సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ మా బడి కతలు
(పుస్తక సమీక్ష-7)
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
ప్రస్తుత తెలుగు బాలసాహిత్యం దినదినాభివృద్ధి చెందుతూ నూతన చరిత్రను సృష్టిస్తుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే సాహిత్యంతో చరిత్రను తారాస్థాయిలో నిలుపుతుంది. బాల సాహిత్య కృషికి నిండు మనసుతో, అంకితభావంతో అటు వర్ధమాన రచయితలు, బాల రచయితలు ( బడి పిల్లలు), ఇటు మేలైన సాహిత్యాన్ని, నవభారతాన్ని రూపొందించాలనే ఆశయం, లక్ష్యం కలిగిన పెద్దలు (రచయితలు) అహర్నిశలు తమ సిరా స్వేదాన్ని చిందిస్తున్నారు.పిల్లలు , పెద్దలు ఎవరికి వారు నిత్యం బాల సాహిత్య ఉద్యానవనం పెంచాలని పోటీ పడుతూనే ఉన్నారు. నిరంతరం పిల్లలు, పెద్దలు సాహిత్య కార్యశాలలు నిర్వహిస్తూ, పాల్గొంటూ తెలుగుజాతికీ నిండయిన గౌరవం తీసుకొచ్చేలా పిల్లలు ఉపమన్యులులా, పెద్దలు భగీరథ మహర్షుల పట్టుదలతో సాహిత్య తపస్సుని ఆచరిస్తున్నారు. సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ ఉన్నారు.
అలా నిరంతరం సాహిత్యం కోసం పాటుపడుతూ, ఇప్పుడు మేలైన సాహిత్యాన్ని, చిగురించిన ప్రతి అక్షరాన్ని పిల్లల దాకా తీసుకెళ్లాలి అనే లక్ష్యం ఉన్న సాహితీవేత్తల్లో గరిపల్లి అశోక్ గారు ముందంజలో ఉంటారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే "నాంది" కవిత్వ సంకలనం తీసుకు రావడం తోనే బోధపడుతుంది వారికి సాహిత్యంపై అవధులు లేని అవ్యాజపు అభిమానం.
ముస్తాబాద్ బడి పిల్లలు రచించిన"జాంపండ్లు" కథా సంకలనానికి, తెలంగాణ బడి పిల్లల రాసిన"ఆకుపచ్చని ఆశలతో"కవితా సంకలనానికి, ఇలా ఎన్నో బాల సాహిత్యంలో బాలల మదిలో పూసిన అక్షరాలను సంకలనాలుగా వెలువరించిన సంపాదకులు.'బాలచెలిమి' నుండి మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో వెలువడిన 'తెలంగాణ బడి పిల్లల కథలు' ప్రాజక్టుకు కన్వీనర్ గా వ్యవహరించారు. 'దూడం నాంపల్లి రచనలు-పరిశీలన' ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. "ఎంకటి కతలు', 'మా బడి కతలు', 'సరికొత్త ఆవు-పులి కథలు' ఇటీవల అచ్చయిన బాలల సాహిత్యం. . గరి పెల్లి అశోక్, డా, పత్తిపాక మోహన్ కలిసి తెస్తున్న 'కరోనా కతలు' అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు బడి పిల్లల జీవితం పై, సమాజంలో చోటుచేసుకునే అంశాలనే రచయిత గరిపల్లి అశోక్ కథావస్తువులుగా తీసుకుని తెలుగు సాహిత్యంలో ఒక నూతన చరిత్రను సృష్టించే గొప్ప ప్రయత్నం చేశారు.
బడిలో పిల్లలు ఎలా ఉంటారో, బడి జీవనం ఎలా ఉంటుందో (ప్రభుత్వ పాఠశాల ఇందులో), బడి పిల్లల అంతర్గత జీవితాలను, విద్యార్థుల వ్యవహారపు తీరు పట్ల ఉపాధ్యాయులు తీసుకునే జాగ్రత్తలను, పరిష్కారాలను అందంగా, కన్నీరు ఒలికేలా కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.
ఈ కథల్లో కేవలం గరిపల్లి అశోక్ గారు అక్షరాలను కాదు, ఆశయం, ఆవేదనను జోడించి రచించారు. ఒకరకంగా చెప్పాలి అంటే కథ మన మాటలతో కాదు, కథలోని నాయకుడితో మాట్లాడితే కథ చదువరుల హృదయాల్లో జీవిస్తుంది అన్న తరహాలో లిఖించారు. అక్కడక్కడ తెలంగాణ యాసను జోడిస్తూ, కథలను కొత్త తరహాలో నడిపించారు.
మొదటి కథ "కరపత్రం", పేద కుటుంబంలో జీవిస్తూ, ఆలనా పాలనా చూసుకునే తండ్రి లేక, తల్లి కూలి కష్టంతో బ్రతుకుతూ, కనీసం రాసుకోవడానికి పుస్తకాలు కూడా కొనుక్కోలేక, దొరికిన కరపత్రాలనే రఫ్ నోట్స్ లాగా వాడుకుంటూనే, బడికి క్రమం తప్పకుండా వెళుతూ, ఎప్పుడూ ప్రథమంగా నిలిచే శేఖర్ లాంటి విద్యార్థుల జీవితాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి జీవితా లను కళ్ళకు కట్టినట్లు రాసారు రచయిత.
"బొంతలు" కథలో కూడా విహార యాత్రలో భాగంగా విద్యార్థులందరూ కొత్త బెడ్షీట్లు, దిండ్లు తెచ్చుకుంటే మహేష్ మటుకు పాత చీరలతో , లుంగీ లతో, పాత ధోతీలతో అందంగా కుట్టిన బొంతులను తెచ్చుకోవడం, అది చూసిన సహవిద్యార్థులు మహేష్ ని హేళన చేయడం, మహేష్ బాధపడడం, తరువాత ఉపాధ్యాయులు వచ్చి మహేష్ ని ఓదార్చి సహ విద్యార్థులు అందరకు వ్యర్థాలకు అర్థాన్నిచ్చే విషయాలు చెప్పడం,వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవడం మంచి పద్ధతి అని బోధించడం, ధనం లేకపోవబట్టే మహేష్ మీలాగా కొత్త దిండ్లు బెడ్షీట్లు తెచ్చుకోలేదని, అతని వద్ద డబ్బు ఉంటే అతను కూడా మీలాగే చేసేవాడని, పక్క వారిని హేళన చేయకూడదు అని హితబోధ చేయడంతో కథ కంచికి వస్తుంది. అచ్చంగా ఈ కథలో జరిగేవే నేడు పాఠశాలలో జరుగుతున్నాయి.ఇలాంటి కథలు చదువుతున్నంత సేపు పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.
"నీళ్లు" కథ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా కథలు మటుకు విద్యార్థుల జీవితాలను చూపిస్తే, "నీళ్లు", "చెత్త బుట్టలు" వంటి కథలు రాజుల కాలం నాటివే అయినప్పటికీ, పరిశుభ్రత, పరిపూర్ణ హృదయం ఎలా ఉంటాయో చక్కగా వివరించిన కథలు. దురాశకు పోతే జరిగే పరిణామాలు వివరించిన కథలు.
"నిజాయితీ", "ఫిల్టర్లు" కథలు అందరినీ ఆకర్షిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని 15 కథలు మణిరత్నాలే అని చెప్పుకోవచ్చు."మా బడి కతలు" వయ్యిలోని ప్రతి కథకు కూరేళ్ళ శ్రీనివాస్ గారు ఆయని కుంచెతో అందమైన చిత్రాలు చిత్రించి పుస్తకంలోని కథలలాగే శోభ తీసుకొచ్చారు. కేవలం నీతినే కాకుండా, మన కళ్ళ ముందు జరిగే జీవితాలనే కథలుగా రాయడం రచయిత గరిపల్లి అశోక్ గారికి సమాజం పై ఉన్న పట్టు, అవగాహన ఏంటో తెలుస్తుంది.
ఇలాంటి కథలు కచ్చితంగా నేటి తరానికి అవసరం. ఒక్క సారి చదివామంటే చాలు, ఇవి మన హృదయాలలో గూడు కట్టేసుకుంటాయి. అమలినమైన సాహిత్యాన్ని పిల్లల హృదయాలు దాకా తీసుకు రావాలనే రచయిత ఆకాంక్ష ఈ కథలో పొందుపరచబడి ఉంది. అన్ని వర్గాలకు వారికి ఉపయోగపడే ఇలాంటి కథలు (జీవితాలు) లిఖించి నందుకు రచయితను అభినందించకుండా ఉండలేం. ఇలాంటి రచనలు వెలుగులోకి వస్తే రేపు మన సమాజం దివ్యంగా, వైభవంతో విలసిల్లుతుంది. జై బాలసాహిత్యం!!
Published in Molaka news daily web magazine. Link 👇