో పాత్రతో , అంటే ఒకరకంగా మనతో చెబుతున్నట్లు తలపిస్తుంది. కథల్లో మనము లీనమై, బుంగీతో మాట్లాడుతున్నట్టు, కాస్త తెలంగాణ యాసను జోడిస్తూ రచయిత చిట్టి చిట్టి కథలతో, శతక పద్యాలతో క.శ.పను అల్లారు. పుస్తకం మొత్తాన్ని చూసుకున్నట్లైతే ఇందులో మొత్తం 117 కి.శ.ప లు రాయబడి ఉన్నాయి. వివిధ శతక కవులను పద్యాలను పరిచయం చేస్తూ తెలుగు జాతికి తెలియని శతకకవులును కూడా పరిచయం చేశారు రచయిత.

నియమాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది నియమాలున్నాయి.

1)ముందుగా మనం ఒక కథను అల్లుకుని, తర్వాత దానికి అనుగుణంగా ఉన్న,

2) నాలుగు పాదాలు ఉండి,

3) నాలుగో పాదం మకుటంగా రచించబడిన నీతి శతక పద్యాలను ఎన్నుకోవాలి.

4) ఇతివృత్తం ఏదైనా, ఒక అంశానికి పరిమితం అయి ఉండి, సంభాషణాత్మకంగా, రెండు పాత్రల ద్వారా కథ నడిపించాలి. అందులో మొదటిది కల్పిత పాత్ర, రెండోది స్వయంగా కథకుడే కావాలి.

5)స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేలా ఉండి, 6)పద్యంలోని మూడో పాదం లోని ఏదో ఒక పదాన్ని కథకు శీర్షికగా పెట్టాలి. ఆ పదం కథలో ఎక్కడైనా ఉపయోగించి ఉండాలి.

7) తెలుగు లోని అన్ని శతక పద్యాలను గ్రహించి ఉండాలి.

8) పద్యం ఏ కాలానికి సంబంధించినదైనా, కథలోని అంశం, భావం కొత్తదనంతో ఉట్టిపడాలి. వాస్తవ కల్పనతో వాసికెక్కాలి.

ఇవి రచయిత కరముల నుండి జాలువారిన నియమాలు.


గడిచిన సాహిత్య తరిని పరిశీలించి చూస్తే కొంతమంది సాహిత్యకారులు కథను అల్లుకుని, దానికి తోడుగా పద్యాన్ని జతచేసి క.శ.ప ను పోలిన కథ- పద్యాలు రాసినప్పటికీ అవి ఒకే శతక కర్తనో, శతక పద్యాలనో ఎన్నుకొని రాసినవి.

వారిలో బొల్లేపల్లి మధుసూదన్ రావు గారు"తాతయ్య చెప్పిన కథలు"అనే 64 బాలల కథలకు తోడుగా 64 వేమన శతక పద్యాలను జోడించి పుస్తక రూపంలోకి వెలువరించారు.

తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి బాల సాహితీవేత్తలు కూడా వేమన శతకంలోని నీతి సుధలను ఎన్నుకుని పురాణ కథలు, కల్పితకథలు అల్లారు. కానీ అవి ఏవి క.శ.ప నియమానుసారం రాసినవి కావు. అంతే కాకుండా 100 కథ-పద్యాలు పూర్తి ఎందులోనూ కాలేదు.


క.శ.ప కేవలం బి.వి.యన్ స్వామి గారి సాహిత్య అనుభవ కృషి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


"సిరిదా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరా దా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!"

అంటూ సుమతీ కంద పద్యాలు రాసిన శతక కర్త బద్దెన పద్యాన్ని ఎన్నుకొని బుంగితో "సిరి" క.శ.పను నడిపించారు రచయిత,

"వర్షాలు పడక దిగుబడి లేకపోవడంతో అప్పులు పాలైన ఒక రైతు పంటకు ఖర్చయినా పెట్టుబడిని తీర్చడానికి అప్పులు చేసి మరీ దుబాయ్ వెళ్తాడు. అక్కడ ఉదయం నాలుగు గంటలకు మొదలు రాత్రి 12 గంటల వరకు గొడ్డు చాకిరీ చేయించుకుని 12000 వేతనం ఇచ్చేవారని, వాటిలో తన ఖర్చులను సమకూర్చుకుని ఇంటికి 8000 పంపేవాడని తెలియపరిస్తాడు.

దీని వలన ఇంకా అప్పులు పాలవడంతో ఇక తిరిగి ఊరు వచ్చేసి అక్కడ ముప్పావు వంతు ఇక్కడ కృషి చేస్తే తన బాకీలు అన్ని తీరిపోతాయని అనిపించి బొప్పాయి, మామిడి తోటలు రెండు సంవత్సరాలు ఓపిక కృషిచేయగా తన అప్పులన్నీ తీరిపోయాయి"అని చెప్పడంతో కథ ముగుస్తుంది.

నేటి సమాజంలో రైతులందరూ పడుతున్న క్షోభ ఇదే. కనికరించని వరుణదేవుడు వల్లో, రసాయనాల వల్లో పంట సరిగ్గా దిగుబడి కాక అప్పుల పాలవుతున్న రైతులు బయటి దేశాలకు వలసలు పోతున్నారని రచయిత చక్కగా వివరించారు. పరాయి దేశాలు పోవడం కంటే ఉన్న ఊళ్లోనే గొప్ప సంకల్పంతో కృషి చేస్తే సిరి దానంతట అదే వస్తుందని తెలిపారు.


"పట్టు పట్టరాదు పట్టి విడువరాదు 

 పట్టెనేని బిగియ పట్ట వలయు

పట్టు వినుట కన్నా పడి చచ్చుటే మేలు

విశ్వదాభిరామ వినురవేమ!"

అంటూ వేమన పద్యం లోని సారాన్ని ఉదాహరణగా తీసుకొని నవ్వు తెప్పించే ఎలుక కథ ఒకటి భలే వివరించారు రచయిత. ఈ పట్టు కథను చదువుతున్నంత వరకు కథలో ఆ రెండో వ్యక్తి ఎవరు? బహుశా దెయ్యమా? అన్నట్టు తలపిస్తుంది మనకు." చివరికి గోడపై కనబడిందది. కర్రతో బలంగా కొట్టిన. చచ్చి పడింది ఎలుక" అని ముగించడం తో ఈ కథలో రెండో పాత్ర ఎలుకదా? అని తెలియడంతో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది ‌. నవ్వులాగవు అసలు ఈ కథ చదువుతున్నంత సేపు.


"ధనము గలుగు చోట ధర్మంబు కనరాదు

 ధర్మం ఉన్న చోట ధనము లేదు

 ధనము ధర్మమున్న మనుజుడే ఘనుడురా

లలిత సుగుణ జాల! తెలుగు బాల!"

-జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తమ తెలుగు బాల శతకం లో రాసిన చక్కటి పద్యం ఇది.

ఈ క.శ.ప శీర్షిక "ధనము.. ధర్మము".


"వ్యాపారం కొత్త దారులు తొక్కుతున్నది"బుంగి అన్నడు.

"నిజమే డబ్బే సరుకుగా వడ్డీ వ్యాపారం జరుగుతుంది". ఈ రెండు సంభాషణలు నేటి కాలంలో వడ్డీ వ్యాపారం ఎలా గంతులేస్తుంది తెలుస్తుంది. ఒకప్పుడు షావుకార్లు ప్రజల అవసరాల కోసం డబ్బులు ఇచ్చి తమ కొట్టును నడిపే వారిని. ఇప్పుడు ప్రజల అవసరాలు ని లాభంగా చేసుకుని గోల్మాల్ చేస్తున్నారని అంటాడు బుంగి.

కథలు ఇలా సంభాషణ కూడా జరుగుతుంది-

"ఆనాటి వ్యాపారులకు తాము జనం వల్ల బ్రతుకుతున్నాము అనే స్పృహ ఎక్కువగా ఉండేది. ఈనాటి వాళ్లు మా వల్లనే జనం బ్రతుకుతున్నారు అనే అహం లో ఉన్నారు"అంటూ లేచి వెళ్ళి పోతాడు బుంగి.

అలా లేచి వెళ్లిపోవడంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అసహనం మనకు తీక్షణంగా కనపడుతుంది. ఎందుకంటే బుంగి నిజాయితీ కలిగిన వ్యక్తి.


"మాటలు యీటెల వంటివి

దాటినచోనవి పెదవి ధాటిగ వచ్చున్

మాటే ప్రాణ నమంబుగా

మాటలు మాట్లాడు మంచి మన్నన మురళీ!"

అంటూ పబ్బ మురళి తన మురళి శతకంలో నుంచి గ్రహించబడింది.


ఈ కథలో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కి వెళ్లి నీకు నచ్చిన రచయిత పేరు చెప్పమంటే తప్పకుండా వస్తాడు. సాహిత్య విద్యార్థి అయ్యుండి కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు.

"పుస్తకం చదవడం, పరీక్షరాయడం, మార్కులు కొట్టేయడం ఇదే నాకు తెలుసు"అంటూ సమాధానం ఇస్తాడు.

తర్వాత కాస్త చిరాకు వ్యక్తం చేస్తాడు.

ఈ క.శ.పను జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ

పై మాటలు ప్రస్తుత విద్యార్థుల చదువులను తెలియజేస్తున్నాయి. పాఠాలు చదవడం, పరీక్షల్లో వాటికి అనుగుణంగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడమే కానీ అందులో ఉన్న సారాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని నేటి విద్యార్థులు ఎవరు గ్రహించడం లేదని చేదు నిజాన్ని వ్యక్తపరుస్తున్నారు రచయిత.

ఇలాంటి కథలు మరెన్నో ఈ ఈ కథ శతక పద్యంలో నిక్షిప్త పరిచి ఉన్నాయి. ఇవి కేవలం పిల్లల కోసం రాసిన ఏమి కాదు. ఒక సామాజిక దృక్పథంతో, సమాజంలో చోటు చేసుకుంటున్న దుర్గతులను తెలియపరచాలని సదుద్దేశంతో రాసిన క.శ.పలు. ఇవి అన్ని తరాల వారికి ఉపయోగకరం. అందరూ ఆచరణీయ కరం.

కథలు చదువుతూ పద్యాలు నేర్చుకోవడం ద్వారా మన తెలుగు భాషను కాపాడుకుని నట్లు అవుతుంది, మన జ్ఞాన భాండాగారాన్ని మరింత మెరుగ్గా, నైతిక విలువలతో కూడా మెలగడమూ తెలుస్తుంది. రచయితలందరం ఈ క.శ.పను అనుసరించి మన తెలుగు వారసులకు గొప్ప బహుమతిని అందిద్దాం. తెలుగు వాణి(శతకపద్యాలు, నీతి శతక పద్యాలు) వినిపించి తెలుగు వారిని తెలుగు వాళ్ళగా మలచి ధన్యులుగా జీవించేలా చేద్దాం. భవిష్యత్తులో తెలుగు భాషా మహోన్నతంగా విలసిల్లాలని ఆశిద్దాం. మరోమారు రచయిత కృషికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేం.


పుస్తక సమీక్షలు-4


#మొలక_న్యూస్


0609.2020.


🌱🌱80వ రచనా ప్రచురణ 🌱🌱