'Capella songs of ఇయ్యాల ఊళ్ళో'
★
1
"All you need to know of a place is,
do people live there.
If they do, you know everything."
(A Village Life)
~
Louise Glück , Nobel prize in literature.
దేశానికి జీవనాడులగా కేవలం చెప్పుకోవడానికే పరిమితమై,పల్లెల్ని పల్లీయుల జీవితాలని చాలా చిన్న చూపు చూస్తూ, పట్టించుకోకుండా ఉన్న ఇప్పటి ఆధునిక సాంకేతిక నానో మైండ్స్ కి పల్లెల మట్టి, మనుషులు, మమతలు, ప్రేమలు గురించి కచ్చితంగా తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఉరుకుల పరుగులతో అతలాకుతలమౌతున్న ఇప్పటి జీవితాలకు మట్టి పరిమళం రుచి చూపించాల్సిన బాధ్యత కచ్చితంగా పల్లీయుడిగా బతికే కవితా ప్రేమికుడిపైన ఉంది. మట్టిలో పుట్టి, పెరిగి, కూలికెళ్ళిన అమ్మని తలుచుకున్నప్పుడో, గొడ్లు కాయడానికి వెళ్లినప్పుడో, సరదాగా జతగాళ్ళతో కలిసి ఈతగొట్టడానికి వెళ్ళినప్పుడో , అప్పటి స్మృతులను గుర్తు చేసుకుంటూ తన దేహంలో అల్లుకుపోయిన పల్లెటూరి గురించి ఒక కుర్రాడు ఏ సంగీత సాధనాలు లేకుండా పాడుకుంటున్న పాటలివి. వేదన, విరహం,వలపోత అన్నీ తను అనుభవించిన ప్రతీ పల్లె ఛాయల్ని గూండ్ల వెంకటనారాయణ తాను రాసిన ఇయ్యాల 'ఊళ్ళో కవిత్వంలో' నిక్షిప్తపరుచుకున్నాడు.
2
>ఇయ్యాల ఊళ్ళో
మాగాడి చుట్టూ కొంగల ఈకలు రాలినట్టు
పళ్ళెం చుట్టూ మెతుకులు
ఆటలకి పరుగుతీస్తూ
సగం కలిపి వదిలిన పాలబువ్వ
'పళ్ళెం చుట్టూ కళ్ళమే'
అని అరిసే అమ్మ గొంతు
కొత్తగా పండక్కి ఆలికిన పేడమట్టి కమ్మని వాసన గుడిసె చూరులకి వేలాడుతున్న ఎండ
మట్టిదుమ్ము అరిచేతుల నిండా అద్దుకొని
గురి చూసి కొట్టిన గోళీకాయ కేరింత
గాలిని మేస్తూ మబ్బుల పరుగు
రెక్కలతో ఎండని విసురుతూ పచ్చుల పయానాం
జంగిడి గొడ్లు అడివికి బోయిన బాటంతా
గిట్టల జాడలు
పేడకల్ల తాంబేళ్ల గుంపు
బర్రెపెండ మీద కుచ్చిన రాయి
నెత్తిన పొదిగిన ఉంగరం
ఒంటి చుట్టూతా నీడని పెనేసుకున్న చెట్లు
పగలంతా గోళీలాటలో కాలానికి దుమ్ము పూసి,
మట్టి పులుముకొని వెళ్లి
ఇంటిముందు వాలగానే అమ్మ చివాట్లు
బెరుకు బెరుగ్గా గడపలోకి చేరి
మంచం మీద ముడుక్కుంటే
అప్పటిదాకా తిట్టిన అమ్మ
అప్పుడే బతిమిలాడి ఒళ్ళో కూచ్చోబెట్టుకొని
కొసరి కొసరి బువ్వ తినిపిస్తుంది
అప్పుడు బుగ్గ మీద అమ్మ పెట్టిన ముద్దు
ఒళ్ళంతా చక్కిలిగింతలు పుట్టిన కులుకు
కాసేపు పక్కమీద కన్నుకొరికి
కునుకు తీరి, ఇంటి ముందు
దడి పక్కన నిలబడగానే
నెత్తిన సూర్యుడు కుంకుమ చల్లుకున్న పుల్లెద్దులాగా
గుడిసెనకమాల కొట్టంలోకి చొరబడుతూ కనబడతాడు
బజాట్లో ఊతకర్ర నేల పొడుస్తూ
అడుగులు లెక్కపెడుతూ
చెట్టు కొమ్మలంతున్న
బుర్ర మీసాల సందున
చిరునవ్వు పిట్టల్ని ఎగరేస్తూ
ముతక తాత వెళ్తూ ఉంటాడు
దిబ్బలో ఎండిన పెంటకుప్పల్ని
గెలిగిస్తూ కోళ్ల గుంపు
మర్నాడు పండక్కి పళ్ళెంలో
పొగలు కక్కే రాగిసంగటి ముద్దల నడుమ
చియ్య ముక్కల రుచి విందు
నీళ్ళతొట్టి కాడ జాలాడమ్మటి
బండ మీద అంట్లు తోముతూ
గాజుల చేతులకి బూడిద పూసుకున్న అమ్మ
తూరుపు ముంగిట్లో
ఎడ్డకొండ ఎనకమాల
తొంగిచూస్తున్న పున్నమినాటి
జీరంగిగుడ్డు చంద్రుడు
సావిటి కాడ మసీదులో
అల్లాని పిలుస్తున్న గొంతు
ఎద్దుల కాడి మీద గడ్డిమోపు కట్టుకొని
అరక తోలుకుంటూ వస్తున్న నాన్న
పైన నింగిలో
సగం చీకటి సగం వెలుతురు నిండుకొని ఉంది
బతుకులోని తీపి చేదుల్లాగా
ఊరంతా ఇప్పుడు నలుపూ తెలుపుల
గచ్చకాయలా ఉంది.
వాస్తవానికి ఈ కవితల్ని విప్పి విమర్శ (విశ్లేషణ అంటే బాగుంటుందేమో) చేయాల్సినంత పనేమీ లేదు. ఇతను ఈ కవితలో చెప్పేది ఒక పిల్లాడి జీవితం ఊరిలో సాధారణ అనేక దృశ్యాలు. పిల్లలు ఆటల్లో మునిగితే ఎంత ఆతృతగా తిండిమీద కూడా దృష్టి పెట్టకుండా పరుగులు తీస్తారు దానిని ముందు ప్రారంభించి ఆ నేపథ్యంలో ఊరి జీవితాన్ని, అందులోని నలుపూ తెలుపులు లాంటి తీపి చేదును పట్టి చూపించాడు.
ఈ రాతరిది ఎక్కువగా Narrative poetry. తన ఊరి భాషని,పద వాడుకని సర్వసాధారణంగా,మనతో మాట్లాడుతున్నట్లు కవిత్వం చేసేస్తాడు. కవితల్ని నిర్మించే పద్దతి చాలా flexible గా, detailing గా కనబడుతుంది.
ఇతను పల్లెపదాలతో బతుకుతున్నందున సామెతలతో కవిత్వం రాస్తున్నాడా? లేక వాళ్ళూరి సామెతల్ని సమకూర్చుతున్నాడా? అని ఆశ్చర్యపోయాను.
ఆలోచనతో అవినాభావ సంబంధం ఉన్న వస్తు సముదాయాన్నీ,ఘటనల క్రమాన్ని, సన్నివేశాల సమాహారాన్నీ,జత చేస్తూ 'ఆడిటరీ ఇమిజినేషన్' పద్దతిని చాలా ఇంపుగా వాడిన వాక్యాలు ఇందులో ఉన్నాయి.
> మమ్మ కళ్ళలో వాళ్ళూరు
మమ్మ అప్పుడప్పుడూ తనలో తను
గొణుక్కుంటూ ఉంటుంది
కొన్ని సార్లు ఎవరికీ వినిపించని పాటలు పాడుకుంటూ ఉంటుంది
బువ్వ ఒండుతూనో, కసువు ఊడుస్తూనో మాట్లాడుకుంటూనే ఉంటుంది.
ఏ పనీ లేక పోయినా ఒక్కో సారి పదేపదే "ఓరా..."అని పిలుత్తూ ఉంటుంది.
నేనాం పిలుపు పెద్దగా పట్టించుకోను.
కొన్ని సార్లు "ఏందవా.."అని ఎళ్తే,
ఎందుకు పిలిచానా అని తనలో తను ఆలోచించుకొని
"పిలుత్తుంటే ఎంత సేపటికీ రావేంది"అని తిట్టి పోతుంది.
నాకప్పుడయితే పిచ్చి కోపమొస్తుంది
"మా నారాయణ కొచ్చే పిల్ల ఎట్టుంటదో. మా ఊరమ్మాయినే సెయ్యాలి. ఈ సావాన్లన్నీ దాని కోసవే" అంటది.
గూళ్ళల్లో ఒదిగిన పెద్ద బేసా నుండి సిన్న గలాసు దాకా అందుకే వాడకుండుంచింది.
నేను కూచ్చోని రాసుకుంటంటే "పిచ్చి పన్లన్నీ సేత్తుంటాడు."అని బుగ్గ గిచ్చి ముద్దు పెట్టుకొని పోతుంది.
కొన్ని సార్లయితే చెప్పిన పనే ఎన్నో చెప్తూ ఉంటుంది చచ్చిపోయిన వాళ్ళ నాన్న పేరు తలుచుకున్నట్టు
కొన్ని సార్లు మమ్మ మాట్లాడితే
వాళ్లూరు గుర్తొస్తుంది
ఎన్నేళ్ళు అయితుందో
మమ్మ ఈ ఊర్లో అడుగుపెట్టి
ఇంకా ఆవ గొంతులో వాళ్ళూరు.
వాళ్ళమ్మని పిచ్చిరావక్కా అనే వాళ్ళంటా
మా నాన్న అప్పుడప్పుడూ అదే మాటతో
మమ్మను ఎక్కిరిస్తుంటాడు
అవేవీ పట్టించుకోదు మమ్మ
ఏ పనీ లేకపోతే పడుకొని పైకి చూస్తూ
కనురెప్ప వేయకుండా కింద పెదవిని అప్పుడప్పుడు కొరుకుతూ
ఆలోచిస్తూ ఉంటుంది.
అసలు ఆవ కళ్ళ ఎదురు గాలిలో
ఏ లోకం ఉండి ఉంటుంది?
ఆ లోకంలో ఏమేమి ఉండుంటాయి?
మమ్మకు సరిగ్గా అంట్లు తోమను రాదు
బట్టలు మట్టి పోయేలా ఉతకటం రాదు
బువ్వాకూరా రుచిగా వండటం కూడా రాదు
ఆవ ఇల్లూడిస్తే సగం కసువు బండల మీదే పొర్లాడుతూ ఉంటుంది
ఆవకి సరిగ్గా పనే సెయ్యను రాదు.
కానీ వాళ్ళమ్మ కాడ నేర్చుకున్న
కోడికూర, సంగటి వండితే మాత్తరం
అప్పటిదాకా నాలికమీద రుసులన్నీ ఏ చెట్లు ఎతుక్కుంటూ పోతాయో
కోడిచారు అద్దుకున్న సంగటి ముద్ద
ఊళ్ళో బొడ్రాయి ఉన్నట్టు వోరం రోజులైనా నిలబడాల్సిందే.
చేలో పని ఎంపర్లాడుతూ చేసిద్ది
చేని మీద తిరిగే ఉత్తితీతి పిట్టలాగా
ఒక్కతే కలుపు తీసుకుంటుంది.
ఇద్దరు పెళ్ళాలున్న మా నాన్నంటే
మమ్మకి అప్పుడప్పుడూ బో కచ్చ.
ఏడాదికి ఒక సారన్నా మా పిన్నావ మమ్మా తిట్టుకుంటుంటారు
ఎప్పుడన్నా మా నాన్న కొడితే
ఇంకంతే!వారం రోజులు కురిసిన తుపానులో
నానిన అడివిలాగ అయితుంది ఇళ్లు.
మా నాన్ని బెదిరియ్యాటానికి
"మన్నోల్లకి చెభ్తానని"పసిబిడ్డలాగా ఏడ్చిద్ది
"ఒక్కనాడన్నా మా నాన్న మమ్మని కొట్టెరగడు
ఇట్ట మిడియాలం సూపిచ్చే నీతో ఎవుడు
కాపురం జేత్తరు పో.."అని ఇదిలిచ్చి
బట్టలు సర్దుకొని వాళ్ళమ్మా నాన్నా లేని
వాళ్లూరు పోతానంటది.
మమ్మ గెవుతుల్లో ఆ ఊరు ఎలా ఉంటుందో వాళ్లమ్మా నాన్నా లేకుండయితే ఉండరనుకుంటా.
ఎప్పుడన్నా మమ్మమ్మ ఊరెళితే
ఊరిలోని పతి ఇంటినీ పలకరించబోతే
పొద్దుపోదు మమ్మకు
యాభై ఇల్లులున్న ఆ చిన్న ఊరిలో
తిరుపతమ్మ పలకరించని మడిసి
చెయ్యి కడగని ఇళ్లు ఉండదు.
ముంగిలా ఉండే వాళ్లన్నకి ఎడతెగని
కబుర్లు చెప్పిద్ది
'మా వొదిన దోసొక్కలేసి పప్పు జెత్తే
ఎంత కమ్మగుంటదో ' అని ఎన్ని సార్లు జెప్పిద్దో
ఆ ఊరు నుంచి తిరిగొచ్చే పతి సారీ
మళ్ళీ వచ్చి ఈ ఊరు సూత్తనో సూడనో
అనే బెంగతోనే తిరిగెల్లేది.
దొంతోరపల్లె తువ్వ దారి మీద నడుత్తూ
కొండ చాటుగా ఉన్న వాళ్ళ అమ్మ గారి ఊరిని
ఎన్ని సార్లు తడి కళ్ళతో సూసిద్దో... దానికి అంతే లేదు.
ఈ పుస్తకంలో రాతరి తన అమ్మని తలంచి,అమ్మని, ఆమెతో మమేకమైన జ్ఞాపకాలని ఇందులో నాలుగు కవితల్లో రాసుకున్నాడు. ఒక్కొక్క దానిది ఒక్కో ఊసు. పనికెళ్ళిన కూలి తల్లి గురించి ఏడ్చే పిల్లోడి విచారగీతిక -''అమ్మింకా ఇంటికి రాలేదు''; చుట్టపు చూపుగా పుట్టినూరొచ్చిన వాళ్ళమ్మతో ఊరోళ్ళు చూపించే మమకారం,పంచుకునే విచారం - ''ఎన్నటి రాగి సంగటో'';ఆత్మీయతలు అనుబంధాలు అరకొరగా ఉండే నగరజీవితంలో అమ్మని తలుచుకుని కనీసం అమ్మ కొంగునైనా పంపమనే కొడుకు కన్నీళ్ళు - "అమ్మ కొంగు తోడు కావాలి" ఏ కవితల్లోనైనా తల్లి(పై) ప్రేమ మనల్ని పెనవేసుకుంటుంది. అమాయకంగా,చెమటదేహాలతో బతికే అనేక అమ్మల బతుకులు,గమనాలు ఇందులో మనకు తారపడతాయి.
★
"…
పందిరి కొసన పండగ తారలాగా
క్రిస్మస్ అనగానే
నువ్వే మతికొస్తావురా లాజర్గా."(పండగపూట నీతో)
పల్లెల్లో క్రిస్మస్ పండుగను జరుపుకునే తీరును వర్ణించే తీరు చలిలో కాచుకున్న మంటలా హాయిగా అనిపిస్తుంది.
> వాన గాలి
ఒక్కన్ని కూర్చున్నాక ఇంకేమీ తోచదు
కాస్త గాలి
అక్కడక్కడా చుక్కలు
ఇలాంటి రోజుల్లోనే నువ్వు గుర్తుకు వస్తావు
చావులూ పుట్టకలూ ఏడుపులూ సిద్దాంతాలూ అన్నీ నా నుంచి యడమయ్యి
నా ఆవేశమంతా చల్లబడిపోయాక
ఊరిలో కానుగ చెట్టుకింద కూర్చొని
నువ్వు చెప్పిన కుందేలుపిల్ల కత మనసులో మెదులుతుంది.
వానలో తిన్న కలేకాయల రుచి
ఉన్నట్టుండి మతికి వస్తుంది.
కంది చేలో పరిగెత్తుతూ కాలికి కొయ్య గుచ్చుకొని తగిలిన గాయం
దానిని వేలితో తడుముకుంటే
నువ్వు కట్టిన కట్ట
బెదురుతో నీ చూపులు
అప్పుడే నిన్ను తొలిసారి ముద్దు పెట్టుకుంది
ఇప్పుడివన్నీ ఇలా ఒక్కన్నే కూర్చున్నాక గుర్తొస్తూ ఉంటాయి
పగులు మిరపతోటలో పాము ఒళ్ళో దూకి
మెత్తగా పాక్కుంటూ పోయిన స్పర్శ గుర్తొస్తుంది.
వానకి ముందు
కొండంతా మబ్బుని కప్పుకోవడం
ఇంటి ముందు నిల్చొని చూస్తుంటే
నువ్వు దగ్గరికొచ్చి నవ్వి
ఏముందని అలా చూస్తావు అని పక్కనే నిల్చోగానే
వానగాలి నునుమెత్తగా తాకుతూ పోయేది
ఊరికి దూరంగా జరిగాక ఇవే
తలుస్తూ ఉంటాను
ఇవి తలుచుకొని నీకు ఏవో కబుర్లు చెబుతున్నట్టు
కవిత్వం రాసుకుంటాను
నువ్వూ ఊరూ కవిత్వ
ఇప్పుడు ఇవి మాత్రమే నాకు మిగిలింది.
ఇలా ప్రియురాలితో చెప్పుకోవాలనుకునే కన్నీటి చారికలు కూడా కనిపిస్తాయి. వాటిలోనూ అతణ్ణి వీడని పల్లె ఉంది.
ఇతనికి కురిసే వాన, వీచే గాలి,నల్లని రాత్రి, కప్పబడ్డ వెన్నెలంటే అత్యంత ప్రీతి కూడా. అందుకే చాలా వరకు వాటినే కవితా వస్తువులుగా మార్చుకున్నాడు.
3
ఇంకా ఈ కవిత్వ సంపుటిలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు -
ఎక్కడో ఇప్పటి జీవితం మీద
ప్రేమ సన్నగిల్లినప్పుడే
గతంలోకి పోతుంటాం అనుకుంటా
•
కోల్పోయినవి ఎంతటి మధురమైనవో
కోల్పోయిన నీకే కాదు ఈ సృష్టికీ తెలీదు
జీవితంలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన
ఒక మధుర ఘడియనైనా కోల్పోవడం
ఈ సమస్త మానవ లోకపు పరాజయం
అది ఈ సృష్టి నెత్తిన ఒక విషాధ శాశ్వత హస్తిక
~
Interior గా ఏదో ఒక తాత్వికతను తనకు తానే చెప్పుకుంటున్నట్టు.
తగుళ్ళ గోపాల్ "దండకడియం"లోని ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం మతికొచ్చింది ఇందులోని"ఆమె లోకం" చదువుతున్నప్పుడు. పల్లి పట్టు నాగరాజు "యాలై పూడ్సింది" కవిత్వ సంపుటిలోని కుశాల,రుక్కత్త లాంటి కవితలు గుర్తొచ్చాయి. అంటే ఏ ప్రాంతానికి చెందిన పదజాలాన్ని ఎవరికి వాళ్ళు తమ కవిత్వంలోకి తెచ్చుకున్నారన్నమాట.
ఇంకా ఇతనికి ఎర్రని విప్లవాన్ని ప్రేమించే అటవీ అన్నలని చూడాలని, కార్ల్ మార్క్స్ తో చెలిమి చేయాలని బహు ప్రీతి. అందుకే ఎంతో ప్రేమగా వాళ్ళపై కవిత్వం రాసుకున్నాడు.
ఇవి కేవలం ఎమోషన్స్ ఇమాజినేషన్స్ డాక్యుమెంటేషనే కాదు, జీవనానికి సమూల స్తంభాలుగా అయ్యుండి కూడా పరిగణింపబడని మనుషుల,పల్లెల జీవరాతలు. పల్లెల మనుగడ,మరుగున పడకూడదని రాసుకున్న కవితలు. ఈ కవి తను వాడే ఉపమానాలకు పల్లెటూరి జీవన సంబంధితాలనే ఒక పరిధిలోకి పెట్టుకుని రాయలేదు. అవి జీవితంలో కలిసిపోయినవి తనకు. తనకు ఉపమేయాలు ఉపమానాలు వేరు వేరు కాదు. వాటిని వీటితోనూ, వీటిని వాటితోనూ ద్వంద్వ భావ సముచితంగా పోల్చుకుంటూ రాసుకున్నవి. ఒక్కమాటగా ఈ పుస్తకంలోని కవితలు పల్లె ఆత్మగీతాలు. సజీవంగా నిలబడగలిగే "సబాల్టర్న్ పోయెట్రీ".
కవిత్వమంటే ఇప్పటి తరం యువకులకి కొన్ని లవ్ పోయెమ్స్ అనుకునే సోకాల్డ్ సాహిత్యకారుల మాటల్ని కొట్టి పారేసే విధంగా రాసుకున్న అస్థిత్వ,అనుభూతుల,అనుభువాల కావ్యం. తప్పకుండా చదవాల్సిన కవిత్వం. ఇది ఒట్టి మాట మాత్రం కాదు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన హోరు ప్రచురణలకు అభినందనలు మరియు శుభాకాంక్షలు. రాతరికి,పాటగాడికి మేల్తలుపులు.
⚫
లిఖిత్ కుమార్ గోదా.
25-01-2023
పుస్తకం కొనాలనుకున్నవారు.
7032553063 కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి పొందవచ్చు.
నవోదయలో కూడా మీకు లభిస్తాయి.
బుక్ 100 రూ... పోస్టల్ చార్జెస్ 36 రూ…