తెలుగు నవల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు నవల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సన్ ఆఫ్ జోజప్ప - సొలోమోన్ విజయ్ కుమార్

“జోజప్పలవారా, పిల్లోడి కోసరం, వాడి కలల జీవితం కోసరం ప్యార్దిచ్చండి”

లిఖిత్ కుమార్ గోదా 



సొలోమోన్ విజయ్ కుమార్ అనే కథలరాతగాడి గురించి అతని మునికాంతపల్లి కథలు గురించి విన్నప్పుడు తెలుసుకున్నాను. ఆ కథలపొత్తం దొరక్క ఇంటర్నెట్లో అతని కథలేమైనా దొరుకుతాయేమోనని వెతికాను. స్క్రోల్ చేయగా చేయగా సారంగలో దొరికిన మొదటి కథ “లింగ”. బాబు అనే బై సెక్సువల్ కథ అది. నాకు తెలుగు కథల వస్తు వైవిధ్యం మీద అత్యంత ప్రేమని కలిగిచ్చిన కథది. LGBTQ గురించి పల్లెటూరి నేపథ్యంలో స్పృహ కలిగించే ప్రయత్నం చేసిన కథ.

అందులో బాబు అనే పాత్ర చిన్నప్పుడు అబ్బాయిలపై ఎలాంటి శారీరక శృంగార ఇష్టాన్ని కలిగి ఉండేది, puberty వచ్చాక అతని మనసు “లింగ”(ఈ నవలిక/నవలలో కూడా అదే పేరుతో పిల్లోడి దుఃఖాన్ని అతను కోరుకున్న ఓదార్పుని ఇచ్చిన పాత్ర) అనే పనిమనిషిపై మళ్ళి, జీవితంలో ప్రేమ అర్థం తెలిసే ప్రయత్నం జరిగి, తర్వాత ఆమె దురమయ్యాక పడే అవస్థ ఆ కథలోని కథనమంతా. ఇవి రెండూ చదివిన తరువాత లింగ కథనే extend చేసి నవలిక చేసాడేమోననుకున్న. But both are different shades having a similar structured trees. 

     మునికాంతపల్లి కథలు చదివాక అందులోని “దేవగన్నిక సిత్ర”, ఈ మధ్య వచ్చిన “సిలమంతుకూరి రైలుగేటు దగ్గిర కొజ్జా”- ఈ జీవితాలు చదివాక రాతరికి తెలుగు సాహిత్యంలో పెద్దగా నమోదుకానీ LGBTQ వ్రాయాలనే బలమైన కోరిక పుట్టి ఉండొచ్చు అనే భావన కలిగింది నాకు. బహుశా అందుకేనేమో నేను ఈ సొర్ణముకి తాలూకా రాతగాడ్ని అబ్బిళ్ళిచ్చి ఇష్టపడేది. 

“సన్ ఆఫ్ జోజప్ప” నవలిక ఈ జీవితవాస్తవిక రాతగాడి మీద గౌరవాన్ని కలిగింపజేసింది. Gender sensitisation, gender studies and equality, LGBTQ community లాంటి విషయాలపై అవగాహన చాలా మందికి ఉండదు. In this society, there is a lack of interpretation about LGBTQ. Third gender అంటేనే అసహ్యం వ్యక్తంజేసే మనుషులు ఇక్కడ చాలామందే ఉన్నారు. మరి రెంటికి మించి genders ఉన్నాయని తెలిస్తే? దానికి సమాధానం చాలా సినిమాలు సమాధానాలు చెప్పాయి. వాళ్ళని, వాళ్ళ మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నంలో ‘గే’ల జీవితాన్ని— ఊహ తెలిసిన దగ్గర నుండి వాళ్ళ అస్థిత్వంపై చుట్టూ ఉన్న వ్యక్తుల అణచివేత ఎంత ఊహాతీతంగా ఉంటుందో చూపించాడు నవలాకారుడు. వసుధేంద్ర రాసిన మోహనస్వామి పుస్తకాన్ని గుర్తుకు తెచ్చింది ఈ పుస్తకం.

సొలోమోన్ విజయ్ కుమార్ కథలు పరిచయం ఉన్నోళ్ళకి ఇది ఒక పేద్ద కథతో సమానం. కానీ దీనికి నవలకి ఉండాల్సిన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నవలిక అని ఎంజాయ్ చేసాను నేను.


“ఆ సిన్న పిల్లోడిది అయోమయపు పెపంచం” అన్న opening lineతో మొదలయ్యే ఈ నవల నా జీవితంలో నాతో కలిసి చదువుకున్న కొందరు “పిల్లోల్లని” జ్ఞాపకానికి తీసుకొచ్చింది. Emphatically నాకెందుకో వాళ్ళకంటే వాళ్ళ చుట్టూరా చేరి వాళ్ళని అపహాస్యపరిచే వాళ్ళనుండే ఈ ప్రపంచంలోని దురావస్థ అర్థమవుతుంది. పెద్దోళ్ళు కోపమొచ్చినప్పుడు తిట్టే ఆడంగోడా, ఆడనాయాలా అనే పదాలు పిల్లలకు అర్థంచేసుకోలేని వయసులో స్థిరపడిపోతాయి మనసులో. అవి వివక్షకు ప్రతీక అని తెలియనితనం నుండే ఆ జెండర్స్పై అసహ్యం అనే భావన కలిగేలా చేస్తుంది ఎదిగే కొద్దీ.


చాలా దగ్గరగా చూసిన మనుషుల్ని మళ్ళీ చేతుల్లో పెట్టుకుని చదువుతున్నంత అనుభూతి. పిల్లోడు… వాడి అయోమయం, వాడు ప్రేమించిన చిత్రలేఖన కళ, వాడి చుట్టూ అర్ధం కాకుండా పెనవేసుకున్న లోకాన్ని ఆయాచితంగా వాడి కళ్ళల్లోంచే చూడాలనిపించే introduction, storytelling బావుంది. కథ వేరే వ్యక్తి, అసలు వ్యక్తి pain చూపిస్తున్నట్టే తలపించింది. రాతగాడెక్కడా చనువు తీసుకుని పాత్ర స్థితిగతులను దాటి కల్పితాలు సృష్టించలేదనే అనిపించింది.


అయితే ఇది జోజప్పని- మరణించి ఫోటోలో మాత్రమే ఉండే తన తండ్రిగా భావించి, ఎవరికి చెప్పుకోలేని కోర్కెలను జోజప్పకి చెప్పుకునే, తల్లి ఇష్టప్రకారం తండ్రికాని తండ్రి పంచని చేరి జీవితం అణచబడి, ప్రేమల్ని, ప్రేమికుల్ని వాళ్ళ స్వార్థాల వల్ల తను కోరుకునే ఓదార్పు, అసలైన ప్రేమ దొరక్క చతికిలపడే పిల్లోడి కథ మాత్రమే కాదు. అతను కేంద్రీకృతమై, అతని చుట్టూ పెనవేసుకుపోయిన ఆధునిక జీవన మార్పులు, పిల్లోడి పక్కన పాత్రలు గమనిస్తే తెలుస్తాయి. కామమనేది ఎన్ని రూపాలలో పిల్లోడికి ఎదురైందో అది ఈ పూర్తి ప్రపంచానిది. మనం దాన్ని అంతర్గతంగా అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటాను. తన జెండర్ గురించి ఎప్పుడూ బాధ పడే పిల్లోడికి తనకి మాత్రమే కాకుండా మగవాళ్ళ కోరిక తీర్చుకోవడానికి మగపిల్లలని ఎలాంటి ఆశలు చూపిచ్చి లొంగబరుచుకుంటారో “పొండోడి పాత్ర” ద్వారా తెలిసింది. అలా వాడి కళ్ళెదుట నగ్నంగా నిలబడి సమాజం చీదరించుకునే నిజాలు, జీవితాలు, interpretations ఎన్నో ఉన్నాయి. A short and superb novella.

"People love talking, and I have never been a huge talker. I carry on an inner monologue, but the words often don't reach my lips."

~Gillian Flynn (Gone Girl)


ఈ quote పిల్లోడి స్థితిని వ్యక్తపరుస్తుంది వాడు స్వతహాగా initiate చేద్దామనుకున్న చోటల్లా. 

కానీ అది జరగదు. అలా ఎందరో ఇక్కడ. 


చివరిగా (అ) సంపూర్ణం అని రాశాడు కాబట్టి ఆ పిల్లోడి జీవితం Brokeback mountain సినిమాల ఉంటుంది అని నా వరకు ఒక ఊహ కల్పించుకుంటాను.


This raconteur has his own dexterity to shape up a social and debatable novel. 

ఈ నవలిక గురించి చాలా చెప్పొచ్చు కానీ చదివి అర్థం చేసుకోవడం మనుషుల్లోకి ఇంకేలా చేస్తుంది.

పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో, ఛాయ స్టాల్ 76 లో లభిస్తుంది. 

వెల: ₹100(బుక్ ఫెయిర్ ఆఫర్) అసలు ₹125

కాంటాక్ట్: 

ఛాయా మోహన్ బాబు

98480 23384

 

16.02.2024

12, డిసెంబర్ 2023, మంగళవారం

జీరో నెంబర్- 1 : మొహమ్మద్ గౌస్

 ఫిక్షన్ టెక్నిక్ తెలిసిన నవల “జీరో నెంబర్ - 1”

లిఖిత్ కుమార్ గోదా. 

•••



“I just knew there were stories that I wanted to tell” - Octavia E. Butler

జీరో నెంబర్ 1 - నవలా రచయితగా మొహమ్మద్ గౌస్ రాసిన మొట్టమొదటి నవల ఇది. చికెన్ షాపు నడుపుకుని బతికే సూరిగాడి కథ. అతని కథలో కులాన్ని తొడుక్కుని గుండాగిరి చేస్తూ పైకి అందరిలో భయం వల్ల మర్యాదింపబడే బాబు, అతడి గూండాలు, అతడి సహచరుడు జయరాం, బాబు చేసే అన్యాయాలలో పరజనులతోపాటు సొంతింట్లో చావుబతుకుల మధ్య నలిగి చివరికి సూరిగాడి చికెన్ షాపులోని సీక్రెట్ రూంలో(అది బ్రిటిష్ ప్రభుత్వం కాలంనాటి దాని రచయిత అంటాడు) మూడు వారాలు తలదాచుకున్న శశికళ, ‘మట్టసంగా’ కథ సుఖాంతానికి తోడ్పడే ముసిలాయప్ప అలియాస్ పెదయ్య(కేశవరెడ్డి నవలల్లో మధ్యలో ప్రవేశపెట్టబడే Story changing characters - చివరి గుడిసె నవలికలో “బైరాగి”, స్మశానం దున్నేరులో వ్యాసదేవలాగా) . మొత్తానికి తనకు చెప్పాలున్న కథనే వైవిధ్యమైన రీతిలో రాశాడు. మన కళ్ళముందే సాధారణంగా నడిచే సూరిగాడు లాంటి చికెన్ షాపు వ్యక్తి కథను ఫిక్షన్లోకి తేవడం బావుంది.


Novel పఠన ప్రారంభం నుండి ఆఖరి వరకు సులువైన readability ని కలిగించింది. నవలలో కావాల్సిన Story telling, Twist set-up, Narration link-up, Utilizing the fictional elements (తను క్రియేట్ చేసిన సీక్రెట్ రూంలో తన శత్రువవుల కథను ముగించడం), Clarification చాలా స్పష్టంగా ఉండి, మెళుకువలు ఎక్కడెక్కడ technical గా వాడాలో అలా వాడినందుకేమో చక్కగా కాలక్షేపం అయ్యింది. 


సెకండ్ చాప్టర్ ప్రారంభంలో నేతపని గురించి ప్రస్తావించినప్పుడు - తన “గాజులసంచి”లోని కథ “మా అన్నకి మగ్గానికి పడల్యా” గుర్తుకొచ్చింది. తనకున్న, కావాల్సిన సోర్సలని వాడడం, ముఖ్యంగా తన ప్రాంతపు మాండలికం నవల నచ్చేలా చేసింది. నిజానికి ఇదొక మంచి ఆరంభమని చెప్పొచ్చు ఈ నవలాకారుడి నుంచి.


నవల ఎందుకు రాయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు జవాబు బ్యాక్ కవర్ పేజీపై ఇలా రాసుకున్నాడు:

“… కొన్ని కట్టడాలను, ఊర్లను చూసి వాటి విశేషాలను గమనించినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన కథ జరిగి ఉండే అవకాశం ఉంది కదా అనిపించడం మొదలైంది. అలా నేను చూసిన ఒక ప్రదేశం నాకు ఇలాంటి ఆలోచనే కలిగేలా చేసింది. అయితే అలాంటి కథలేవీ అక్కడ జరగలేదని తెలిసాక నేనే నాకు నచ్చినట్టు ఒక కథ రాసాను. ఇప్పుడా ప్రదేశంతో పాటు నాకు ఈ కథ కూడా గుర్తుంటుంది.”

- మొహమ్మద్ గౌస్


“If you don't see the book you want on the shelf, write it.”

-Beverly Cleary


“If there's a book that you want to read

But it hasn't been written yet

you must be the one to write it”

Toni Morrison, American English Novelist

 ఈ రెండు కొటేషన్స్ రచయిత రచనలపై తన ఇష్టాన్ని, రాయడానికి గల కారణాలను బలపరుస్తాయి. ఇంకా ముందుముందు Mohammad Gouse మెరుగైన రచనలు రాస్తాడని ఆశిస్తున్నాను.


Contact: Chaaya Mohan Babu +91 98480 23384

16, జనవరి 2023, సోమవారం

మాన-భంగం- బాలాజీ ప్రసాద్

 ప్రస్తుత శారీరక అఘాయిత్యాలపై మాట్లాడే 
'మాన- భంగం' నవల

~

"The object of the novelist is to keep the reader entirely oblivious of the fact that the author exists, even of the fact that he is reading a book"

- Ford Madox Ford




తెలుగు లిటరేచర్ లో డిటెక్టివ్ (ఇన్వెస్టిగేషన్) తరహాలో నేను చదివిన మొదటి నవల ఇది. ‌ రకరకాల సమస్యలతో తనామునకలవుతున్న ప్రస్తుత సమాజంలో మనుషుల్ని భయంకరంగా బాధపెట్టేవి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు- అత్యాచారాలు. రేప్ - ఒళ్ళు గొగ్గురుపొడిచే పదం. మానసిక స్థితిని కుళ్ళపొడిచే పదం. చాలామంది కుర్రకారు మగాళ్లు ఆడవాళ్ళ మీద అత్యాచారానికి ఎందుకు పాల్పడుతున్నారు? ఈ ప్రశ్న ఈ నవలలో రకరకాల రేప్ల మీద పరిశోధన చేస్తూ పుస్తకం రాస్తున్న ఇన్స్పెక్టర్ మాధవ్ లోనే కాదు మనలోనూ మొదలవ్వాలి.


విచక్షణ కోల్పోయి, వావివరసలు మర్చిపోతూ ఆడపిల్లల్ని శారీరక అఘాయిత్యాలకు ఎందుకు బలి చేస్తున్నారు ఈ దేశంలో. ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉండే నివారణ కావాలి. ఇంటిదగ్గర తల్లిదండ్రులచే 'గుడ్ టచ్- బాడ్ టచ్' గురించి ఆడపిల్లలతో మగ పిల్లలెలా మసులుకోవాలి? మగవాళ్ళతో ఆడపిల్లలు ఎలా నడుచుకోవాలో ఇంటిదగ్గరే తల్లిదండ్రులు వివరంగా చెప్పాలి. బడిలో ఇంటి ఆవరణలోనూ ఎలాంటి సమస్యలు పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలి.

★★★

నవలా కథనం ప్రకారం:-

ఓపెనింగ్ చాప్టర్ ప్రియా అనే స్నేక్ క్యాచర్ సుబ్బారెడ్డి పొలంలో పాము పట్టడంతో మొదలవుతుంది. తన భర్త మాధవ్ పోలీస్ ఆఫీసర్. వాళ్ళు ఉండే ఊరి దగ్గరి బ్రిడ్జి కింద శవం కనబడిందని కూతురు యోగితాని కాలేజ్ కి డ్రాప్ చేయడానికి వెళుతున్న మాధవ్ కి మంగమ్మ, నాగయ్య ద్వారా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అది ప్రకృతి అనే అమ్మాయి శవమని, ఆమెని రేప్ చేశారని, తర్వాత బ్రిడ్జి కింద పడేశారని పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. హంతకుడు ఎవరో తెలుసుకోవడమే మాధవ్ వెతుకులాట.


మాధవ్ రకరకాల రేప్ ల మీద ఒక పుస్తకం కూడా రాస్తుంటాడు. మాధవ్ తన కొలీగ్స్ పురుషోత్తం, వనజలు కలిసి suspects ని ఎంక్వయిరీ చేస్తారు. ఎదురింటి కుమారస్వామిని, బాయ్ ఫ్రెండ్ దుర్గాప్రసాద్ ని, ఆఫీసుకు పగడాల సత్యాన్ని, బాబాయ్ వరసయ్యే ధర్మేంద్రని ఇలా తన ఎంక్వయిరీలో ఒక్కో కొత్త కోణంలో ప్రకృతి అత్యాచారానికి చిన్నప్పుడు నుండే ఎలా బలైపోయిందో చెప్తాడు. ఈ కేసు గురించే పురుషోత్తం మాధవ్ లు ఇద్దరు గొడవలు పడుతుంటారు.


ప్రకృతిని గురించి ఆలోచిస్తూ తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి తనపై జరిగిన మూడు అత్యాచారాలు అతన్ని వదలని దెయ్యాలయి, తన జీవితం మీద ఎంత ప్రభావం చూపాయో ఒక చాప్టర్లో చెప్తాడు‌.


చివరికి తన భార్య ప్రియ ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాముల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం చెప్పినప్పుడు మాధవ్ కి ఈ కేసును ఎలా డీల్ చేయాలో స్ఫురణకు వస్తుంది‌. ఆకలితో తను పెట్టిన గుడ్లని చూడకుండా,తన పిల్లలి కూడా చూడకుండా కన్నపామే తినేసినట్టు తండ్రి సుబ్రహ్మణ్యమే కూతురు ప్రకృతిని అత్యాచారం చేసి పిడిగుద్దులతో చంపి తన చాపర్ లోనుండి బ్రిడ్జ్ కిందికి పారేశాడని.


ఇలా ముగుస్తుంది నవల. 

★★★

మనుషులు మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయో వివరించిన సంఘటనలు ఉన్నాయి. సమకాలీనంగా అత్యాచారాలపై వస్తున్న తెలుగు సినిమా చూసినంత ఫీలింగ్ కలిగింది. తీసుకున్న వస్తువు, శిల్పం చాలా మటుకు దేనికి తగ్గ ఫ్లేవర్ దానికి వాడి ఆకట్టుకునేలా రాశాడు.



With the Author: Balaji Prasad 

ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయాలు 

1. ఇన్వెస్టిగేషన్ మోడ్లో నవల నడిపించడం. 


2. మాధవ్ బాల్యంలో అత్యాచారానికి గురవడం. ఆడవాళ్ళు ఎక్కువ శాతం రేపులకు గురవడం మనం చూస్తూ ఉంటాం. కానీ మగపిల్లలను కూడా మగవాళ్ళు తమ శారీరక వాంఛకు ఎలా లొంగ తీసుకుంటారో చెప్తుంది మాధవ్ చిన్నప్పటి పాత్ర. ఇలాంటి సంఘటనలు మనం ఇంగ్లీష్ లిటరేచర్లలలోనూ, సినిమాల్లోనూ తరచూ చూస్తూ ఉంటాం. కానీ పెద్దగా దృష్టి పెట్టం.


3. ప్రియ పాత్ర. ఒక నవలలో మొదటి నుండి ఒక పాత్ర గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటే ఆ పాత్ర ద్వారా రచయిత ఏదో ఒక విషయాన్నో, ఉపయోగాన్నో తెలియజేయాలనే చిత్రీకరిస్తాడు. ఈ నవలలు opening protagonical character స్నేక్ క్యాచర్ ప్రియది. రచయిత స్నేక్ క్యాచింగ్ చేసే ప్రియ ద్వారా ఏ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. Investigation తరహాలో నడుస్తున్న ఈ నవలలు ప్రియ పాత్ర స్నేక్యాచార్ గా ఎందుకు ప్రత్యేకంగా పెట్టాడు అని ఆలోచన. మాధవ్,ప్రకృతి మరణం విషయంలో ఎంతమందిని ఇన్వెస్టిగేషన్ చేసిన అంతుచిక్కని చిక్కుముడి చివరికి ప్రియ వల్ల వీడిపోతుంది. ప్రియ పాత్ర అక్కడ ఉపయోగమైంది. Major గా, Minor గా పాములు గురించి, పాములు మనస్తత్వం కలిగిన మనుషుల గురించి చైతన్యం తేవడం.

★★★

సోలోమోన్ విజయ్ కుమార్ రాసిన మునికాంతపల్లి కతల్లో 'యానాది సెంచయ్య ' ఒకటి. యానాదుల జీవన విధానంలో ఉపాధికి ఉపయోగపడే తత్వం పాటలు, వివిధ వేషాలు వేసుకొని (మగాళ్లు కోకా రైకా కట్టుకొని) ఆడవాళ్లలా యాక్షన్ చేయడం భలే విచిత్రమైన విషయంగా తోస్తాయి. డా. కేశవరెడ్డి చివరి గుడిసె నవలలో కూడా వాళ్ల జీవనం వెనుకున్న కన్నీటి సంఘర్షణ, తత్వం పాటలు పాడిస్తూ అవగతం చేస్తాడు. అలాగ, రచయిత బాలాజీ ప్రసాద్ కూడా యానాది జీవితాలను దగ్గరగా చూపించాడు. ఇందులో రచయిత పరిశీలనా పరిశోధనా నవలా రచనలో పడిన శ్రమ కనిపిస్తుంది. ఇందులో తత్వం పాటలు ఆకర్షణంగా అనిపించాయి.


'వాలు కళ్ళ ఒక చిన్నది.. దాని నెత్తిన ఒక కడవంట 

కాలు జారిపాయ.. కడవ పగిలి పాయా

నీళ్ళు పారిపాయా.. చిన్నదాని గుండె నిరమళ మాయ 

మాయా సంసారం ఇదేరా.. కలి మాయా సంసారమిదేరా'


యానాది జీవుల మౌఖిక సాహిత్యాన్ని కొంతలో కొంత నైనా లిఖిత సాహిత్యంగా మార్చి నిక్షిప్తపరిచేలా చేయడం హర్షించదగ్గ విషయం.


పల్లెల్లో మమేకమైన జీవితాలని చిత్రించడం కూడా బాగుంది. అందులో మిడియాళం పాత్ర కడుపుబ్బా నవ్విచ్చేలాగా ఉంది.

నా అభిప్రాయాలుగా రచయితకి కొన్ని సూచనలు ఇవ్వదలిచాను.

Tautology

'గాలిదేవుడు ఇసనకర్రతో ఊపినట్టు పొడబారిన చేలంతా జోరున గాలి'. ఇక్కడ ప్రస్తావించేదంతా గాలి వీస్తోందని. కానీ గాలికి సంబంధించిన అర్థాలను ప్రతీకలను రెండు మూడు సార్లు వాడటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. భావం,వర్ణన కోసం వాక్యాన్ని తారుమారు చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటివి ఈ నవలలు స్వల్పంగానే ఉన్నాయి. వీటిపై దృష్టి సారిస్తే మంచిది.(పేజీ నెం: 92:1:1)


అలాగే భాషను నడిపించే తీరులో ఒకసారి స్పష్టత కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. భాష ఎక్కడ సరళంగా ఉండాలో, ఎక్కడ మాండలికంలో ఉండాలో బాగానే చూసుకున్నాడు. కానీ ఒక్కోసారి సరళమైన వాచ్యంలో చెబుతూ, అదే క్రమంలో యాసని మాండలికాన్ని కలపడం వల్ల చదవడానికి వెసులుబాటుగా అనిపించక కాస్త ఇబ్బంది కలిగింది.


కొంచెం clarity కానీ విషయాలు

మాధవ్ తండ్రి యానాదయ్య ఎలా మరణించాడు? పోలిరెడ్డి కొట్టినందుకా? అవమానం వల్ల? అవసరమైన కాకపోయినా ప్రస్తావన క్లారిటీ ఇవ్వలేదనిపించింది. ఇవేం పెద్ద మిస్టేక్స్ ఏమీ కాదు. ఒకసారి దృష్టి సారిస్తే మంచిది. ‌

మొత్తానికి ఈ నవల ద్వారా ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఎలాంటి సెక్స్ అండ్ సైకాలజీ ఎడ్యుకేషన్ నేర్పాలి? తల్లిదండ్రులు చిన్నప్పటినుండి తమ పిల్లలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తో పాటు విక్టిమ్ బ్లేమింగ్ అన్న విషయాలు అవగాహనకు తీసుకురావాలి అనే వాటిని మనముందుకు తెచ్చి పెట్టి ఆలోచించమంటాడు.


ఒక చోట -


మనుషులు సెక్స్ విషయంలో తెలీయకుండా నిగ్రహం ఎందుకు కోల్పోతారు. ఆ సమయంలో ఆడ, మగ ఆక్రోశం తీర్చుకోవాలని ఎందుకు చూస్తారు. పిల్లల మీద, ఆడవాళ్ళ మీదనే ఈ అఘాయిత్యాలకు ఎందుకు పాల్పడతారు. వాళ్ళు బలహీనులు అనా? వాళ్ళ కన్నా బలవంతులు ఐతే వాళ్ళ అహన్ని అణగార్చుకోడానికి వీలు కాదనా?. ఆ లెక్కన ప్రతిఒక్కరిని గెలుచుకోవాలని అనుకుంటారు కదా? తనా మనా అనే భేదాలు లేకుండా బంధాలు మరిచి కోర్కెలు తీర్చుకోవాలని అనుకుంటారు కదా. అవకాశం ఉండదు కాబట్టి అలా చేయలేకపోతున్నారా? ఒకవేళ అవకాశమే ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఆ రెండుక్షణాల క్షణికావేశానికి అంతలా ఎందుకు పాకులాడుతారు? ఆ రెండుక్షణాల క్షణికావేశం తర్వాత ఏముండదు.. దాని వల్ల ఘోరం జరిగిపోతుందనేంత తెలీని అజ్ఞానంలో ఉంటారా? తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి…


ఈ ఉద్వేగం, సంఘర్షణ రచయితవి.ఆ కోపంలోంచే ఈ నవల రాశాడనిపిస్తుంది రచయిత. మంచి సోషల్ అవేర్నెస్ తో, మంచి కథనంతో బాగా రాశాడు నవలని. యువ రచయితలు ప్రస్తుత సమాజం మీద, మార్పు మీద దృష్టి పెట్టారనడానికి ఈ నవల ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇంకా రాయాలని ఆశిస్తున్నాను. అభినందనలతో -

లిఖిత్ కుమార్ గోదా,

ఐ.ఎం.ఏ- తెలుగు - ద్వితీయ సంవత్సరం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

ఫోన్:- 9640033378