9, ఆగస్టు 2022, మంగళవారం

'ఆ' ఇద్దరు - తిరునగరి వేదాంతసూరి

 ⚫'ఆ' ఇద్ద(రి)రు గురించి తాతయ్య అనేక ముచ్చట్లు 




'Children see magic because they look for it.'

     ఈ బుల్లి నవలను చదివాక నాకు అమెరికన్ రచయిత Christopher Moore అన్నది నిజమే అనిపించింది. పిల్లల ప్రపంచం ఏమై ఉంటుంది. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తారు. ఎక్కడ సంతోషంగా ఉంటారు. ఏ పనిని ఇష్టంగా చేస్తారు. ఇవన్నీ ఈ నవలలో చెప్తాడు రచయిత టి‌.వేదాంత సూరి. ఇలా మనుమల కోసం తాతలు రాసిన పుస్తకాలలో ఇది నేను చదివిన రెండో పుస్తకం. మొదటిది ఖమ్మం కి చెందిన బెల్లంకొండ ప్రసేన్ రాసిన 'క్షమ కావ్యం' అనే 'చిట్టి కవితల పుస్తకం'. 


     ఒక తాతయ్య తన మనవరాలు గురించి, వాళ్లు పెరిగిన ఆక్లాండ్ (న్యూజిలాండ్) అనే ప్రదేశపు పరిస్థితుల గురించి, అక్కడ జీవన విధానం గురించి, అక్కడ పిల్లల పట్ల చూపించే బాధ్యతను గురించి, మన దగ్గర మారాల్సిన వ్యవస్థ తీరుని గురించి ముచ్చట్లాడే  నవల. ఈ నవలని సీరియల్ గా టి వేదాంత సూరి గారే ఆయన నడిపే 'మొలక న్యూస్' అనే వెబ్ మ్యాగజైన్లో రాశారు.రచయిత మనవరాళ్లయిన ఆద్య(4 ఏళ్లు),ఆరియా(2 ఏళ్లు) చుట్టూరా ఈ నవల సాగుతుంది.


     పిల్లల మనస్తత్వాలు, వాటికి చిగురించే నూతన ఆలోచనలు, వాటికి చిన్న వయసు నుంచే ఎలాంటి పద్ధతులు, పరిసరాలు అలవాట్లు చేయాలో చెబుతారు. పిల్లల పరిశీలన ఎంత చురుగ్గా ఉంటుందో ఒక సంఘటనలో చెబుతారు రచయిత. అది చదువుతుంటే భలే ఆశ్చర్యం వేసింది. పెద్దోళ్ళు పాటించాల్సిన జాగ్రత్త అర్థమైంది.


    ఆద్య,ఆరియా చేసిన ప్రయాణాలు గురించి పూసగుచ్చినట్లు ఎలా చెబుతారో ఇందులో చెబుతారు. ప్రకృతిని, జంతువుల్ని చిన్నప్పుడు నుండి పిల్లలకు అలవాటు చేయడం ఎంత అవసరమో వివరిస్తారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని సంఘటనలో వివరిస్తారు. ఆద్య చిన్న వయసులో రకరకాల ప్రశ్నలతో ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాసలను గురించి చూపిస్తాడు. ఆరియా ఆటల్ని, మనుషులకు ప్రేమపూర్వకంగా ఎలా హగ్ ఇవ్వడాన్ని ఇష్టపడుతుందో చెప్తారు. అప్పుడప్పుడే ముద్దు ముద్దుగా నేర్చుకుంటున్న మాటల్ని ఆరియా ఎలా పలుకుతుందో అన్న విషయాలు, చీమతో ఎలా ఫోన్లో మాట్లాడింది అన్న విషయం, పిల్లలకున్న ఆసక్తిని, కొత్త ఊహల్ని మనం నవ్వుకుంటూనే అర్థం చేసుకోగలుగుతాం ఈ పుస్తకం చదివితే. 

     'Every happy memory created for a child is another treasure of a lifetime' 

- Donna Marie.

ఇది నిజంగా ఆ మనమరాళ్లకి లైఫ్ టైం మొత్తం నిధే.


    చాలా వివరంగా మనవరాళ్లకే కాకుండా, పాఠకలోకానికి మంచి బుక్ తో బహుమతిని ఇచ్చారు రచయిత.

~

లిఖిత్ కుమార్ గోదా. 


Today this article has published in Molaka News


మొలక న్యూస్ 


 ⚫

‘ఆ’ ఇద్దరు

బాలల నవల

రచన: టి.వేదాంతసూరి

ప్రచురణ: జనవరి 2022

వెల: రూ. 100

ప్రతులకు: ప్రసన్​ పబ్లికేషన్స్​, 1‌‌–9–319/1/1/జి2, విద్యానగర్​, హైదరాబాద్​ – 500044

ఫోన్​: 9848992841

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి