- గుండె మంటలను చల్లార్చే "మది నదిలో"
★
లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself.
- John Stuart mill
మనిషి మనసులోని ఊహల నుండి, ఊసులు నుండి, నవ్వులు నుండి, తన జీవితంలో అనుభవిస్తున్న మానసిక సంక్షోభం నుండి, సామాజిక వివక్షతలనుండి, స్థితులు నుంచి, సంఘటనలు నుండి కవిత్వం పుట్టుకు రావచ్చు.
అచేతనంగా మారిన మనుషుల మనసులను చైతన్యపరిచి ముందుకు నడిపించగలిగేది కవిత్వం.అయాచితం లేదా అయోమయం నుంచి ఆలోచించే తీరుకు కవిత్వం మనల్ని తీర్చిదిద్దుతుంది. మేను నిండా కమ్ముకున్న చీకటి మురికిని, ఎదలోతుల్లో దాకా వెళ్లి కవిత్వ డిటర్జెంట్ మాత్రమే శుభ్రపరచ కలదు.
కవయిత్రి చిట్టే సిధ్ధ లలిత గారి కవిత్వం కూడా కొన్ని ఊహలతో, మరికొన్ని ఆశలతో, కడుపులో నిండిపోయిన ఆవేదనతో రూపుదిద్దుకుంది. ప్రేయసి ప్రియుడు కోసం పడే ఆరాటం, అతనితో కలిసి పాడుకోవాలి అనుకుంటున్న విరహ కవిత్వాలు ఇందులో విరివిగా ఉన్నాయి. ఇందులో కొన్ని కవితలు మాత్రం "మనీషి" కోసం ఆరాటపడుతున్నాయి. కవయిత్రి కవితలు చదివిన తర్వాత ఒక అభిప్రాయం కలిగింది. తాను చెట్టులా, ప్రకృతిని ఆస్వాదించుకుంటూ కవిత్వాన్ని అల్లుకున్న తీరు బావుంది.
కవయిత్రి అది ఇది అని కాకుండా అన్ని వర్గాల కవిత్వంలో అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇందులో స్త్రీ వాద కవిత్వం తక్కువే అయినప్పటికీ అవి మన పై చూపించే ప్రభావం కొంచెం ఎక్కువే.
★స్త్రీ చరిత్ర
తరతరాల స్త్రీ చరిత్రను
తరచి చూసావా...
ఆమె ఎదుర్కొన్న వివక్షతను
గమనించావా..
అసమానతలతో...
తన ఉనికిని పోగొట్టుకున్న వైనాన్ని
పరికించావా...
మొన్నటివరకూ.. ఆడపిల్ల..
చదవకూడదు.. నవ్వకూడదు... గడపదాటకూడదనే ఆంక్షలతో అణచివేయబడింది..!
ఎదిగితే గుండెలమీద కుంపటన్నారు..! ఎదురుతిరిగితే బరితెగించిందన్నారు..!
ఆమె స్వేచ్ఛను హరించి... కట్టుబాట్లతో ఆమెను బందీనిచేసారు..!
అయ్యో.. ఆడపిల్ల పుట్టిందా...
అనర్థమంటూ..
ఆడజన్మను హేళన చేసారు..!
కాలమెంత మారినా.. స్త్రీ జీవితమేమీ మారలేదు..!
ఆమె జీవనగతిలో మార్పేమీలేదు.
చదువులెన్ని చదివినా.. ఉద్యోగాలు చేసినా..
కట్నంతో మొగుడ్ని కొనుక్కునే
దుస్థితిలోనే ఉందామె..!
అవును.. ప్రస్తుతం..
స్త్రీ ఎంతో అభ్యున్నతిని సాధించింది..!
ఇప్పుడు ఇంట్లోనే కాదు
బయట కూడా
ఉద్యోగం పేరుతో చాకిరీ చేస్తుందామె..! అంతే తేడా.!!(పేజీ నెం.71)
"స్త్రీ చరిత్ర" అన్న శీర్షికతో రాసుకున్న ఈ కవిత, ఇప్పటికి అక్కడక్కడా కొనసాగుతున్న స్త్రీలపై పురుషాహంకారాన్ని వెల్లడిస్తుంది. ఇప్పటికీ స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షతను, అణిచివేతలను వివరిస్తుంది. కాలం ఎంత మారినా స్త్రీ జీవితం ఏమీ మారలేదు అంటూ చదువులెన్ని చదివినా ఉద్యోగాలు చేసిన కట్నంతో మొగుడ్ని కొనుక్కునే దుస్థితి ఉందని ప్రెసెంట్ సోషల్ ఇష్యూ తీసుకుని రాసిన వాక్యాలు బాగున్నాయి. ముగింపులో "అవును ప్రస్తుతం స్త్రీ ఎంతో అభ్యున్నతిని సాధించింది అంటూ రాసినా, ఉద్యోగం పేరిట ఆమె చాకిరీ చేస్తుందని" చెప్పారు.
★సారీ..
నేను.. చాలా.. బిజీగా.. ఉన్నాను . నన్ను.. డిస్టర్బ్ చెయ్యవద్దు. వెలిసిపోయిన జీవితానికి..
రంగులద్దుకుంటున్నాను. శిథిలమైన.. నా..
జీవనసౌధాన్ని
పునఃనిర్మించుకుంటున్నాను..!!"(పే.నెం:28)
ఈ కవిత కొంచెం హార్ట్ టచింగ్ గా అనిపించింది. గొప్ప అర్థం ఇందులో ఉంది. మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా" అన్న తరహాలో ఉన్నట్లు అనిపించింది. "ఎవరు మన జీవితాన్ని బాగు చేయరు, మన కష్టాల్ని మనమే ఎదుర్కోవాలి. చినుగులు పడ్డ మన జీవితాలకు మనమే కుట్లు వేసుకోవాలి" అని అర్థం ఇచ్చే కవిత.
"సమస్త మానవాళి.. ఒకవైపు
కారణం లేకుండా... కక్షగట్టి..
కదనానికి కాలు దువ్వే
కరోనా అటువైపు..."
కదన రంగం పోయెం(పేజీ నెం.38)లో ప్రపంచ మానవాళిని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ పై కలం తుపాకీ ఎక్కుపెట్టిన తీరు బావుంది.చక్కని కంటెంట్ తో కరెంట్ ఇష్యూని తీసుకుని మనోధైర్యాన్ని రేకెత్తించేలా రాశారు కవయిత్రి.ఈ కవిత చదివాక వీరిది స్పందించే హృదయం అని అర్థం అయ్యింది. గొప్ప పోయెట్రీకి ప్రాణాన్ని ఇచ్చేది స్పందించగల హృదయమే.
★అమ్మ
పచ్చటి పూదోట మా అమ్మ!
ఆత్మీయతల కొమ్మలతో..
అనురాగపు రెమ్మలతో.. అనుబంధాల తీవెలతో..
అందంగా అల్లుకున్న పొదరిల్లు మా అమ్మ! వేకువ చుక్క మా అమ్మకు నేస్తం...
అమ్మతోపాటూ.. కళ్ళు నులుముకుంటూ...
నిద్రలేస్తుంది మరి!
మా అమ్మ కునుకుతీసాకే...
చంద్రుడు.. చుక్కలతో కబుర్లు చెప్పేవాడు!
మా అమ్మ పాదాల అలికిడికి లేచిన తొలికోడి...
కొక్కొరొకో అంటూ.. సుప్రభాతాలు వినిపిస్తుంది!
మా ఇంటిముంగిట ముగ్గును చూడాలనే.. సూర్యుడు పక్కదులుపుకుని పైకొచ్చేవాడు..!
లాలిపాటలు.. జోలపాటలు
మా అమ్మ స్వరంలో ప్రవాహాలే..! కలతైనా.. కంటినలతైనా...
కష్టాన్ని పమిటచెంగుతోనే పంచుకునేది మా అమ్మ!
గడప దాటడం కంటే.. తలుపుచాటునే.. ఇష్టపడేది..
ఓర్పుకు మారుపేరు...
సహనానికి మరోరూపు... శ్రమించడంలో..
క్షమించడంలో భూమాత..
నా విశ్వమంతా నిండిపోయిన
అమ్మకు నా వందనం!!(పే.నెం.:74)
అమ్మ గురించి ఎన్ని కవితలు చదివినా మనసుకు విసుగు రాదు. పల్లెటూరు వాతావరణం లో ఉండే అమ్మల ప్రేమలు అసామాన్యం. బహుశా కవయిత్రి పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చి ఉండొచ్చు. "అమ్మ" అనే శీర్షికతో రాసిన ఈ కవిత రోజూ చూసే అమ్మను గురించి సాధారణంగా చెప్పినా కొంచెం కొత్తగా రాసే ప్రయత్నం చేశారు. ఇందులో వేకువచుక్క అమ్మకు నేస్తం అని అమ్మ తో పాటే కళ్ళు నులుముకుంటూ నిద్ర లేస్తుంది అని, వాళ్ళ అమ్మ కునుకు తీసాకే చంద్రుడు చుక్కలతో కబుర్లు చెప్పే వాడిని, వాళ్ళ అమ్మ పాదాలు అలికిడికి లేచిన తొలికోడి కొక్కొరొక్కో అంటూ సుప్రభాతాలు వినిపిస్తుందని, కవయిత్రి ఇంటి ముంగిట ముగ్గును చూడాలనే, సూర్యుడు పక్క దులుపుకొని పైకి వచ్చేవాడని చెప్పిన తీరు బాగుంది.
★పేజీలు (పే.నెం: 84) కవితలో
"జీవితమనే పుస్తకంలో
మొదటి పేజీని నేను..
చివరి పేజీవి నువ్వు..
మధ్య పేజీలలో..
నాకు నువ్వు.. నీకు నేనుగా
మనిద్దరమే.. కదా."
అంటూ రాసిన ప్రేమ కవిత గుండెను ఆకట్టుకుంది. ఇందులో ఎన్నో ప్రేమ కవితలు ఉన్నప్పటికీ ఇది కొంచెం గుండెని రీచ్ అయింది.
అన్నదాతా సుఖీభవ (కవిత పేజి నెం: 41) అంటూ రాసిన కవితలో రైతన్నా నీ గురించి నాలుగు వాక్యాలు నన్ను రాయమన్నారు అని అంటూ కవితలో పొందికగా రైతు ఎంత కష్ట పడతాడో చెప్పకనే చెప్పారు.
"కవిత్వమొక హృదయగానం. ఎవరికి వారు ఎంచుకోవాల్సిన, వారికే సొంతమైన, సౌందర్య దారి. ఎవరి దారి వారిదే" అన్నాడు ఓ కవి. మొత్తంగా లలిత గారి కవిత్వం పేజీకి మించకుండా, తక్కువ పంక్తులతో అల్లుకున్న ఊహా వాక్యాలు, కన్నీటి పద్యాలు గుండెను హత్తుకున్నాయి. ప్రకృతిని కవితా వస్తువుగా తీసుకొని మనిషి జీవితాన్ని ఆవిష్కరించడం ఈ సంపుటికి కొంత ప్లస్ పాయింట్. కొన్ని కొన్ని కవితలు పరిశీలిస్తే వాటిలో పరమార్ధాలు చాలా మటుకు మనిషి ఉన్నతినే ఆకాంక్షిస్తున్నాయి. దాదాపు 180 కి పైగా కవితలున్న ఈ సంపుటి మనసుకు కాస్త రిఫ్రెష్మెంట్ కలిగిస్తుంది. కవితలన్నీ చదివాక మది నదిలో పడి మలినాన్ని పోగొట్టుకొని, కాస్తంతా పచ్చటి ఊపిరిని పీల్చుకున్నంత ఫీలింగ్ కలిగింది. కవితలను తన తరహాలో, తనదైన శైలిలో, తనదైన వాక్యాలు రాసుకున్న కవయిత్రి లలిత గారికి అభినందనలు.
06/06/2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి