28, జూన్ 2022, మంగళవారం

మునికాంతపల్లి కతలు - సోలొమోన్ విజయ్ కుమార్

 Cuddled Book - 1


ఇళ్లబుచ్చోడు జెప్పిన 'మునికాంతపల్లి కతలు'



 

"The secret of the Great Stories is that they have no secrets. The Great Stories are the ones you have heard and want to hear again."

- Arundhati Roy 


    ఇప్పుడు నేను చెబుతున్న 'మునికాంతపల్లి కతలు' అనేటి పేరుతో పుస్తకం రాసిన సోలొమోన్ విజయ్ కుమార్ కతలకి, పైన కోట్ చేసిన అరుంధతీ రాయ్ కొటేషన్ కరెక్టనే అనుకుంటున్న. అవును. ఈ కతలు నన్ను మళ్ళీ మళ్ళీ చదివించాయి. మళ్ళీ వినాలనిపించేలా చదివించాయి.


   ఫేస్బుక్ లో ఈ పుస్తకం మీదొచ్చిన సమీక్షా వ్యాసాలు చదివి ఏంటి పుస్తకం గొప్పతనం అనుకున్న మొదట్లో.

   సారంగలో నేను చదివిన 'ఎంగిలోడు' కత, ఈ పుస్తకంలో లేని 'లింగ' కతలు చద్వి, 'అరె! వాళ్లూరి కతల్ని భలే రాసిండే ఈ మనిషి. అచ్చం నేను మా ఊరి మట్టిలో, మనుషుల్లో తిరుగాడినట్టుందే కొన్ని కతల్లో!' అననుకున్న. అన్న గూండ్ల వెంకటనారాయణ మాట్లాడినప్పుడల్లా ఈ కతల గోలే నా చెవుల్లోకి ఊదేవాడు 'మనిషి కతలు' చదవమని.


Solomon Vijay Kumar , Author 


    చాలా బాధలు దిగమింగుకుంటూ, కొన్ని ప్రేమల్ని గాయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ,అచ్చమైన స్వచ్ఛమైన వాళ్లూరి భాషని, ఆ మునికాంతపల్లి జీవితాన్ని కళ్లముందు ఆరబోశాడు.


   'ఇంటికి ఏంజలొస్తుండాది ' మొదలు ' ఇళ్లబుచ్చోడు ' కతల దాకా ఉన్న 22 కతలల్లో కొన్ని కతల్లో నవ్వుకున్న, కొన్ని కతల్లో కన్నీళ్లు బెట్టుకున్న, కొన్ని కతల్లో ట్విస్ట్లు జూసి,'అబ్బా! జీవితాలు ఇలా గూడా ఉంటాయా!' అని నోరెళ్ళబెట్టా.

   మనం బాగా ఎరిగిన కొన్ని జీవితాల గురించి నామోషీగా ఫీలయ్యి రాయము. కానీ ఈ మనిషి భలే రాశాడు.

   Readability విషయంలో కతలు నెల్లూరు మాండలికంలో ఉన్నప్పటికీ ఎటువంటి అడ్డంకి లేకుండా సాఫీగా చదివిచ్చుకుంటూ పోతాయి.  


    ఫాతిమా,అవ్వ చెప్పిన వాన కత, పురుషోత్తం మావ బాప్తీసం,ఎంగిలోడు నాలో దుఃఖాన్ని నింపిన కతలు.


   'దేవగన్నిక సిత్ర' కతలో కొన్ని డైలాగులు ఒక లెవెల్లో నవ్విస్తే, ఎండింగ్ ఊహకి అందనంత విషాదాన్ని నింపింది.


   అవ్వ చెప్పిన వాన కత,నక్కలోల్ల బిజిలీ,మొండిగుద్దల వొవదూత,దేశదిమ్మరి కాశయ్య వంటి కతలు సాధ్యమైనంత వరకూ ఇతర భాషల్లోకి, ఎక్కువగా విదేశీయులకు అనువాదం కావాల్సిందని నాకు అనిపించింది.


    మనలో చాలా మంది ఇందులో బూతులు రాసాడు కాబట్టి ఇవి పరమ,అసహ్య కతలని వాపోవచ్చు. కానీ నాకైతే ఇవి నచ్చాయి. బూతుల్లేకుండా నేనూ మా ఊర్నెప్పుడూ చూడలేదు. మనం బూతులు అని ఎత్తిచూపుతున్న వాక్యాలు అనాదిగా జానపదుల నోళ్ళలో నానిన భాష. బహుశా అందుకే ఇవి కొత్తవీ,పాతవీ,తిరుగులేని కతలనిపించింది.


   చివరిగా ఈ రచయిత చివరి అట్ట మీద రాసుకున్న Blurb చదివితే,

    "ఇవి కథలు కావు. అనగా కథ అనే ప్రక్రియను గురించి లాక్షణికులు ఏవైతే చెబుతారో ఆ లక్షణాలను అనుసరిస్తూ రాసినవి కావు. ఎందుకంటే జీవితం అనేది ఏ ప్రక్రియను అనుసరిస్తూ నడవదు కనుక ప్రక్రియ ఏదైనా జీవితాన్ని, ఆ జీవితం ఎలా ఉందో అలా ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుసరించాలని నా వ్యక్తిగత స్థిరాభిప్రాయం...' అంటాడు.

    ఓ పద్ధతిని ఫాలో అయ్యి రాసుంటే మాత్రం ఇవి ఇంతగా ఎఫెక్టీవ్గా ఉండేవి కావేమో! ఎలాంటి నియమాలు నిబంధనలు ఫాలో కాకుండా రాయబట్టే కథా లేఖనలో కొన్ని కొత్త దారులు చూపించినట్టు అనిపించింది. బహుశా అదే రచైత Technique కావచ్చు. కతలనిండా మనుషుల్ని ప్రేమించే వ్యక్తి (రచైత) ఇంకా మరెన్నో సజీవ కతలు రాయాలని ఆశిస్తున్నాను.

~

లిఖిత్ కుమార్ గోదా. 

28-06-2022


Social Media

Facebook (My Timeline)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి