6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

కృష్ణానగర్ వీధుల్లో - రవీంద్ర రావెళ్ళ

 చీకటి అమావాస్యా వెన్నెలా వెలుతురూ వర్షమూ

వీటిని ఇష్టపడే రావెళ్ళ రవీంద్రకి,


నీ Debut Short Stories collection “కృష్ణానగర్ వీధుల్లో” చదవడం పూర్తయింది. ప్రధానంగా నీ 10 కథల్లోనూ నువ్వు వాడిన నీవైన వాక్యాలు నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా నేను ఇంగ్లీష్ పుస్తకాల్లోనూ లేదా స్వగతాలను ఆవిష్కరించే పుస్తకాల్లోనూ- చదివేటప్పుడు వాటిల్లో రచయిత మోనోలోగ్ని చాలా ఇష్టపడుతాను. వాళ్లు మాత్రమే అనుభవించినదాన్ని, కథల మధ్యలో చెబుతూ చెబుతూ ఆ అనుభవపూర్వతత్వాన్ని, నొప్పిని పాఠకుడు ఆగి, ఆలోచించి మళ్లీ మళ్లీ చదివి హైలేటర్ తీసుకొని హైలెట్ చేసుకునే విధంగా రాస్తారు, వెనుకగా మాట్లాడతారు. నీ పుస్తకంలో కొన్ని వాక్యాలు లేదా కొటేషన్లూ అలాంటి అనుభవాన్ని కలిగించాయి అంటాను. నీ కథల్లో నువ్వు చెప్పిన కోట్స్ కి (సర్వసాధారణమైనవి కావు, జీవితంలో నుంచి వచ్చినవి, తెచ్చినవి) చాలా కనెక్ట్ అయ్యాను. కథను చెబుతూ కథంతా పాత్రలచేత చూపించినప్పటికీ రచయిత మాట్లాడేది ఎంచక్కా వినిపిస్తుంది.


కథ చెప్పే తీరు నీ కథలకి నీకు బాగా అలవడింది. సాధారణంగా సరళంగా వాక్యం రాస్తే అది చదివించేదిగా కమర్షియల్ రైటింగ్ గా నా వరకు పరిగణింపబడుతుంది. కానీ నీ వాక్యం నా ఆలోచనని ఉల్టా చేసింది. అది కేవలం నీ ఒక్క వాక్యాల వల్లనే అయ్యుండొచ్చు. చాలా సరళంగా, Poetical Linesతో గాఢమైన భాషను నిర్మించగలిగావు.


 ‘కృష్ణకాంత్ పార్క్’ నాకు బాగా నచ్చిన కథ. 70 ఏళ్ల ఆడమనిషి మోనోటోన్ని బాగా రాసి, వాళ్ళ ఆలోచనకి- గత అనుభూతుల వేదనకి మధ్య గల సంబంధాన్ని, ఉన్నట్టుండి అవసరమే లేకుండా మనుషుల్ని గుర్తు తెచ్చుకొని కుమిలిపోయే ఆవిడ కథ, ఆ పార్క్ కి మధ్య నడకని చాలా అందంగా రాశావు. బహుశా అలాంటి వయసు గల వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నావంటే సరిపోతుందేమో.


అలాగే ‘లూప్’ కథలో రెండు వేరువేరు జీవితాలు ఉన్నా, వర్తమానాన్ని, paradoxical mindsetsని పరిచయం చేయడం బాగుంది. అందమూ.‌‌.. ప్రేమ చదివి అడల్ట్ ఏజ్ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 


‘కృష్ణానగర్ పిల్లర్ నెంబర్ 1550’లో ఇలా అంటాడు కదా Narrator - “నేనీ ప్రపంచానికి కొత్త కథలు వినిపించాలని వచ్చాను.” అలాగే Author’s Noteలో “ఏదో కొత్తగా రాయాలని ఆలోచనతో కాకుండా నిజాలని పక్కన పెట్టకుండా రాశాను” అని అన్నావు కదా. ఆ వాక్యాలకి నిజాయితీని చేకూర్చావన్నది మాత్రం అర్థం అయింది. 


ఈ 10 కథలూ చదివాక ఒక్కసారిగా David Foster Wallace రాసిన The Nature of the Fun వ్యాసంలో Don Delillo తన Mao || అనే పుస్తకంలో రచయిత గురించి చెబుతూ ఆ రచయితకి రచన (Book-in-progress) అదృశమానంగా, కనిపించకుండా సరిగ్గా తయారుకాని శిశువుగా, ఎప్పుడూ తననే గమనిస్తూ తనని పరిపూర్ణం చేయమన్నట్లు చూస్తుంటుంది అంటాడు. నిజానికి ఆ కథనం లాంటి పోలిక అంతా రచయిత తను చెప్పాలనుకున్న పీడనే అనుకుంటాను. ఈ కథలంతా ఒకరకంగా నిన్ను పీడించినవి అయ్యుండొచ్చు. పీడన వేరే విధంగా కాదు కానీ నువ్వు ఆ మనుషుల్ని మోసిన తీరు ఆ మనుషులు బాధల్ని పక్కనుండి విన్నట్లు అనిపిస్తుంది. నువ్వు చెప్పాలనుకున్న “కృష్ణానగర్ మనుషుల పీడన(లేదా వేదన)” అంతా మనసు పొరల్లో నిండిపోయింది. ఎందుకో ఆ మనుషుల్ని కలిసి వాళ్లు పడే మనేది కాస్త పంచుకోవాలనిపించింది. ఇంకా Effectiveగా, ఇలానే ఈ జనరేషన్ గురించి, కలల గురించి, కలలు గాయాలుగా విధ్వంసాలుగా మారే జీవితాల గురించి, వెన్నెలా వర్షమూ చీకటీ అమావాస్యా వెలుతురూ ఇలా మరిన్ని నీ ప్రియాతి ప్రియమైన కథలని, వాటి సంకేతాలని ప్రపంచానికి పంచుకో. నీవైన కొన్ని తాత్వికత నిండిన వాక్యాలని, సత్యమైన వాక్యాలని, అమాయకపు వాక్యాల్ని, ‘నిన్ను’లాంటి వాక్యాలని ఇంకా ఇంకా రాస్తావని ఆశిస్తూ…

లిఖిత్ కుమార్ గోదా 

05.09.2024