21, డిసెంబర్ 2022, బుధవారం

మొలకల పున్నమి - వేంపల్లి గంగాధర్

➦ రాయలసీమ బతుకు దర్పణం - మొలకల పున్నమి




బతుకు నిండా కన్నీళ్ళు ఉన్నాయి అని చెప్పడం కంటే ఆ కన్నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో, ఎలా జీవితాలని నడిపిస్తున్నాయో, కుదిపేస్తున్నాయో, ఎవరిచేత ఆ కన్నీళ్ళు రాలుతున్నాయో, ఎవరు బాధింపబడుతున్నారో,ఆ కన్నీళ్ల వాసన,రంగు,రాలిన విధానం… ఇవన్నీ చూపుడువేలితో  రచైత చూపించాలి. పీడిత వర్గాల వైపు నిలబడి,తమ ప్రాంత జీవన విధానాన్ని,భాషా పలుకుబడిని,ఈ రాజ్యంలో స్థితి ఇదేనన్న ముద్రను తుడిచిపెట్టి ఎవరూ చూడని కొత్త కోణంలోంచి కథలు రాస్తే అదే మంచి సాహిత్యం అని నా ఫీలింగ్.
రాయలసీమ ప్రాంతం నుంచి చాలానే సాహిత్యం వచ్చింది. అక్కడ జీవనశైలి, వర్షాలు లేని దుస్థితి, మనుషులు, వాతావరణం ఇవే ఎక్కువగా రాయబడ్డాయి.
కరువు కాటకాలు మధ్య కుక్కబడ్డ జీవితాలుగా, ఫ్యాక్షనిజం ప్రవహించే ప్రాంతంగా పరిగణించే రాయలసీమ ప్రాంతంలోంచి ఎవరికి తెలియని కోణాల్లో చూడగలిగిన కథలు వేంపల్లి గంగాధర్ రాసిన 'మొలకల పున్నమి'. 2011కు గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. మొత్తం 13 కథలు. ఒక్క కథలో protagonist చెప్పే ముచ్చట్లు అలివిగానివి. ప్రతీ కథలో చిత్రించే వాతావరణం, కథా శైలి, సంఘటనలు, ఎత్తుకు పై ఎత్తులు, narration కళ్ళు మూయనివ్వవు.
రచైత రచనా పద్ధతి ఎంత సౌందర్యాన్ని పరిమళింపజేస్తుంది. Poetical line లు వాడుతూ, రాయలసీమ ప్రాంతంలో మాట్లాడే డైలక్ట్ ని పాత్రల్లోకి ఒంపి కథను వర్ణించే తీరు ఒక elixir ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాగ కథ రాయడంలో నాకు సమ్మెట ఉమాదేవి గారు,గోపిని కరుణాకర్ బాగా ఇష్టం. కథని కవితాత్మకంగా నడపడం గొప్ప టెక్నిక్.
*
'యామయ్య సామి గుర్రం' వేసుకుని ఏ ఊరికి వెళ్ళి అక్కడ ప్రదర్శన చేస్తే అక్కడ మోడాలు (మేఘాలు) కరిగి వర్షం కురుస్తుందన్న ప్రజల విశ్వాసాన్ని చిత్రించాడు. ఆ విన్యాసాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
Love stories లో 
నాకు ఫేవరెట్ గా మారిన కథల్లో 'శిలబండి', 'మొలకల పున్నమి' కతలు. శిలబండి కథ చదువుతూ ఉంటే నాకు గోపిని కరుణాకర్ రాసిన 'బారతం బొమ్మలు' కథల సంపుటిలోని 'కానుగపూల వాన' గుర్తొచ్చింది. గుండెల్ని తడిగా మార్చిన కథ. ఊహకు అందకుండా నడిచే ఇంకో ప్రేమ కథ 'మొలకల పున్నమి'.
రైతుల అవస్థ గురించి కథల్లో ఏదోక సందర్భంలో, సంఘటనలో మాట్లాడతాడు. అందులో ఆధునికతకు దగ్గరగా అనిపించిన కథ 'మూడు పదున్ల వాన'. రైతు కన్నీళ్ల రుచి చూపించింది.
డేగల రాజ్యం కథలో రాజకీయాలు రాయలసీమలో తెచ్చిన వ్యధలు,వధలు పూసుగుచ్చినట్టు చెప్తాడు. ఎవరు ఏనుగులు మీదకెక్కడానికి ఎన్ని చిన్నెలు వేస్తారో,బలయ్యే వర్గాలు ఏమిటో బలంగా చూపెట్టాడు. అలాగే దొరల దారుణమైన పెత్తనాలని చూపించే కథ 'ఏడులాంతర్ల సెంటరు'.
మనుషులెంత ఆశా జీవులో చెప్పే కథ 'దింపుడు కల్లం ఆశ'. ఊరిని కంటికి రెప్పలా చూసుకున్న మనీషి ధర్మారెడ్డి చనిపోతే అక్కడ చుట్టూ ఊర్ల దుఃఖం, దింపుడు కల్లం దగ్గర బతుకుతాడేమోనన్న ఆశ కన్నీళ్ల పర్యంతం చేస్తుంది.
'మైనం బొమ్మలు' లంబాడీ జీవితాల్లో కొత్త కోణాన్ని చూపించింది. సమ్మెట ఉమాదేవి రేలపూలు,జమ్మిపూలు కథలు చదివినంత భావన కలిగింది.
మనుషులని స్మరణ చేసుకుని ఆ ఆప్యాయతని,జీవన విధానాన్ని, కన్నీళ్ల లోయలని,కన్న బిడ్డను బాగా చూసుకోవాలని జానకమ్మ లాంటి ఎందరో  పూల మనుషుల కష్టాన్ని,పూల మాల కట్టినంత అందంగా రాశాడు. ముగింపు టర్నింగ్ పాయింట్.
అభివృద్ధి పేరుతో ఊర్లని ఎలా నాశనం చేస్తారో,అధికారుల లోభితనం,ధన కక్కూర్తిని, ఏం సదుపాయం లేక రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న 'దొమ్మరపాళెం' గ్రామం ద్వారా చూపిస్తాడు. ఇందులో సహృదయుడైన వీరయ్య తాత పాత్ర విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భాలు గురించి పల్లిపట్టు నాగరాజు యాలై పూడ్సింది అనే కవితలో
'దేశం లోపల దొరల సంగతేందీ..?
.
తెలుపు గురించి మాట్లాడే ముందు
నలుపు గురించి కూడా మాట్లాడాలి
వ్యధను గురించి మాట్లాడే ముందు
వధను గురించి కూడా మాట్లాడాలి '
అన్న కవితా పంక్తులు వీరయ్య తాత లేఖలో గమనించొచ్చు.
చిట్టచివరిగా 'మంత్రసాని వైద్యం' కన్నీళ్ళతో మొదలై కొత్త పొద్దుతో ముగుస్తుంది. 
కథల్ని చాలా వరకు summarize కావాలనే చేయలేదు. ఎందుకంటే ఫలానా కథలో సారాంశం ఇంతే అని చెప్పడానికి రచయిత విధానం అంతా ఇంతా కాదు. అది శోచనీయమైన అభివ్యక్తి, శైలి.

*

“If literature truly possesses a mysterious power, I think perhaps it is precisely this: that one can read a book by a writer of a different time, a different country, a different race, a different language, and a different culture and there encounter a sensation that is one's very own.”
―  అంటాడు చైనా రచయిత Hua You.
అతనన్నట్టుగా పై వాక్యాలు ఈ పుస్తకానికి సరిపోతాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో ఓ చారిత్రక నేపథ్యం ఉంది,కాలం వుంది, రాయలసీమ జీవుల వ్యధలు, కన్నీళ్ళున్నాయి, అక్కడ మాట్లాడే మాండలికముంది, సంస్కృతి ఉంది. సామాజిక, రాజకీయ,ప్రాంత పరిస్థితులను బాగా పరిశీలించి మనముందు కుప్పపోసిన కథలు. 
You'll definitely cuddle this book
😍
~
లిఖిత్ కుమార్ గోదా 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి